నేడు వరల్డ్ యూత్ స్కిల్స్ డే
‘నైపుణ్యానికి ఆసక్తి తొలి మెట్టు’ అంటారు. నేటి తరం యువత ఆసక్తి అనే తొలి మెట్టు ఎక్కి, ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ అద్భుతాలు సాధిస్తోంది. ‘అదృష్టం కాదు...ఆసక్తే నీ బలం, నైపుణ్యం, విజయరహస్యం’ అని చెప్పకనే చెబుతోంది. స్టీరియో టైప్ లైఫ్‌కి సెండాఫ్ ఇచ్చి నచ్చిన రంగంలో తమదైన ముద్రవేసేందుకు ఆసక్తి చూపుతోంది. వారసత్వంగా వస్తున్న వృత్తులకు ఆధునికతను జోడించి సంప్రదాయ కళలను అనుసంధానం చేయడం, టెక్ ప్రపంచాన్ని పక్కన పెట్టి ఊహలకి ఊతమివ్వడం, సాంకేతికతకు సృజనాత్మకతను మేళవించి తపనే పెట్టుబడిగా చేసుకుని అనుకున్న లక్ష్యాలను సాధించడంలో నేటి జెన్ జీ తరం జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది... సాంకేతిక రంగం నుంచి వినోద రంగం వరకు యువతలో ఎంతోమంది అద్భుతాలు సాధిస్తున్నారు... వారిలో కొందరి గురించి...
ఓన్లీ ట్యాలెంట్
మోడలింగ్ టు యాక్టింగ్
ఏ మాత్రం సినీ నేపథ్యం లేని కుటుంబాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి తమ సత్తా చాటుకునే వాళ్లు కూడా ఉన్నారు. అందులో మొదటి వరుసలో ఉంది అనీత్ పడ్డా. గతేడాది బాలీవుడ్‌లో సైలెంట్‌గా రిలీజై సెన్సేషన్‌ని సృష్టించిన సినిమా ‘సయ్యారా’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేసిన అనీత్ పడ్డా ఒక్కసారిగా బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లోకి చేరిపోయింది. గేయ రచయిత్రిగా వాణిబాత్రా పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం మాడ్‌డాక్ హర్రర్ కామెడీ యూనివర్స్ లోవస్తున్న తదుపరి చిత్రం ‘శక్తిషాలిని’లో నటిస్తోంది.
యాడ్ ఫిల్మ్ టు డైరెక్షన్
ప్రకటనలు, షార్ట్ ఫిల్మ్‌లతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన షాజియా ఇక్బాల్, 2025లో విడుదలైన ధడక్ –2తో ఫీచర్ ఫిల్మ్ దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. కథను భావోద్వేగపూరితంగా తెరకెక్కించినందుకు విమర్శకుల నుంచి ప్రశంసలందుకుంది. సామాజిక అంశాలను సున్నితంగా ఆవిష్కరించే దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. 2026 స్క్రీన్స్ అవార్డ్స్‌లో బ్రేక్ త్రూ డెబ్యూ డైరెక్టర్‌గా అవార్డు అందుకుంది.
కోల్‌కతా టు కేన్స్
కోల్‌కతాకు చెందిన మోధురా పాలిత్‌కి చిన్నప్పటి నుంచి కెమెరా అంటే మక్కువ ఎక్కువ. తల్లిదండ్రులిద్దరూ ఫొటోగ్రాఫర్లు కావడంతో స్వతహాగా లైటింగ్, కంపోజిషన్ వంటి విషయాలపై ఆసక్తి పెంచుకుంది. సహజ కాంతిని వినియోగించడం, భావోద్వేగాలకు అనుగుణంగా ఫ్రేమ్‌లను తీర్చిదిద్దడం ఆమె ప్రత్యేకత. షార్ట్‌ఫిల్మ్‌లు, బెంగాలీ, హిందీ సినిమాలు, వెబ్ సీరిస్‌లకు సినిమాటోగ్రఫర్‌గా చేసిన ఆమె పనితీరుకు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. 2026లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పియర్ ఆంజెన్యూ ఎక్సెలెన్స్ పురస్కారం అందుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ప్రపంచ వేదికపై భారతీయ ఫొటోగ్రఫీకి తీసుకొచ్చిన గౌరవం ఇది...
వెలకట్టలేని కళకి కొత్త వెలుగు
ఐటీరంగం నుంచి విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాలలో కృత్రిమ మేధ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు డిగ్రీ పాస్ అయినా, బీటెక్‌లో బ్యాక్‌లాగ్స్ కంప్లీట్ చే సినా ఉద్యోగాల బాట పట్టే యువత మెల్లగా తన దారి మార్చుకుంటోంది. సంప్రదాయ హస్తకళలకు ఆధునికతను జోడించి అద్భుతాలు సృష్టిస్తోంది.
గుజరాత్‌లోని కచ్‌కు చెందిన ముబస్సిరా ఖలీద్ ఖత్రీ సంప్రదాయ అజ్రక్ బ్లాక్ ప్రింటింగ్ కళాకారుల కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి అజ్రక్ కళను సున్నితంగా పరిశీలిస్తూ పెరిగిన ఖత్రీ దానిపై మక్కువ పెంచుకుంది. మూడు తరాలు కేవలం మగవారికి మాత్రమే పరిమితమైన ఈ కళలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది. హస్తకళను ఆధునిక ఫ్యాషన్‌కు అనుసంధానించే దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
ప్రస్తుతం ఖత్రీ ‘ఎలీసియన్’ అనే బ్రాండ్ పేరిట అజ్రక్ కళతో రూపొందించిన జాకెట్లు, కాఫ్తాన్లు, డ్రెస్సులు, ఇండో వెస్ట్రన్ దుస్తులను కొత్త తరానికి పరిచయం చేస్తోంది. 2025లో లాక్మే ఫ్యాషన్ వీక్ ఎక్స్ ఎఫ్‌డీసీఐలో ఆమె ప్రదర్శించిన అనాటమీ కలెక్షన్ అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలందుకుని సంప్రదాయ అజ్రక్ కళకు కొత్త ఊపునిచ్చింది. దీంతో ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30–2026 జాబితాలో ఆమెకు స్థానం లభించింది. నేడు యూత్ స్కిల్స్ డే సందర్భంగా ఖత్రీ యువతకు ఒక స్పష్టమైన సందేశాన్నిస్తోంది. వారసత్వంగా వచ్చిన కళను కాపాడడమే కాదు, డిజైన్, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి ఆధునిక నైపుణ్యాలను జోడిస్తే స్థానిక హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావచ్చని ఆమె నిరూపించింది.
అజ్రక్ కళ అంటే ?
అజ్రక్ అనేది గుజరాత్‌లోని కచ్, రాజస్థాన్‌లోని భార్మేర్ ప్రాంతాలలో పాటు పాకిస్థాన్‌లోని సిం«ద్ ప్రాంతంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ హ్యాండ్ ప్రింటింగ్ కళ. చెక్కతో చెక్కిన బ్లాక్‌లను ఉపయోగించి సహజమైన రంగులతో వస్త్రాలపై అందమైన ఆకృతులను ముద్రించడం దీని ప్రత్యేకత. ఇండిగో, కొన్ని మొక్కల వేర్లు, దానిమ్మ తొక్కలు వంటి సహజ పదార్థాలతో రంగులు తయారు చేయడం వల్ల ఈ వస్త్రాలు పర్యావరణహితంగా ఉంటాయి.
ఈ కళకు సుమారుగా వెయ్యేళ్ల చరిత్ర ఉంది.
నేటి యువతకు దిక్సూచిలా
ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, ఏఐ.. ఇలా ఎన్నో.. రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ప్రపంచాన్ని మన ముంగిట్లోకి తెచ్చిందని సంబరపడుతుంటాం.. కానీ అదే సాంకేతికత నేటి యువత మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఎలా దెబ్బతీస్తుందో లోతుగా విశ్లేషిస్తున్నారు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి, జెన్ జెడ్ ప్రతినిధి ఫ్రేయా ఇండియా.
నేటి యువత నిజమైన ప్రపంచాన్ని వదిలేసి లైకులు, కామెంట్ల కోసం వెంపర్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గర్ల్స్ పుస్తక రచయిత్రి అయిన 26 ఏళ్ల ఫ్రేయా ఇండియా యూకేలో పుట్టిపెరిగింది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త జోనాథన్ హైట్ నడుపుతున్న ‘ఆఫ్టర్ బాబెల్’ ప్లాట్‌ఫామ్‌లో స్టాఫ్ రైటర్‌గా పనిచేస్తూ.. ‘ది యాంగ్షియస్ జనరేషన్’ ప్రాజెక్ట్‌లో ఆమె అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా జెన్ జెడ్ ఎదుర్కొంటున్న డిజిటల్ సమస్యలను గురించి వివరిస్తున్నారు.
డిజిటల్ ప్రపంచంలో యువత విలవిల!
ఫ్రేయా ఇండియా కేవలం సాంకేతికతను మాత్రమే విమర్శించట్లేదు. సోషల్ మీడియా వల్ల యువత కోల్పోతున్న భావోద్వేగాలను, నిజమైన బంధాలను ఆమె తన వ్యాసాల ద్వారా కళ్లకు కడుతున్నారు. ఆమె దృష్టిలో నేటి తరం నిజమైన స్నేహాన్ని కోల్పోయింది. ఇద్దరు మిత్రులు ముఖాముఖి మాట్లాడుకున్నపుడు వచ్చే ఆత్మీయతను నేటి తరం కోల్పోతోందన్నది ఆమె ఆవేదన.
అమ్మాయిలకు దిశానిర్దేశం
ఆమె ప్రారంభించిన గర్ల్స్ అనే సబ్‌స్టాక్ ద్వారా నేటి యువతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, సోషల్ మీడియా వల్ల వారి ఆత్మగౌరవం ఎలా దెబ్బతింటోంది అనే విషయాలపై ఫ్రేయా ఇండియా గొంతు విప్పుతున్నారు. అందం కోసం డిజిటల్ ఫిల్టర్లపై ఆధారపడటం, మానసిక సమస్యలను సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌లా మార్చడం, జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆన్ లైన్ లో ప్రదర్శించడం, నిజమైన బంధాలకు దూరమవ్వడం, భావోద్వేగాలపై విరక్తి చెందడం వంటి అంశాలను వివరిస్తున్నారు.
నిజమైన సాధికారత అంటే ఏమిటి? స్క్రీన్ ల బయట బంధాలను మళ్లీ ఎలా నిర్మించుకోవాలి? అనే ప్రశ్నలను మన ముందుంచుతూ నేటి డిజిటల్ యుగంలో యువతను మేల్కొలుపుతూ ఈ తరం గొంతుకగా నిలుస్తున్నారు ఫ్రేయా ఇండియా.
⇒ నేటి డిజిటల్ యుగంలో ఒక అమ్మాయి మానసికంగా కాస్త బలహీనపడినా, తనపై తను నమ్మకం కోల్పోయినా... కార్పొరేట్ సంస్థలు ఆమెను ఆదుకోవడానికి రావు.. బదులుగా ఆమె బలహీనతలను క్యాష్ చేసుకుని ‘నువ్వు ఇలా మారిపో‘ అంటూ సరికొత్త ముసుగులను అమ్మడానికి సిద్ధమవుతాయి. అందుకోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటాయి. ఏఐ, అల్గారిథమ్స్ సాయంతో ఆమెలో ఉన్న అత్యంత రహస్యమైన భయాలను, అభద్రతా భావాలను పసిగట్టి.. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌ల ద్వారా రోజులో 24 గంటల పాటూ అదేపనిగా సరికొత్త ప్రకటనల దాడి సాగిస్తాయి. మరింత అందంగా, మరింత పాపులర్‌గా ఎలా ఉండాలో నిరంతరం నూరిపోస్తూ... గత ఏ తరం ఎదుర్కోని విధంగా నేటి తరాన్ని బలవంతంగా బ్రాండ్ల వైపు మళ్లిస్తున్నాయి. – ఫ్రేయా ఇండియా
రోబోటిక్ మోడల్ డస్ట్ బిన్..
మన దేశంలో రీసైక్లింగ్ ప్రక్రియ సరిగ్గా సాగకపోవడానికి ప్రధాన కారణం చెత్తను దాని రకాన్ని బట్టి ముందుగా వేరు చేయకపోవడం. ఈ సమస్యను గుర్తించిన ఢిల్లీకి చెందిన మహి మల్హాని అనే 17 ఏళ్ల విద్యార్థిని, ఏఐ సాయంతో కంప్యూటర్ విజన్ ఆధారంగా పనిచేసే రోబోటిక్ మోడల్‌ను రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న చెత్త సమస్యకు సాంకేతికతే సరైన పరిష్కారమని నిరూపించింది మహి మల్హానీ. తాను ఒక విహారయాత్రకు వెళ్లినపుడు డస్ట్ బిన్‌లకు చుట్టుపక్కల పడి ఉన్న చెత్తను గమనించింది.
అందుకు ఒక పరిష్కారం కనిపెట్టాలని ఆలోచించింది. అలా ఏఐని ఉపయోగించి, కేవలం తడి– పొడి చెత్తనే కాకుండా... వివిధ రకాల వ్యర్థాలను 90 శాతం కచ్చితత్వంతో వేరు చేయగల ఒక అద్భుతమైన కంప్యూటర్ విజన్ ఆధారంగా పనిచేసే రోబోటిక్ మోడల్‌ని రూపొందించింది.
రోబో ప్రత్యేకత... ఇది అడ్వాన్ ్సడ్ కెమెరా సెన్సార్లతో రూపొందించినది. కాబట్టి రోబో ముందు వేసిన వ్యర్థాల మీదకు కెమెరా లైట్ పడగానే, అది ప్లాస్టిక్, కాగితం, మెటల్, గ్లాస్ లేదా ఆర్గానిక్ (తడి చెత్త) వ్యర్థమా అనేది మైక్రోసెకన్లలో గుర్తిస్తుంది. వెంటనే, అందులోని రోబోటిక్ ఆర్మ్ ఆ వస్తువును పట్టుకుని దానికి కేటాయించిన ప్రత్యేకమైన డస్ట్‌బిన్ లో వేస్తుంది.
పర్యావరణానికి ఎంతో మేలు! ఈ ఆవిష్కరణకు అయ్యే తయారీ ఖర్చు చాలా తక్కువ. దీనిని గనుక మున్సిపల్ కేంద్రాల్లో లేదా కాలేజీలు, అపార్ట్‌మెంట్లలో పెద్ద ఎత్తున వాడితే... మానవ ప్రమేయం లేకుండానే చెత్తను అత్యంత వేగంగా వేరు చేయవచ్చు. దీనివల్ల రీసైక్లింగ్ పరిశ్రమలకు క్లీన్ మెటీరియల్ అందుతుంది.
కార్ కప్ హోల్డర్ ఫ్రెండ్లీ డస్ట్ బిన్
రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు కార్ల అద్దాలు దించి నీళ్ల బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లు, చాక్లెట్ రాపర్లు బయటకు విసిరేయడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ‘స్వచ్ఛ భారత్’ అంటూ మనం ఎంత చెప్పుకున్నా, ప్రయాణాల్లో కార్లలో చెత్త వేయడానికి సరైన సదుపాయం లేకపోవడం కూడా దీనికి ఒక కారణం. ఈ సమస్యకు ఢిల్లీకి చెందిన కొంతమంది ప్రతిభావంతులైన జెన్ జెడ్ విద్యార్థులు అత్యంత సులభమైన, వినూత్నమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. అదే కార్ కప్ హోల్డర్ డస్ట్‌బిన్.
మిజోరాం రాష్ట్రానికి చెందిన నాథన్ అనే విదార్థి ఢిల్లీలోని మన్న్ పాఠశాలలో చదువుతున్నాడు. రహదారుల వెంట చెత్త కనిపించడం, కార్లనుంచి చెత్తను రోడ్లపైనే విసిరివేయడం అతనిని ఆలోచింపజేసింది. అందుకు పరిష్కారం కనుగొనాలని తన స్నేహితులతో కలిసి ప్రయోగాలు ప్రారంభించాడు. సాధారణంగా కార్లలో పెద్ద డస్ట్‌బిన్లు పెట్టడానికి స్థలం ఉండదు. డోర్ పాకెట్లలో ప్లాస్టిక్ కవర్లు తగిలించినా అవి చూడటానికి బాగోవు, పైగా దుర్వాసన వస్తుంటుంది. దీన్ని గమనించిన విద్యార్థులు, దాదాపు ప్రతి కారులోనూ గేర్ లివర్ పక్కన లేదా సీట్ల మధ్యలో ఉండే కప్ హోల్డర్ ఖాళీగా ఉండటాన్ని గమనించారు.
కచ్చితంగా ఆ కప్ హోల్డర్ స్థానంలో సరిగ్గా అమరిపోయేలా, కప్పు సైజులోనే ఉండే ఒక వినూత్నమైన ‘మినీ డస్ట్‌బిన్’ను వారు డిజైన్ చేశారు. ఎలాంటి అదనపు క్లిప్‌లు లేదా గ్లూ అవసరం లేకుండా నేరుగా కారులోని కప్ హోల్డర్‌లో ఉంచవచ్చు. దీనికున్న ప్రత్యేక స్ప్రింగ్ మూత వల్ల, కేవలం ఒక చేత్తో సులభంగా నొక్కి లోపల చెత్త వేయవచ్చు. వేసిన వెంటనే మూత దానంతట అదే మూసుకుపోతుంది. దీనివల్ల కారులో ఎలాంటి దుర్వాసనా రాదు. దీనిని వాటర్‌ప్రూఫ్ ప్లాస్టిక్ లేదా సిలికాన్ మెటీరియల్‌తో తయారు చేస్తారు గనుక శుభ్రపరచడం కూడా తేలిక.
నేను మిజోరాం నుంచి చదువుకోవడానికి ఢిల్లీకి వచ్చినపుడు రహదారుల వెంబడి ఉన్న చెత్తను చూసి ఆవేదనకు గురయ్యాను. మనం మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నప్పుడు రహదారులను, బయటి పరిసరాలను, నేలను ఎందుకు చెత్తతో నింపుతున్నాం అని ఆలోచించాను. ముఖ్యంగా కార్ల నుంచి రహదారులపైకి విసిరివేస్తున్న చెత్త సమస్యకు ఒక పరిష్కారం కనిపెట్టాలని ఆలోచించి కార్ కప్ హోల్డర్ డస్ట్ బిన్‌ను రూపొందించాను. దీనివల్ల చాలా వరకు రహదారులు శుభ్రంగా ఉంటాయి. ఈ చిన్న ఇన్వెన్షన్ ప్రతి కారులో ఉంటే, లక్షలాది టన్నుల చెత్త రోడ్లపై పడకుండా నేరుగా రీసైక్లింగ్ కేంద్రాలకు చేరుతుంది. – నాథన్
నిర్వహణ: శ్రావణ్ జయ, రమ జంబుల


