జెన్‌జీ కొత్త ఫార్ములా.. ఇదే ఇప్పుడు వైరల్‌! | Gen Z Vs Traditional Work Ethic Debate Goes Viral Over Ease Of Life Through Technology, Check More Details Inside | Sakshi
Sakshi News home page

జెన్‌జీ కొత్త ఫార్ములా.. ఇదే ఇప్పుడు వైరల్‌!

Jun 29 2026 8:43 AM | Updated on Jun 29 2026 10:48 AM

Work Smart Not Hard: Gen Zs Viral Take Starts a Debate

టెక్నాలజీ జీవితాన్ని సులభతరం చేస్తుంటే.. అనవసరంగా ఎందుకు కష్టపడాలి?. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ పోస్ట్‌.. దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. ముఖ్యంగా జెన్‌జీ (Gen Z) యువత జీవితం, పని, విజయం, కష్టం గురించి ఎలా ఆలోచిస్తోందనే అంశంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు.

ఈ చర్చకు కారణమైనది ఎక్స్‌ (X) వేదికపై ప్రేమ్‌ సోని అనే యూజర్‌ చేసిన ఓ పోస్ట్‌. పాతతరం కష్టాన్నే విజయానికి కొలమానంగా భావిస్తుంటే.. జెన్‌జీ మాత్రం సమయం, సామర్థ్యం, సౌకర్యానికే ఎక్కువ విలువ ఇస్తోందని ఆ యూజర్‌ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ ఒక పనిని సులభంగా పూర్తి చేసే అవకాశం కల్పిస్తుంటే.. అదే పనిని అనవసరంగా కష్టపడి చేయడంలో అర్థం లేదనేదే జెన్‌జీ ఆలోచనగా వివరించారు.

దీనికి ఉదాహరణగా.. కూరగాయలు కొనడానికి ట్రాఫిక్‌, దుమ్ము, బేరసారాలతో గంటసేపు గడపడం కంటే.. మొబైల్‌ యాప్‌లో కొన్ని నిమిషాల్లో ఆర్డర్‌ చేయడాన్నే జెన్‌జీ తెలివైన నిర్ణయంగా భావిస్తోందని చెప్పారు. అలాగే రద్దీ బస్సుల్లో ప్రయాణించడం కంటే క్యాబ్‌ లేదంటే రైడ్‌-హైలింగ్‌ యాప్‌ను ఉపయోగించడం సమయాన్ని ఆదా చేసే మార్గమని యువత చూస్తోందని పేర్కొన్నారు.

అంతేకాదు, పిల్లలు మంచి ఉద్యోగాలు చేసి సౌకర్యవంతమైన జీవితం గడపాలని కోరుకునే తల్లిదండ్రులే.. అదే పిల్లలు టెక్నాలజీ సాయంతో సమయం ఆదా చేసుకుంటే వారిని బద్ధకస్తులుగా చూడడం ఒక వైరుధ్యమని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కష్టాన్ని, పొదుపును గొప్పగా చెప్పిన పెద్దలే.. ఇప్పుడు తమ స్మార్ట్‌ఫోన్లలో క్విక్‌ కామర్స్‌ యాప్‌ల ద్వారా వచ్చే డెలివరీలను ట్రాక్‌ చేయడం కూడా ప్రస్తావించారు. 
ఈ పోస్ట్‌ వైరల్‌ కావడంతో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

సమయానికి విలువ ఇవ్వడం, అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడం బద్ధకం కాదని, అదే ఆధునిక జీవనశైలి అని చాలామంది జెన్‌జీకి మద్దతు తెలిపారు. మరోవైపు, జీవితంలో కొంత కష్టాన్ని అనుభవించడం వల్లే సహనం, క్రమశిక్షణ, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని మరికొందరు వాదించారు.

మొత్తానికి.. ఈ చర్చ కేవలం ఆన్‌లైన్‌లో కూరగాయలు కొనడం, క్యాబ్‌లో ప్రయాణించడం గురించి మాత్రమే కాదు. కాలం మారుతున్న కొద్దీ 'కష్టం' అనే పదానికి అర్థం కూడా మారుతోందా? సాంకేతికత అందుబాటులో ఉన్నప్పుడు సమయాన్ని ఆదా చేసుకోవడం తెలివా? లేదంటే కష్టపడటమే జీవిత విలువను నేర్పుతుందా?అనే ప్రశ్నలను మరోసారి సమాజం ముందుకు తీసుకొచ్చింది. అందుకే.. జెన్‌జీ కొత్త ఫార్ములాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. మరి మీరేమంటారు?.. ఈ వాదనతో ఏకీభవిస్తారా??.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement