నవతరానికి మొహం మొత్తిందా? | Gen Z workers place more trust in work completed without AI | Sakshi
Sakshi News home page

నవతరానికి మొహం మొత్తిందా?

Jun 24 2026 4:51 AM | Updated on Jun 24 2026 4:51 AM

Gen Z workers place more trust in work completed without AI

ఏఐపై జెన్‌–జీలో అపనమ్మకం

ఉద్యోగాలు, పర్యావరణ నష్టాలపై ఆందోళన

వెల్లడించిన అధ్యయనాలు!  

కొత్త వింత... పాత రోత అంటారు. కానీ...  ఈ తరానికి కొత్త కూడా రోతగానే అనిపిస్తున్నట్లు ఉంది! ఎందుకంటారా?  నాలుగైదేళ్లు కూడాకాకముందే ఏఐపై వారికి మొహం మొత్తింది! అమెరికా, యూరప్, ఆసియా.. ఇలా ప్రపంచం మొత్తమ్మీద... ఏఐని నమ్మని వాళ్లు, వద్దని అనుకుంటున్న వాళ్లు...  తిరస్కరిస్తున్న వారి సంఖ్య 
అంతకంతకూ పెరిగిపోతోంది! 

2020ల మొదట్లో చిన్న చిన్న చాట్‌బోట్లు, సిఫారసు వ్యవస్థలతో మొదలైన ఏఐ ఆటోమేషన్‌ 2023లో చాట్‌జీపీటీ రాకతో రాకెట్‌ స్పీడ్‌ అందుకుంది. ఇమేజీలు సృష్టించడం మొదలుకొని సినిమాలు తీసేంతవరకూ అనేకానేక ఏజెంటిక ఏఐల రాకతో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం పడింది. ఆంథ్రోపిక్‌ క్లాడ్‌తోపాటు మరికొన్ని అత్యాధునిక ఏఐ వ్యవస్థలు నెమ్మదిగా సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌ చేయడం, తన తప్పులు తానే సరి చేసుకోవడం.. వంటి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన కూడా మొదలైంది.

అంతేకాకుండా డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై అవగాహన కూడా పెరిగింది. ఇదే సమయంలో వివిధ దేశాలు ఏఐ టెక్నాలజీకి ముకుతాడు వేసేందుకు, నియంత్రణ వ్యవస్థలను తీసుకొచ్చే ప్రయత్నాలూ మొదలుపెట్టాయి. తాజాగా జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం యువతలో మరీ ముఖ్యంగా జెన్‌–జీలో ఏఐపై విముఖత పెరుగుతోంది. అమెరికాలో ‘ప్యూ రీసెర్చ్‌’, యూరప్‌లో ‘స్టాన్‌ఫర్డ్‌ ఏఐ ఇండెక్స్‌ – 2026’లు జరిపిన అధ్యయనాలు జెన్‌–జీలో ఏఐ పట్ల పెరుగుతున్న అభద్రత భావానికి అద్దం పడుతున్నాయి.  

అంకెలు చెప్పే విషయం... 
అమెరికాలోని ప్యూ రీసెర్చ్‌ ఇటీవలే ‘‘అమెరికన్స్‌ అండ్‌ ఏఐ 2026: ఛాట్‌బోట్స్, స్మార్ట్‌ డివైజెస్‌ అండ్‌ వ్యూస్‌ ఆన్‌ ఇంపాక్ట్‌’పేరుతో ఒక అధ్యయనం నిర్వహించింది. వారం రోజుల క్రితం విడుదలైన అధ్యయన ఫలితాల ప్రకారం కేవలం 16 శాతం మంది (అధ్యయనంలో పాల్గొన్న 5119 మందిలో) మాత్రమే ఏఐ సమాజంపై సానుకూల ప్రభావం చూపగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

అదే సమయంలో ఈ టెక్నాలజీతో సమాజానికి నష్టమే అని అభిప్రాయపడ్డవారు 40 శాతం వరకూ ఉంది. ఇదే అభిప్రాయంతో 48 శాతం జెన్‌–జీ సభ్యులు ఏకీభవిస్తూండటం గమనార్హం. అలాగని ఎవరూ ఈ టెక్నాలజీని వాడటం లేదా అంటే 49 శాతం మంది చాట్‌జీపీటీ వంటివి వాడుతున్నట్లు స్పష్టమైంది. జెన్‌–జీలో ఇది 66 శాతం. రెండేళ్ల క్రితం వాడకందార్లు కేవలం 33 శాతం మంది మాత్రమే. ఏఐపై వ్యతిరేకత వయసుతోపాటు కొంత తక్కువ అవుతూండటం ఇంకో ఆసక్తికర అంశం. 

అమెరికా మాత్రమే కాదు.. యూరప్, భారత్‌సహా ఆసియా దేశాల్లోనూ ఏఐ వాడకమైతే పెరుగుతోంది కానీ.. అందుకు తగ్గట్టుగానే అపనమ్మకం కూడా ఎక్కువ అవుతోందన్నమాట. దీనికీ కారణాలు లేకపోలేదు. కంపెనీ యాజమాన్యాలు ఏఐ వాడకంపై ఎక్కువ ఆసక్తి చూపుతూండగా ఉద్యోగులు భయం, భయంగా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్‌ వంటి దిగ్గజ కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు గుమ్మరిస్తూండటంతో ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్న మాట వాస్తవమైనప్పటికీ జెన్‌–జీలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుంటే ఇది ఎంత కాలం కొనసాగుతుందన్నది ప్రశ్నగా మారింది.

యూరప్‌లోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తోంది. ఏఐ వ్యవస్థలపై నియంత్రణ అవసరమన్న వాదనతోపాటు ఏఐ కంపెనీలపై విశ్వాసం సడలుతున్నట్లు స్టాన్‌ఫర్డ్‌ ఏఐ ఇండెక్స్‌ 2026 స్పష్టం చేస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఏఐతో ఉద్యోగాలకు నష్టమన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తూండగా యూకేలో వాడకం బాగా పెరుగుతున్నా ఏఐ వ్యవస్థలపై నమ్మకం అతితక్కువ స్థాయిలోఉంది. 

మానవ సృజనకు పాతర... 
ఏఐ మానవ సృజనకు పాతరేస్తోందని, ఆటోమేషన్‌ కారణంగా మనిషి ఆలోచించడం మానేస్తాడని జెన్‌–జీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై కూడా జెన్‌–జీలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది.     – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement