
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి వచ్చి, భూలోక వైకుంఠమైన వేంకటాద్రిపై కొలువుదీరాడు. కన్యామాసం (చాంద్రమానం ప్రకారం ఆశ్వీయుజ మాసం) శ్రవణా నక్షత్రం రోజున శ్రీవేంకటేశ్వరస్వామిగా అర్చారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలశాడు. శ్రీవేంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్తజన వల్లభుడు. కోరినవారి కొంగుబంగారమై కోరికలను ఈడేర్చే శ్రీవేంకటేశ్వరుని వైభోగం న భూతో న భవిష్యతి! వేంకటాచల క్షేత్రం పై వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి, లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట! ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి ముగిసేలా తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట! తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని ప్రతీతి.
దసరా నవరాత్రులు జరిగే కన్యామాసంలో శ్రీవేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణా నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందుగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించటం కూడా ఆనవాయితీగా కొనసాగుతోంది. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం, వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం, బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు.
నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా అలంకార ప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున మహారథం (చెక్కరథం) బదులు ఇదివరకు వెండిరథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు జరుగుతూ వస్తోంది. 2012లో పాత స్వర్ణరథం స్థానంలో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది.
అంకురార్పణతో ఆరంభం
శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు వసంత మండపానికి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత దేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో శాలి, వ్రీహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు.
ధ్వజారోహణం
అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కొండమీదే కొలువుదీరి ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
పెద్దశేషవాహనం
మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీథులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. భూభారాన్ని వహించేది శేషుడే! శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.
చిన్నశేషవాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీ యోగసిద్ధిఫలం లభిస్తుందని ప్రతీతి.
హంస వాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీమలయప్ప స్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించి వేరుచేయగల అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని కలిగిస్తాడు.
సింహ వాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహాన్ని బలానికి, వేగానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ఈ వాహనసేవలోని అంతరార్థం.
ముత్యపుపందిరి వాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ముత్యపుపందిరి వాహనంలో స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. చల్లని ముత్యాలపందిరి కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.
కల్పవృక్ష వాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీథుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తమకు కాసిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.
సర్వభూపాల వాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజు అని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.
మోహిని అవతారం
బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగార రసాధిదేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు.
గరుడ వాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడ వీథుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళరూప దర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెబుతున్నారు.
హనుమంత వాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం అవగతమవుతుంది.
స్వర్ణ రథం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది.
గజవాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీథుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది.
సూర్యప్రభ వాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీథుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభవాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య, విద్య, ఐశ్వర్య, సంతాన లాభాలు భక్తకోటికి సిద్ధిస్తాయి.
చంద్రప్రభ వాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు చంద్రప్రభవాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు విప్పారతాయి. హృదయాలలో ఆనందం ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
రథోత్సవం
గుర్రాల వంటి ఇంద్రియాలను మనసు అనే కళ్లెంతో అదుపు చేసే విధంగానే, రథం వంటి శరీరాన్ని రౌతు అయిన ఆత్మ ద్వారా అదుపు చేయాలని తత్త్వ జ్ఞానాన్ని స్వామివారు ఎనిమిదో రోజు ఉదయం తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథసేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉందని భక్తుల విశ్వాసం
అశ్వవాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు.
చక్రస్నానం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వారు ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు.
ధ్వజావరోహణం
చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగరవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాలు వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.
శ్రీవారి వాహన సేవల వివరాలు
24–09–2025
సాయంత్రం 05:43 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం,
రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
25–09–2025
ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3గంటల వరకు స్నపనం,
రాత్రి 7 గంటలకు హంస వాహనం
26–09–2025
ఉదయం 8 గంటలకు సింహ వాహనం మధ్యాహ్నం 1 గంటకు స్నపనం,
రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం
27–09–2025
ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం
మధ్యాహ్నం 1 గంటకు స్నపనం,
రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం
28–09–2025
ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి గరుడ వాహనం
29–09–2025
ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం
సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం
రాత్రి 7 గంటలకు గజ వాహనం
30–09–2025
ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం
రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం
01–10–2025
ఉదయం 7 గంటలకు రథోత్సవం
రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం
02–10–2025
ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం.