వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
గత ప్రభుత్వ హయాంలో బ్రాండ్ ఏపీ దెబ్బతిందని టీడీపీ, జనసేన నేతలు పచ్చి అబద్ధాలు
పెట్టుబడిదారులు పారిపోయారంటూ నాడూ.. నేడు దుష్ప్రచారం
2019–24 మధ్య తయారీ రంగంలో దక్షిణ భారతదేశంలోనే ఏపీ నంబర్ వన్.. దేశంలో ఐదో స్థానం
పారిశ్రామికాభివృద్ధిలో దక్షిణ భారతదేశంలో నంబర్ వన్.. దేశంలో ఎనిమిదో స్థానం
ఇప్పుడు చెప్పండి.. 2019–24 మధ్య ఏపీ బ్రాండ్ దెబ్బతిందా? లేక ఇంతకుముందెన్నడూ చూడని ఆర్థిక పురోగతిని చూశామా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019–24 మధ్య పారిశ్రామిక ప్రగతి, తయారీ రంగంలో వృద్ధిపై స్థూల విలువ జోడింపు (జీవీఏ– గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)తో ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఈ నెలలో విడుదల చేసిన నివేదికలోని గణాంకాలను ఉటంకిస్తూ విష ప్రచారాన్ని ఎండగట్టారు. ఆ నివేదికలో పేర్కొన్న అంశాలను జత చేస్తూ.. ‘సత్యమేవ జయతే’ హ్యాష్ ట్యాగ్‌తో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మంగళవారం పోస్టు చేశారు.
ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘‘టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఎన్నికల ముందు, ఇప్పుడూ పనిగట్టుకుని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, ఫలితంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారంటూ విమర్శలు చేస్తున్నారు. అంతే కాకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికాభివృద్ధి జరగలేదంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంటే తయారీ, పరిశ్రమల రంగంలో రాష్ట్రం పని తీరు దయనీయంగా ఉండేది.

కానీ.. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. తయారీ, పరిశ్రమల రంగంలో స్థూల విలువను జోడిస్తూ ఆర్బీఐ ఈ నెల విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. తయారీ రంగం వృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్.. దేశ వ్యాప్తంగా ఐదో స్థానంలో ఉంది. పారిశ్రామికాభివృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్.. దేశ వ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పుడు చెప్పండి.. 2019–24 మధ్య ఏపీ బ్రాండ్ దెబ్బతిందా? సమర్థవంతమైన నాయకత్వం వల్ల ఇంతకుముందెన్నడూ చూడని ఆర్థిక పురోగతిని చూశామా?


