FIFA World Cup 2026: ఫిఫా హీరోలు.. గద్ద – దుప్పి – జాగ్వార్‌ | Three Countries To Host The 2026 FIFA World Cup | Sakshi
Sakshi News home page

FIFA World Cup 2026: ఫిఫా హీరోలు.. గద్ద – దుప్పి – జాగ్వార్‌

Jun 20 2026 2:04 PM | Updated on Jun 20 2026 2:04 PM

Three Countries To Host The 2026 FIFA World Cup

ఫిఫా వరల్డ్‌ కప్‌ 2026

2026 ఫిఫా వరల్డ్‌ కప్‌కు మూడు దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. అందుకే ఈసారి ఒకటి కాదు, మూడు మస్కట్‌లు మన ముందుకు వచ్చాయి. అమెరికా గద్ద, కెనడా దుప్పి, మెక్సికో జాగ్వార్‌ కలిసి ఫుట్‌బాల్‌ మైదానంలో సందడి చేయనున్నాయి.

‘మస్కట్‌’ అంటే ఒక ‘లక్కీ చార్మ్‌‘ (అదృష్ట చిహ్నం). అంతర్జాతీయ క్రీడల్లో  ఆ ఆటలు బాగా జరగాలని, అందరికీ అదృష్టం కలిసి రావాలని ఒక బొమ్మను ఎంచుకుంటారు. దీన్నే ‘మస్కట్‌’ అంటారు. ఇది సాధారణంగా కార్టూన్‌ బొమ్మలా ఉంటుంది. క్రీడలకు ఆ మస్కట్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌లా పని చేస్తుంది.

ఇప్పుడు జరుగుతున్న ‘ఫిఫా వరల్డ్‌ కప్‌ 2026’ను చరిత్రలో మొదటిసారిగా మూడు దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి. ఆ దేశాలు అమెరికా, కెనడా, మెక్సికో. అందుకే ఫిఫా కూడా కొత్తగా ఆలోచించింది. టోర్నమెంట్‌కు గుర్తుగా ఒక మస్కట్‌ కాకుండా మూడు మస్కట్‌లను ప్రవేశపెట్టింది. ప్రతి మస్కట్‌ ఒక్కో దేశానికి ప్రతీక. అంతేకాదు, ఫుట్‌బాల్‌ టీమ్‌లోని మూడు కీలక పొజిషన్లను ఈ మూడు మస్కట్‌లు ్రపాతినిధ్యం వహిస్తాయి. అవి ఏమిటో, వాటినే ఎందుకు ఎంచుకున్నారో 
ఇప్పుడు తెలుసుకుందాం.

Clutch – అమెరికా బట్టతల గద్ద..
నం.10 జెర్సీ వేసుకున్న Clutch మిడ్‌ఫీల్డర్‌. అమెరికా జాతీయ పక్షి బట్టతల గద్ద రూపంలో దీన్ని తీర్చిదిద్దారు. ఫుట్‌బాల్‌లో మిడ్‌ఫీల్డర్‌ పాత్ర టీమ్‌ను నడిపించడం, ఆటగాళ్లను కలపడం, సరైన సమయంలో పాస్‌ ఇవ్వడం. Clutch కూడా అంతే. ఎత్తులో ఎగురుతూ అందరినీ ఒకచోట చేర్చుతుంది. టీమ్‌ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. గద్ద నిర్భయంగా, లక్ష్యంతో ఎగురుతుంది. అమెరికా క్రీడాస్ఫూర్తికి అది సరైన గుర్తు.

Maple – కెనడా దుప్పి
నం.1 జెర్సీతో గోల్‌కీపర్‌గా Maple ఉంది. కెనడా జెండాలో ఉండే మాపుల్‌ ఆకు పేరును దీనికి పెట్టారు. దుప్పి కెనడా అడవుల్లో ఎక్కువగా కనిపించే జంతువు. ఇది శాంతానికి, ఓర్పుకు చిహ్నం. అదే సమయంలో తన ప్రాంతాన్ని కాపాడుకోవడంలో చాలా బలంగా ఉంటుంది. ఫుట్‌బాల్‌లో గోల్‌కీపర్‌ పని కూడా అదే. గోల్‌ పోస్ట్‌ను కాపాడటం.

Zayu – మెక్సికో జాగ్వార్‌
నం.9 జెర్సీతో స్ట్రైకర్‌ పాత్రలో Zayu ఉంది. ఇది దక్షిణ మెక్సికో అడవుల్లో సంచరించే జాగ్వార్‌.  మెక్సికో నాగరికతలో జాగ్వార్‌ బలానికి, వేగానికి, ధైర్యానికి చిహ్నం. ఫుట్‌బాల్‌లో స్ట్రైకర్‌ పని గోల్‌ కొట్టడం. Zayu అందులో దిట్ట. చిరుత కన్నా వేగంగా పరిగెత్తి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తుంది.

Clutch గద్ద, Maple దుప్పి, Zayu జాగ్వార్‌. మూడు వేర్వేరు దేశాలు, మూడు వేర్వేరు జంతువులు, మూడు వేర్వేరు పొజిషన్లు. అయినా వీరి లక్ష్యం ఒక్కటే. కలిసి ఆడటం, కలిసి గెలవడం. ఒక్కరు ఎక్కువ, ఒక్కరు తక్కువ కాదు. 2026 వరల్డ్‌ కప్‌ మనకు చెప్పే పాఠం కూడా అదే. మనం వేరైనా, మన ఆట, మన భాష, మన అలవాట్లు వేరైనా కలిసి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement