శతాయుష్మాన్‌ భవ! | Shichi-Go-San festival celebrated on November 15th in Japane | Sakshi
Sakshi News home page

శతాయుష్మాన్‌ భవ!

Nov 9 2025 12:58 AM | Updated on Nov 9 2025 12:58 AM

Shichi-Go-San festival celebrated on November 15th in Japane

జపాన్  సంస్కృతిలో నవంబర్‌ నెల ఎంతో ప్రత్యేకమైనది. ఈ సమయంలో జపాన్‌ దేవాలయాలను సందర్శిస్తే, అందమైన కిమోనో వస్త్రధారణలో మెరిసే చిన్నచిన్న పిల్లలను చూడవచ్చు. ఇది జపాన్‌ సంప్రదాయ వేడుక. ఈ వేడుకని షిచి–గో–సాన్‌ పండుగ(Shichi-Go-San festival) అని  పిలుస్తారు. ఆ పదాలకు అక్షరాలా ‘ఏడు, ఐదు, మూడు’ అని అర్థం. ఈ పండుగను ఈ మూడు నిర్దిష్ట వయస్సుల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు– తమ పిల్లల పెరుగుదలకు దీవెనలందించిన దేవుళ్లకు కృతజ్ఞతలు తెలియజేయడానికి, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం దేవుళ్లను ప్రార్థించడానికి జరుపుకుంటారు.

మూడు సంవత్సరాల వయసు ఉన్న  బాలుడు లేదా బాలిక, ఐదు సంవత్సరాల వయసు ఉన్న  బాలుడు, ఏడు సంవత్సరాల వయసు ఉన్న బాలిక ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ పండుగ సందర్భంగా నవంబర్‌ 15న చాలామంది జపాన్‌ తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి షింటో దేవాలయాలు లేదా బౌద్ధ దేవాలయాలను సందర్శిస్తారు.

షిచి–గో–సాన్‌ పండుగ చరిత్ర– హీయాన్‌ కాలం (794–1185) నాటిది. అప్పటి నుంచి, ఉన్నత వర్గాల, సమురాయ్‌ కుటుంబాలు తమ పిల్లలు ఆరోగ్యంగా పెరిగినందుకు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పాత రోజుల్లో, వైద్య సంరక్షణ అంతగా అభివృద్ధి చెందనందున, శిశు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండేది. అందుకే ఏడేళ్ల వయస్సు వచ్చే వరకు పిల్లలను ‘కామి నో ఉచి’ అంటే– దేవుని పిల్లలుగా పరిగణించేవారు. ఏడేళ్ల వయస్సు దాటితేనే వారిని మానవ లోకంలోకి ప్రవేశించినట్లుగా భావించేవారు.

ఈ వేడుకల కోసం నవంబర్‌ 15వ తేదీని ఎంచుకోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదేంటంటే 1603–1867 మధ్య కాలంలో టోకుగావా సునాయోషి అనే పాలకుడు తన కన్నబిడ్డ ఆరోగ్యం కోసం అదేరోజు ప్రార్థించాడట. ఈ వేడుకలో పాల్గొనే పిల్లలకు తల్లిదండ్రులు ‘చిటోసియామే’ అనే మిఠాయిని ప్రత్యేకంగా తినిపిస్తారు. ఎందుకంటే ‘చిటోసె’ అంటే దీర్ఘాయుష్షు అని అర్థం. ఈ క్యాండీని ‘వెయ్యేళ్ల క్యాండీ’ అని కూడా పిలుస్తారు.  ఈ క్యాండీల ప్యాకింగ్‌పైన కొంగలు, తాబేళ్లు ఇలా దీర్ఘాయుష్షుకు చిహ్నమైన బొమ్మలు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement