స్పెయిన్, ఈజిప్‌్ట, యూకె,యూఎస్‌ఏ, సౌత్ కొరియా, లక్సెంబర్గ్ వంటి దేశాల నుంచి ఉత్తమ చిత్రాలు ప్రదర్శన
‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ ప్రారంభం
మొదటి రోజు సందడి చేసిన అన్సెసావో, జహాన్
విజేతకు మూడు లక్షల నగదు బహుమతి ప్రకటన
నగరం మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నాంది పలికింది. సిటీలో మొట్టమొదటి సారిగా ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ శుక్రవారం ప్రారంభమైంది. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 21 తేదీ వరకూ కొనసాగనుంది. నగరంలోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి భారతదేశంతో పాటు స్పెయిన్, ఈజిప్‌్ట, యూకే, యూఎస్‌ఏ, సౌత్ కొరియా, శ్రీలంక, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ వంటి పలు దేశాల నుంచి 704 చిత్రాలు ఎంట్రీలు రావడం విశేషం.
అంతర్జాతీయ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా మొదటి రోజు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో అన్సెసావో, జహాన్ షార్ట్ ఫిల్మ్స్‌ను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో భాగంగా 704 ఎంట్రీల నుంచి 60 అత్యుత్తమ షార్ట్ ఫిల్మ్‌లను ఎంపిక చేసి ప్రదర్శించనున్నారు.
అన్సెసావో..
30 నిమిషాల నిడివి గల కొంకణి లఘు చిత్రం ‘అన్సెసావో’.. టొరంటోలో జరిగిన 14వ అంతర్జాతీయ దక్షిణ ఆసియా చలనచిత్రోత్సవంలో ఉత్తమ అంతర్జాతీయ లఘు చిత్రం అవార్డును గెలుచుకుంది. మంగురీష్ జగదీష్ బండోద్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వృద్ధాప్యం, ఒంటరితనం తదితర సవాళ్లను ఎదుర్కోవడంలో మానవ ప్రయాణాన్ని సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించింది. ఈ చిత్రానికి నటి ప్రశాంతి తల్పంకర్ ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏలో అంతర్జాతీయ విభాగంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. వ్యక్తిగత పోరాటం, బలహీనతలతో సతమతమవుతున్న ఒక వృద్ధురాలి భావోద్వేగ లోతును, సంక్లిష్టతను ఆమె తన అద్భుతమైన నటనతో ప్రతిబింబించారు.
జహాన్–ది లాస్ట్ గిఫ్ట్..
రాహుల్ శెట్టి దర్శకత్వం వహించిన జహాన్ చిత్రం.. సంయమనంతో కూడిన కథనంతో పాటు ఆకట్టుకునే దృశ్యాలను మిళితం చేసి, వాతావరణ మార్పుల వాస్తవాలను చూపిస్తుంది. టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ లఘు చిత్రాన్ని ఇటీవల వేవ్స్ సమ్మిట్ 2025లో ప్రదర్శించారు. ఇది పర్యావరణ బాధ్యత, వాతావరణ అవగాహనపై ప్రాధాన్యతను తెలిపింది. అంతేకాకుండా, ఇటీవల ముంబైలో జరిగిన లేక్‌సిటీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025లో టైగర్ ష్రాఫ్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.
ప్యానెల్ చర్చలు.. మాస్టర్‌క్లాసులు..
ఎంపిక చేసిన 60 లఘు చిత్రాల్లో విజేతలకు రూ.3 లక్షల నగదు బహుమతి లభించనుంది. రెండు రోజుల పాటు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 4, 5లలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్‌లో అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు జూడీ గ్లాడ్‌స్టోన్, మైథిలిరావు, నాగేశ్ కునూరర్, లీమా దాస్, సుంజు బచుస్పతిమయుమ్, ఉత్పల్ బోర్పుజారి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఈ ప్రాంతం నుండి వస్తున్న కొత్త ప్రతిభను హైలైట్ చేస్తూ..ఒక ప్రత్యేక ఈశాన్య పెవిలియన్ కింద 11 లఘు చిత్రాలు, ప్రేక్షకుల కోసం ఎంపిక చేసిన ఐదు క్లాసిక్ చిత్రాలు కూడా ప్రదర్శిస్తున్నారు. అదనంగా, భారతీయ సినిమాలో సమకాలీన సమస్యలపై ప్యానెల్ చర్చలు, యువ, ఔత్సాహిక చిత్రనిర్మాతల కోసం ఒక మాస్టర్‌క్లాస్ కూడా ఉంటుంది. టిక్కెట్లు జోమాటో యాప్‌లోని డిస్ట్రిక్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.


