వాన నీరు ఇంకిస్తే చాలు! | Sagubadi: Rainwater Harvesting to recharge dry borewells in farmlands | Sakshi
Sakshi News home page

వాన నీరు ఇంకిస్తే చాలు!

Jun 30 2026 6:25 AM | Updated on Jun 30 2026 6:25 AM

Sagubadi: Rainwater Harvesting to recharge dry borewells in farmlands

బోర్ల చుట్టూ రీఛార్జ్‌ గుంతలతో 70% వాన నీటిని భూమిలోకి ఇంకింపజేసుకోవచ్చు

బోర్లకు దగ్గర్లో నీటి కుంటలు నిర్మించుకున్నా ఎంతో ప్రయోజనం

ఎల్‌ నినోతో రుతుపవనాలు అస్తవ్యస్థంగా మారుతున్న పరిస్థితుల్లో బోర్‌వెల్స్‌ కింద వ్యవసాయం చేసే రైతులు వాన నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేసుకునే పనులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకే దానికంటే ఎక్కువ నీటిని తోడటం వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు అడుగంటాయి. 

అనేక ప్రాంతాల్లో 200 నుంచి 400 మీటర్ల (650–1300 అడుగుల) లోతు వరకు కూడా బోర్‌వెల్‌లు, ట్యూబ్‌వెల్‌లు తవ్వడం సర్వసాధారణమైంది. భూగర్భ జలాల లభ్యత రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. భూమిలోకి తగినంత వాన నీటిని ఇంకింపజేసే (రీఛార్జ్‌) ప్రయత్నాలు చెయ్యకుండా భూగర్భ జలాలను నిరంతరం ఎక్కువగా తోడుతుండటమే సమస్య. బోరుబావులు నిత్యం జలకళతో కళకళలాడాలంటే వాటి దగ్గర రీఛార్జ్‌ గుంతలు లేదా నీటి కుంటలు నిర్మించుకోవటం మేలు అంటున్నారు నిపుణులు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని భూగర్భంలో గట్టి రాతి జల పొరలు విస్తరించి ఉన్నాయి. మట్టి కింద 5 నుంచి 15 మీటర్ల లోతు వరకు రాతి పొరలు ఉంటాయి. నీటిని ఎక్కువగా నిల్వ చేయగల సామర్థ్యం ఈ పొరలకే ఉంటుంది. రాతి సమూహాల మధ్య ఉండే పగుళ్లు భూగర్భ జలాల నిల్వకు, కదలికలకు దోహదపడతాయి.
 
ఒక బోర్‌వెల్‌ ద్వారా రీఛార్జ్‌ అయ్యే వర్షపు నీటి పరిమాణం, అక్కడి భూగర్భంలోని జల పొరల లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. రాళ్లలో పగుళ్లు, చీలికలు బాగా ఉంటే బోర్‌వెల్స్‌ ద్వారా ఎక్కువ వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకుతాయి. కొన్నిసార్లు, ఈ పగుళ్ల అనుసంధానం చాలా పరిమితంగా ఉంటే వాన నీరు ఇంకే సామర్థ్యం తక్కువగా ఉండవచ్చు. 

సాధారణ వాన నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా సుమారు 15% మాత్రమే భూగర్భంలోని పైపైన ఉండే నీటి పొరల్లోకి ఇంకుతోంది. సుమారు 20–40% ఆవిరైపోవచ్చు. లోతైన భూగర్భ జల పొరలు తిరిగి నిండటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. తక్కువ కాలం పాటు కురిసే భారీ వర్షాలను ఈ నిర్మాణాలు సమర్థవంతంగా సంగ్రహించలేకపోవచ్చు. ఇటీవలి కాలంలో లోతైన బోర్‌వెల్‌లను రీఛార్జ్‌ చేయడానికి, వాటి దిగుబడిని పెంచడానికి, సహేతుకంగా తక్కువ ఖర్చుతో ‘బోర్‌వెల్‌ రీఛార్జ్‌’ అనే పద్ధతి ఒక సమర్థవంతమైన విధానంగా ఆవిర్భవించింది.

ఎండిన బోర్లకు తిరిగి జలకళ
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దమగట్ల గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డి తనకున్న రెండు ఎండిపోయిన బోరుబావులకు చుట్టూ వాన నీరు ఇంకేలా రీఛార్జ్‌ గుంతను నిర్మించారు. దీంతో ఆ బోరుబావులు వర్షపు నీటిని 70% వరకు భూమి లోపలికి ఇంకింపజేశాయి. 

ఆ బోర్లు తిరిగి జలకళను సంతరించుకున్నాయి. రోజంతా అపరిమితంగా నీటిని అందించడం ప్రారంభించాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి ఇప్పటికే ప్రచారం చేస్తున్న ఈ ప్రగతిశీల రైతు, బోర్‌ రీచార్జ్‌ గుంత ద్వారా నీటి భద్రత పొందటంపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నందికొట్కూరు చుట్టుపక్కల ప్రాంతం అంతా ఈ పద్ధతి ద్వారా భూగర్భ జలాలను రీఛార్జ్‌ చేయడానికి అనువైన ప్రాంతమని తమ పరిశీలనలో తేలిందని వాటర్‌ అండ్‌ లైవ్‌లిహుడ్స్‌ ఫౌండేషన్‌ (డబ్ల్యూఎల్‌ఎఫ్‌) వ్యవస్థాపకులు డా. రామ్‌మోహన్‌ అన్నారు.  

నీటి కుంటలతో బోర్ల రీఛార్జ్‌
నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం, దాని పరిసర ప్రాంతాల్లో వేరుశనగ, మొక్కజొన్న, వరి పంటల సాగు పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. బోరుబావులు విఫలమైనప్పుడు, వారు అధిక ఖర్చుతో రైతులు కొత్త బోరుబావులను వేయిస్తుంటారు. ప్రత్యక్ష రీఛార్జ్‌ ప్రయోజనం కోసం బోరుబావులకు దగ్గరగా వర్షపు నీటి నిల్వ కుంటలను నిర్మించుకుంటే భూమిలోకి నీరు బాగా ఇంకుతుందని డబ్ల్యూఎల్‌ఎఫ్‌ చెబుతూ రైతుల ఆలోచనా విధానంలో మార్పు తెస్తోంది. 

ఉన్న బోరుబావులను కాపాడుకోవడానికి బోర్లకు దగ్గర్లో నీటి కుంటలు నిర్మించుకోవటానికి గత 2–3 సంవత్సరాలుగా చిన్న రైతులకు తోడ్పాటునందిస్తోంది. రైతులు తమ వంతుగా కొంత మొత్తం చెల్లిస్తే పొలంలో బోరుకు దగ్గరగా నీటి కుంటను ఏర్పాటు చేయిస్తోంది. తమ ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని, ఇప్పటివరకు 74 మంది రైతులు వర్షపు నీటి కుంటల నిర్మాణంతో లబ్ది పొందారని డా. రామ్‌మోహన్‌ తెలిపారు. బోరుకు 5 అడుగుల దూరంలో నీటి కుంట తవ్వుకుంటే బోరు నిండుగా నీరు పోస్తోందని నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అ΄్పాయిపల్లి గ్రామానికి చెందిన రైతు మార్కం రాములు యాదవ్‌ తెలిపారు. ఈ కుంటలో భవిష్యత్తులో చేపలు కూడా పెంచుతానన్నారు. 
 
70% వాననీటి సంరక్షణ
బోర్‌వెల్‌ చుట్టూ వాన నీటి రీఛార్జ్‌ గుంతల నిర్మాణం, బోర్లకు దగ్గర్లో వ్యవసాయ చెరువుల నిర్మాణం వంటి పద్ధతులు కొద్దిపాటి వర్షం కురిసినా భూగర్భ జలాల పెంపుదలకు ఉపయోగపడతాయి. ఎల్‌నినో గడ్డు కాలాన్ని తట్టుకోవటానికి ఇవి ప్రభావశీలంగా పనిచేస్తాయి. పొలంలో కురిసిన వర్షపు నీటిలో 30 నుంచి 70% వరకు రీఛార్జ్‌ చేయడానికి వీలుంది. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, బోరుబావిలో నీటి మట్టం తక్షణమే పెరుగుతుంది. స్థానికంగా లభించే వస్తువులతో బోర్‌ రీఛార్జ్‌ గుంతలను, బోర్లకు దగ్గర్లో నీటి కుంటలు నిర్మించవచ్చు. ఇవి సాపేక్షంగా చౌకైనవి. రైతులు సులభంగానే వీటిని నిర్వహించుకోవచ్చు. అనేక ప్రాంతాల్లో రైతుల అనుభవాలు ఈ విషయాన్ని నిర్థారిస్తున్నాయి.

– డా. ఆర్‌. రామ్‌మోహన్‌ 
(94401 94866), భూగర్భ జల నిపుణులు, 
వాటర్‌ అండ్‌ లైవ్‌లిహుడ్స్‌ ఫౌండేషన్, సికింద్రాబాద్‌

నిర్వహణ: పంతంగి రాంబాబు
సాక్షి సాగుబడి డెస్క్‌ 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement