
మాదాపూర్‌లోని ఆర్ట్ గ్యాలరీ యువ కళాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తోంది. చిత్రకారులు, ఫొటో గ్రాఫర్ల ప్రతిభను వెలికితీసేలా ఏడాది పొడవునా ఏదో ఒక ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. దీంతోపాటు పలు వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తోంది. ఆర్ట్.. అదిరేట్టు అన్న రీతిన చిత్రప్రదర్శనలు నగర సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ప్రదర్శన రాత్రి 7 గంటల వరకూ కొనసాగుతోంది. గణేశ చతుర్థి నేపథ్యంలో 22న పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న చిత్ర ప్రదర్శన 21 వరకూ కొనసాగనుంది..
హైదరాబాద్ నగరంలో చిత్రకళా ప్రదర్శనలకు వేదికగా మారుతోంది మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీ. ప్రముఖ చిత్ర కళాకారులు మొదలు.. యువప్రతిభవంతుల వరకూ తమ కళా ప్రతిభను ప్రదర్శించేందుకు చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీని వేదికగా చేసుకుంటున్నారు. దాదాపు 10కి పైగా గ్యాలరీలు కళాకారులకు అందుబాటులో ఉన్నాయి. గ్యాలరీలనే కాకుండా అడిటోరియాన్ని కూడా నిర్వాహకులు అద్దెకిస్తున్నారు. పిల్లల కోసం చిత్రలేఖన తరగతులు, శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఏడాదిలో దాదాపు 80 ప్రదర్శనల వరకూ జరుగుతాయి. గణేశ చతురి్థ, బతుకమ్మ, ఉమెన్స్ డే, ఆర్ట్ గ్యాలరీ వార్షికోత్సవాలను నిర్వహిస్తారు. కళాకారులకు కావాల్సిన వర్క్‌షాపులు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు రెండు, మూడు రోజుల ముందు నుంచే కళాకారులకు కావాల్సిన అన్ని వసతులూ కల్పిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ చిత్ర, ఫొటో ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఆలిండియా ఆర్ట్ కాపిటేషన్, ఎగ్జిబిషన్ ఇండియన్ ఫొటో ఫెస్ట్ ప్రతి ఏటా నవంబర్ 20వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకూ నిర్వహిస్తారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు. దాదాపు 50కి పైగా దేశాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలో భాగస్వాములవుతున్నారు.
గణేశ పెయింటింగ్ కాంపిటీషన్..
ఈనెల 22న ఆర్ట్ గ్యాలరీలో గణేశ్ చతుర్థి 2025 పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించనున్నారు. గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున అందించనున్నారు. ఈ నెల 20వ తేదీ వరకూ రిజి్రస్టేషన్ చేసుకోవచ్చు. దీనికి ఎంట్రీ ఫీజు రూ.500లుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 90309 04040, 91000 22958, 76618 72327లలో సంప్రదించవచ్చు.
ఆకట్టుకుంటున్న బియాండ్ బౌండరీస్..
53 మంది చిత్ర కళాకారులు వేసిన చిత్రాలు, స్కల్ప్చర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 21వ తేదీ వరకూ ఈ ప్రదర్శన సందర్శకులకు అందుబాటులో ఉంటున్నాయి.
బిట్వీన్ వాచ్ అండ్ విట్‌నెస్..
కళాకారుడు వేసిన చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీలో బిట్వీన్ వాచ్ అండ్ విట్‌నెస్ పేరిట ఏర్పాటు చేసిన ఫొటోగ్రఫీ చిత్రప్రదర్శనను గురువారం ప్రారంభించారు.
కళాకారుడు శరత్ ముపుడు తీసిన 120 ఫొటోగ్రఫీ చిత్రాలను అందుబాటులో ఉంచారు. ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉండనుంది. ఈ కార్యక్రమంలో పలువురు ఫొటోగ్రాఫర్‌లు పాల్గొన్నారు.
గ్యాలరీ బుకింగ్..
సోలో ఎగ్జిబిషన్ రూ.4,500. గ్రూప్ ఎగ్జిబిషన్ రూ.6000లుగా నిర్ణయించారు నిర్వాహకులు. చిన్న కార్యక్రమాలకు అనుకూలంగా శిక్షణ తరగతులు, పుస్తకావిష్కరణ తదితర కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. గ్యాలరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను సందర్శకులు తిలకించేందుకు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అందుబాటులో ఉంటాయి.
(చదవండి: యస్...ఇది గణేష్ బండి!)