
‘అవసరమే ఆవిష్కరణకు దారి చూపిస్తుంది’ అనే మాట తెలంగాణ రాష్ట్రం ముస్తాబాద్ మండలం సేవాలాల్‌తండాకు చెందిన లకావత్ గణేశ్ విషయంలోనూ నిజమైంది. పుట్టుకతో పోలియోతో రెండు కాళ్లు చచ్చుపడిపోయిన గణేశ్ ఎనిమిదో తరగతి వరకు చదివాడు. సెల్‌ఫోన్ రిపేరును సొంతంగా నేర్చుకొని ఇంట్లోనే షాపు పెట్టుకున్నాడు.
ప్రభుత్వం ద్వారా వచ్చిన మూడు చక్రాల బండి తరచూ రిపేరుకు రావడం, ఎత్తైన ప్రదేశాలు ఎక్కలేక పోవడంతో గణేశ్ ఇబ్బంది పడ్డాడు. విడిభాగాలు కాలిపోవడంతో బండిని మూలన పడేశాడు. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా మరొకరు సాయం చేసే వారు.
కొన్నిసార్లు ఎవరూ సాయం రాకపోవడంతో గణేశ్ ఆలోచన మూడు చక్రాల బండిపై పడింది. దీంతో ఒక సైకిల్ కొని దానికి బ్యాటరీ, మోటర్ బిగించాడు. కొన్ని విడిభాగాలను ఆన్‌లైన్‌లో, మరికొన్నింటిని ముస్తాబాద్‌లో కొనుగోలు చేశాడు. వాటిని సైకిల్‌కు బిగించి బ్యాటరీతో సులభంగా నడిచేలా ప్రయోగం చేశాడు.
అది విజయవంతం కావడంతో ఆ బ్యాటరీ సైకిల్‌పై తిరుగుతూ తన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చేస్తానని ఎంతో ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు గణేశ్.
– అవదూత బాలశేఖర్, సాక్షి, ముస్తాబాద్
(చదవండి: స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..)