మెన్స్‌ ఫ్యాషన్‌లో ‘పర్సనల్‌ టచ్‌’.. ఇప్పుడు ఇదే ట్రెండ్‌! | Mens Fashion New Trends Tailoring Designer Wear | Sakshi
Sakshi News home page

మెన్స్‌ ఫ్యాషన్‌లో ‘పర్సనల్‌ టచ్‌’.. ఇప్పుడు ఇదే ట్రెండ్‌!

Oct 4 2026 12:24 PM | Updated on Oct 4 2026 12:27 PM

Mens Fashion New Trends Tailoring Designer Wear

ఫండే

మెన్స్‌ ఫ్యాషన్‌

ప్యాంట్‌కి షర్ట్‌. షర్ట్‌కి కోట్‌... అంతేనా పురుషుల ఫ్యాషన్‌? అస్సలు కాదు! ఈ రోజుల్లో దుస్తులు కేవలం వేసుకునేవి మాత్రమే కాదు, మన గురించి చెప్పే వార్డ్‌రోబ్‌ విజిటింగ్‌ కార్ట్‌గా మారాయి. అందుకే పురుషుల్లోనూ రెడీమేడ్‌ కంటే, సంప్రదాయ టైలరింగ్‌ అందానికి, ఆధునిక ఆలోచనలతో కొత్త కలెక్షన్స్‌ను తీసుకొస్తున్నారు. అవెంటో ఇక్కడ చూద్దాం...

అభిరుచికి తగినట్లే ఎంపిక
ఒకప్పుడు రెడీమేడ్‌ దుస్తుల్లో నచ్చిన సైజు దొరికితే చాలు అనుకునే పురుషులు ఇప్పుడు చాలా తక్కువ. చాలామంది తమకు ఏది నప్పుతుంది? ఏ కట్‌లో సౌకర్యంగా ఉంటుంది? ఏ రంగు తమ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది? అని ఆలోచిస్తున్నారు. తమ కొలతలకు, అభిరుచికి తగ్గట్టుగా డిజైనర్‌ వేర్‌ను ఎంచుకుంటున్నారు. అలా కచ్చితమైన కటింగ్, పదునైన భుజాల ఆకృతి, పొరలుగా కనిపించే కాలర్లు, ప్రత్యేకమైన పాకెట్లు– ఇలా ప్రతి అంశం దుస్తులకు ఒక నిర్మాణాత్మకమైన అందాన్ని తీసుకొస్తుంది.

సౌకర్యమే కొత్త స్టయిల్‌!
ఫ్యాషన్‌ లో లుక్‌ ఎంత ముఖ్యమో, కంఫర్ట్‌ కూడా అంతే ముఖ్యం. అందుకే శరీర నిష్పత్తులకు తగ్గట్టుగా దుస్తులను రూపొందించడం మరో ప్రత్యేకత. మరీ బిగుతుగా కాదు, మరీ వదులుగా కాదు. కదిలినప్పుడు ఇబ్బంది పెట్టకుండా, వేసుకున్నప్పుడు సహజంగా అనిపించేలా కటింగ్‌ ఉంటుంది. ఎందుకంటే, రోజంతా సర్దుకుంటూ కూర్చునే ఉద్యోగం చేస్తే, అసలైన ఉద్యోగం పోతుంది కదా!

అకేషనల్‌ డిజైన్స్‌ 
ప్రశాంతంగా ఉండే ఒకే తెల్ల చొక్కానే ప్రతిసారి ఆఫీస్‌పార్టీ, ఫ్యామిలీ ఫంక్షన్‌కైనా సరిపోతుందనే రోజులు పోయాయి! ఇప్పుడు పురుషులు కూడా ఏ సందర్భానికి ఎలాంటి లుక్‌ కావాలో ముందే ఆలోచించుకొని, ప్రత్యేకంగా డిజైన్‌  చేయించుకుంటున్నారు. అలా పార్టీకి వేసుకునే బ్లేజర్‌ అయినా, పెళ్లికి ఎంచుకునే జో«ద్‌పురి అయినా మన అభిరుచికి తగ్గ చిన్న చిన్న మార్పులతో దానికి వ్యక్తిగత ముద్రను జోడిస్తున్నారు.

సంప్రదాయం... కొత్త గీతల్లో!
భారతీయ హస్తకళలో భాగమైన జర్దోజీ, ఆరి వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ పద్ధతులను పూల డిజైన్లకే పరిమితం చేయకుండా సరళమైన రేఖలు, ఆధునిక ఆకృతులు, విరుద్ధమైన అల్లికలతో ఆసక్తికరమైన రూపాలను తీసుకొస్తున్నారు. కానీ, ఎక్కడా అవసరానికి మించిన అలంకరణ కనిపించదు. ఎందుకంటే ఇప్పటి పురుషుల ఫ్యాషన్‌ లో ఎక్కువగా అరవడం లేదు. సైలెంట్‌గా స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారు.

ఫ్యాబ్రిక్‌ పైనా దృష్టి!
ఒకే వస్త్రానికి అన్ని పనులూ అప్పగిస్తే ఎలా! అందుకే, వేసుకునే ఫ్యాబ్రిక్‌పై కూడా దృష్టి పడుతోంది. పట్టు నచ్చుతుంది కాని, కాటన్‌ కంఫర్ట్‌ కావాలి. అలాగే, వెల్వెట్‌ టచ్‌తో రిచ్‌లుక్‌ ఉండాలి అని ఫీల్‌ అవుతున్నారు. అందుకే, ఒకేసారి రెండు, మూడు రకాల వస్త్రాలను కలిపి తమకు నచ్చిన టెక్స్చర్, ఫీల్, లుక్‌ను పురుషులే ఎంచుకుంటున్నారు. అందుకే, ఇక్కడ డిజైన్‌లో సంప్రదాయం ఉంటుంది. కానీ పాతకాలపు ఫీలింగ్‌ కనిపించదు.

అలా మొత్తానికి ఫురుషుల్లోనూ ఫ్యాషన్‌ అంటే మార్కెట్‌ ట్రెండ్‌ను ఫాలో కావటం కాదు, తమకంటూ ఓ స్టయిల్‌ను డిజైన్‌ చేసుకోవటం ట్రెండ్‌గా మారింది.

ఇదీ చదవండి: మంచి ఫిట్‌నెస్‌ అంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement