
ఇంటినీ, కుటుంబాన్ని చక్కదిద్దడంలో మాత్రమే కాదు.. అడుగు పెట్టిన రంగం ఏదైనా పట్టుదలగా ఎదిగి, తమ ఆసక్తిని,కలలను నెరవేర్చుకున్న ధీరవనితలు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా పురుషులకే సాధ్యం అనుకునే వ్యాపార రంగంలో అడుగు పెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఫల్గుణి నాయర్, వినితా సింగ్, ఇందిరా పూరి ఇషా అంబానీ కార్పొరేట్ సీఈవోలుగా ఎదుగుతున్నారు. మరికొంతమంది మహిళలు తమ కృషి ఆధారంగా స్టార్టప్‌లలో కూడా తామేంటో నిరూపించు కున్నారు. అంతేకాదు తక్కువ పెట్టుబడితోనే అద్భుతాలు చేస్తూ తనలాంటి ఎందరో ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాంటి వారిలో ఒకరు నిధి యాదవ్. ఆమె సాధించిన విజయం ఏమిటో తెలుసుకుందామా!
ఇండోర్‌లో జన్మించిన నిధికి ఫ్యాషన్ రంగం అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన నిధి డెలాయిట్‌లో పనిచేసేది. ఐదంకెల జీతం. కానీ అది సంతృప్తి నివ్వలేదు. తన అభిరుచిని కెరీర్‌గా మార్చుకోవడానికి, నిధి కూడా ఫ్లోరెన్స్‌లోని పోలిమోడా ఫ్యాషన్ స్కూల్‌లో ఒక సంవత్సరం కోర్సు చేసింది. అలా సొంత వ్యాపారం మొదలు పెట్టాలనే కోరికతోపాటు,కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు భారతదేశానికి తిరిగి రావాలనే పెద్ద ముందడుగు వేసింది. తన సొంత బ్రాండ్‌ను సృష్టించాలని నిర్ణయించుకుంది. అప్పటికే వివాహం, ఏడు నెలల పసిబిడ్డ ఉన్నా కూడా తన ఆశయానికి కట్టుబడి ఉంది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, డెలాయిట్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. 23 ఏళ్ల వయస్సులో ఉద్యోగాన్ని వదిలివేసి భర్తతోకలిసి తన సొంత దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించింది. 2014లో గురుగ్రామ్‌లోని తన 2BHK ఇంట్లో రూ.3.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఆక్స్ క్లోతింగ్‌ను ప్రారంభించింది.స్టైలిష్ ఎథ్నిక్ వేర్‌ను సరసమైన ధరల్లో అందించాలి, ముఖ్యంగా 18-35 సంవత్సరాల వయస్సు గల యువతులను లక్ష్యంగా చేసుకుంది. అనుకున్నట్టుగానే ఆమె వెంచర్ త్వరగా ఆదరణ పొందింది.2021 నాటికి రూ.200 కోట్ల ఆదాయాన్ని సాధించింది.
చాలా తక్కువ సమయంలో ఆక్స్ ప్రజాదరణ పొందింది. కంపెనీ కేవలం ఒక సంవత్సరంలో రూ. 8.50 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది 2018లో, కంపెనీ ఆదాయం రూ. 48 కోట్లకు పెరిగింది. ఐదేళ్లలోనే కంపెనీ ఒక రేంజ్‌కి చేరింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.అంటే 2014లో రూ. 1.60 కోట్లుగా ఉన్న ఆదాయం 2015లో రూ. 8.50 కోట్లకు, ఆ తర్వాత 2018 నాటికి రూ. 48 కోట్లకు పెరిగింది. 2021 నాటికి, ఆక్స్ ఎటువంటి బాహ్య నిధులు లేకుండానే రూ. 200 కోట్ల ఆదాయాన్ని అధిగమించింది.రూ. 500 కోట్ల టర్నోవర్‌తోపాటు గ్లోబల్ విస్తరణ లక్ష్యంగా ముందుకు సాగుతోంది నిధియాదవ్.
చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
బ్రాండ్ ప్రారంభ రోజుల్లో, నిధి ఆమె భర్త తమ పసికందుతో కలిసి గురుగ్రామ్,జైపూర్ మధ్య వారాంతపు తిరుగుతూ సామాగ్రిని సేకరించేవారు. ఈ కష్టాల మధ్య కోవిడ్ మహమ్మారి మరో సవాల్ విసిరింది. దీంతో పాటు కొత్త అవకాశాల్ని కూడా తెచ్చిపెట్టింది. క్లోతింగ్ ఉత్పత్తి సంక్షోభం తరుణంలో ఆక్స్ మాస్క్‌లు , PPE కిట్‌లను తయారు చేయడంలో పై చేయి సాధించింది. అలా కోవిడ్ కాలంలో బ్రాండ్ వృద్ధి 25 శాతం పెరిగిందంటే ఆమె కృషిని అర్థం చేసుకోవచ్చు. మిగిలిపోయిన బట్టను ఉపయోగించి పిల్లల దుస్తుల శ్రేణిని కూడా ప్రారంభించింది.
ఇదీ చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ!