అన్నం పెట్టే అందరి ఇల్లు | Hyderabad Andari Illu Completed 20 Years full details | Sakshi
Sakshi News home page

Hyderabad: అన్నం పెట్టే అందరి ఇల్లు

Jun 22 2026 2:50 PM | Updated on Jun 22 2026 3:01 PM

Hyderabad Andari Illu Completed 20 Years full details

హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఎస్‌బీఐ కాలనీకి వెళ్లి ‘అందరి ఇల్లు’ ఎక్కడా అని అడిగితే రోడ్‌ నంబర్‌ 2లో ‘మీ సేవ’ ఎదురుగా ఉంటుందని ఎవరైనా చెబుతారు. అటువైపు వెళితే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఓ నాలుగు గదుల ఇంటికి ‘అందరి ఇల్లు’ అని బోర్డు ఉంటుంది. తలుపులు తెరిచే ఉంటాయి. లోపలికి వెళితే ఆకలిగొన్నవారు వండుకుంటూ కనబడతారు. వండింది ఉంటే తినేవారు కనిపిస్తారు. పక్కనే బియ్యం, నూనె, పప్పు, ఉప్పు, అన్ని దినుసులు ఉంటాయి. కిచెన్‌లో స్టవ్, వంట పాత్రలు, ప్లేట్లు ఉంటాయి. ఈ ఇంటిలోకి వచ్చినవారు వండుకొని తినడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఏవి తక్కువ పడినా వెంటనే సమకూరు తాయి. అంతా ఉచితమే. మీ ఇల్లే అనుకోవచ్చు. దీనిని పిల్లల డాక్టరు వింజమూరి సూర్యప్రకాష్, గైనకాలజిస్టు సామవేదం కామేశ్వరి దంపతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీతో అందరి ఇల్లు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.

నిరాటంకంగా సాగుతున్న ఈ అన్న వసతికి వారు ఒకరి దగ్గర చేయి చాపలేదు, తామేదో ఘనకార్యం చేస్తున్నట్లు ప్రచారాన్ని కోరుకోలేదు. ఈ భోజన వసతి గురించి తెలిసిన గ్రామీణ పేద యువత అందరి ఇల్లుకు రావడం మొదలైంది. వారిలో ఎక్కువ మంది పోటీ పరీక్షల తయారీకి ఇల్లు వదిలి వచ్చినవారని తెలుసుకొని వారికోసం మరిన్ని వసతులు కల్పించారు. 2011లో వారు చదువుకోవడానికి లైబ్రరీ, కుర్చీ బల్లలు సమకూర్చారు. రాత్రుళ్లు ఇక్కడే ఉండిపోవడానికి కొన్ని బెడ్స్‌ కూడా వేశారు. ఇందులో ఆరు నెలలు, ఏడాది పాటు ఉండి ఉద్యోగ ప్రయత్నం కొనసాగించినవారు ఎందరో! పై అంతస్తులో కామేశ్వరి క్లినిక్‌ ఉంటుంది. వైద్యం కోసం వచ్చిన పేదలకు ఆహారానికి, నివాసానికి బెంగ అక్కర లేదు. పేద మహిళలు ప్రసూతి అయ్యే దాకా ఇక్కడే గడిపిన సందర్భాలు ఉన్నాయి. సూర్యప్రకాష్‌ రోజు ఉదయమే స్వయంగా వచ్చి సరుకులు, సదుపాయాలు సరిపడా ఉన్నాయా అని చూసుకుంటారు.  

ఈ ఆలోచన (Andari Illu) ఎలా వచ్చిందని అడిగితే ‘సృష్టిలో ప్రతి జీవికి ప్రకృతి ఏదో రూపంలో ఆహారాన్ని అందిస్తోంది. మనుషులు మాత్రమే డబ్బులు వెచ్చించి తిండిని సమకూర్చు కోవాలి. దినమంతా ఏమి తినకుండా రాత్రి గడిపేవారి పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉంటుంది. అందుకే ఇలా ఆరంభించాం’ అంటారు.

చ‌ద‌వండి: మా నాన్న ఎవ‌రో తెలుసా?

ఎలాగైనా ఖాళీ కడుపు నింపాలి అనే ఆలోచన ఈ వైద్య దంపతులకు 2001లో వచ్చింది. ముందుగా తోపుడు బండిలో అరటిపండ్లు పంచడం మొదలు పెట్టారు. కొన్నాళ్ళు రాత్రి భోజనాన్ని అందించారు. ఇవేవీ తృప్తి నీయక 2006 జూన్‌ 15న ‘అందరి ఇల్లు’ను ఆరంభించారు. ఎలాంటి ప్రారంభోత్సవ హంగామాలు చేయకుండా స్వయంగా వారే పేదలు ఉండే అడ్డాల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. 24 గంటలు ఇక్కడ సేవలు లభిస్తాయి. తమలాగే ఎవరైనా ముందుకొస్తే ఆ ఆలోచన కార్యరూపం అయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ దంపతులు చెబుతున్నారు.

– బద్రి నర్సన్‌ 
కవి, కథకుడు 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement