తిన్నవెంటనే ఎంతోమంది చేసే ఫిర్యాదు... గుండెల్లో మంటగా ఉంది; ఛాతీ బరువుగా ఉందీ; నోట్లోకి పుల్లతేన్పులూ, చేదురుచీ వస్తున్నాయని. దాంతో చాలామంది నోట తినగానే వినిపించే మాట... ‘ఎసిడిటీ’ అని! అవును... ఈ సమస్య చాలామందిలో తరచూ కనిపించేదే. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందో కాదోగానీ... ఎసిడిటీ ముదిరితే జీఈఆర్‌డీ తప్పక అవుతుంది. ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’ అనే మాటకు సంక్షిప్తరూపమైన ‘జీఈఆర్‌డీ’ అంటే ఏమిటి, దానికి కారణాలేమిటి, నివారణ, చికిత్స ఎలా వంటి అనేక అంశాల గురించి తెలుసుకుందాం.
ఎసిడిటీ లక్షణాలు కనిపించగానే కొందరు యాంటాసిడ్ పౌడర్ ప్యాక్‌ను చింపి గ్లాస్‌లో వేసుకుని, నీళ్లు ΄ోసుకుని తాగేస్తుంటారు. ఇది చాలామంది చేసేదే. అయితే ఏదో బాగా మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడో, ఎప్పుడో బాగా రుచిగా ఉన్న పదార్థాలు కడుపునిండుగా తిన్నప్పుడో అరుదుగా ఇలా జరిగితే పర్లేదు. కానీ తరచూ ఇదే పరిస్థితి ఎదురవుతుంటే మాత్రం ఆలోచించాలంటున్నారు వైద్యనిపుణులు.
ఎసిడిటీకీ... జీఈఆర్‌డీకీ ఇదీ తేడా!
మనం ఆహారం తీసుకోగానే అది ఆహారనాళం (ఈసోఫేగస్) ద్వారా సంచి ఆకృతిలో ఉండే కడుపు (స్టమక్)లోకి వెళ్తుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడానికి కడుపులో యాసిడ్ స్రవిస్తూ ఉంటుంది. ఆహారనాళం చివరన... అంటే ఆహారనాళమూ, సంచి ఆకృతిలోని స్టమక్ కలిసే చోట ఆహారాన్ని పైకి రానివ్వకుండా చూసే ‘స్ఫింక్టర్’ ఉంటుంది.
ఇది ఈసోఫేగస్ చివరన ఉండటంతో దీన్ని ‘లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్’ అంటారు. కడుపులోకి ఆహారం వెళ్లగానే ఇది బిగుసుకుపోయి స్టమక్‌లో స్రవించే యాసిడ్‌ను పైకి రానివ్వదు. కడుపు నిండుగా ఆహారం తీసుకున్నప్పుడు ఈ స్ఫింక్టర్ పూర్తిగా మూసుకుపోకపోవచ్చు. దాంతో అలాంటప్పుడు కడుపులోని యాసిడ్ ఈసోఫేగస్‌లోకి రావడంతో ఆ యాసిడ్ తాలూకు ‘మంట’ గొంతులో తెలుస్తుంది. ఒక్కోసారి ఆ యాసిడ్ గొంతులోకి వచ్చి చేదు రుచి కూడా తెలుస్తుంది. దీన్నే ‘ఎసిడిటీ’గా చెబుతుంటారు.
అయితే... ఈ స్ఫింక్టర్ వదులై΄ోవడం వల్ల ఎసిడిటీలో కనిపించే లక్షణాలు దీర్ఘకాలం పాటు కనిపిస్తూ ఉంటే... దాన్ని కేవలం ‘ఎసిడిటీ’ గా తీసుకోకూడదు. ఆ కండిషన్‌ను ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్ డిసీజ్’గా చెబుతారు. ఇక్కడ ‘రిఫ్లక్స్’ అంటే వెనక్కు రావడం. అంటే కడుపులో ఉండాల్సిన యాసిడ్ వెనక్కు గొంతుభాగంలో ఉండే ‘ఈసోఫేగస్’లోకి వస్తుంది కాబట్టే... ఈ సమస్యకు ఆ పేరు.
సమస్యకు కారణమయ్యే అంశాలు...
చాలామందిలో ఎప్పుడో ఒకసారి కనిపించే ఈ సమస్య కొందరిలో తరచూ కనిపించడానికి కొన్ని అంశాలు కారణమవుతాయి. అవి... అధిక బరువు / ఊబకాయం, మద్యం, పొగతాగే అలవాటు, హయటస్ హెర్నియా, కొన్ని రకాల మందులు, మహిళల్లో అయితే గర్భధారణ వంటి అంశాలు ఈ సమస్యకు కారణమవుతాయి.
ముప్పు ఎప్పుడంటే...
జీఈఆర్‌డీని ఎసిడిటీగానే పరిగణించి చాలాకాలం నిర్లక్ష్యం చేస్తే ఆహారనాళంలో వాపు, పుండ్లు, ఆహారనాళం ఇరుకుగా మారడం వంటి సమస్యలు రావచ్చు. కొందరిలో బారెట్ ఈసోఫేగస్ అనే సమస్య వచ్చే అవకాశమూ ఉండవచ్చు. అందుకే ఈ సమస్య తరచూ కనిపిస్తుంటే మాత్రం దీన్ని ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్యగా పరిగణించి స్వయంగా మందులు వాడటం మంచిది కాదు. ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.
నివారణ ఇలా...
సాధారణంగా మసాలాలతో కూడిన ఆహారం, నూనెలు ఎక్కువగా ఉండే ఆయిలీఫుడ్ వంటివి ఇందుకు కారణమైనప్పటికీ... వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరు అంశాలూ, ఆహారాలు ఈ సమస్యను ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుకే తాము ఏ ఆహారం తీసుకున్న తర్వాత తమకు యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువవుతోందో గమనిస్తూ, ఆ ఆహారాలను తగ్గించుకోవడం లేదా వాటికి దూరంగా ఉండటం అవసరం.
అలాగే ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం, మసాలాలూ, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం, కెఫిన్ ఉండే కాఫీ / కోలా డ్రింక్స్ లాంటి పానీయాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు చాలావరకు ఉపశమనం కలిగించవచ్చు. అలాగే బరువు తగ్గించుకోవడం కూడా ఈ సమస్యకే కాకుండా... తమ పూర్తి ఆరోగ్యానికీ మేలు చేసే అంశం. ఇక స్ట్రెస్, యాంగై్జటీ వంటి అంశాలు కూడా ఈ సమస్యను పెంచే అవకాశముంది. కాబట్టి వాటిని తగ్గించుకునేలా రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించడమూ మేలు చేస్తుంది.
చిన్న మార్పులతో ఉపశమనం
పొగతాగే అలవాటును పూర్తిగా మానేయడం, భోజనం చేసిన వెంటనే పక్కమీదికి ఒరగకుండా కాసేపు అటు ఇటు నడవడం, రాత్రి భోజనం తర్వాత కనీసం 2–3 గంటల పాటు నిద్రకు ఉపక్రమించకపోవడం వంటి జీవనశైలి (లైఫ్‌స్టైల్) మార్పులు రిఫ్లక్స్‌ను తగ్గించడంలో సహాయపడవచ్చు. రాత్రివేళ సమస్య ఎక్కువగా ఉంటే పడుకునే సమయంలో దేహభాగం కంటే తలభాగం కాస్త ఎత్తుగా ఉంచేలా తలగడ ఉపయోగించడం వంటి చిన్న చిన్న మార్పులు చాలావరకు ఉపయోగపడతాయి.
మందులు / చికిత్స...
సమస్య / లక్షణాల తీవ్రతను బట్టి డాక్టర్లు యాంటాసిడ్స్, ఏ2 బ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) వంటి మందులను సూచిస్తారు. ఈ సింపుల్ మందులూ, జీవనశైలి మార్పులతోనూ సమస్య అదుపులోకి రాకపోతే అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ వంటి పరీక్షలు, సమస్య తీవ్రతను బట్టి కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
డాక్టర్లను సంప్రదించాల్సిన లక్షణాలు...
మింగడంలో ఇబ్బంది, పదేపదే వాంతులు, కారణం లేకుండా బరువు తగ్గడం, రక్తపు వాంతులు లేదా నల్లగా ఉండే మలం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే ఛాతీ నొప్పి తీవ్రంగా ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతి లేదా దవడ వైపు నొప్పి ఉంటే అది గుండె సంబంధిత అత్యవసర పరిస్థితి కూడా కావచ్చు.
లక్షణాలు...
తిన్న తర్వాత గుండెల్లో మంట
నోట్లోకి పుల్లటి లేదా చేదు ద్రవం రావడం
గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం
రాత్రివేళ దగ్గు, గొంతు బొంగురు΄ోవడం
ఛాతి లేదా పై పొట్టలో అసౌకర్యం
కడుపు ఉబ్బరంగా అనిపించడం
అదేపనిగా తేన్పులు వస్తుండటం
మింగడంలో ఇబ్బంది లేదా నొప్పి
అయితే ఈ సమస్య ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. కొందరిలో కొన్ని లక్షణాలు మాత్రమే కనిపించవచ్చు. ఉదాహరణకు గుండెల్లో మంట లేకుండానే దగ్గు లేదా గొంతుకు సంబంధించిన సమస్యలు కనిపించవచ్చు.
డాక్టర్ తరుణ్ గట్టు, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
నిర్వహణ : యాసీన్
ఇదీ చదవండి: పెళ్లికి ముందే రెండుసార్లు IVF ఫెయిల్.. పెళ్లైన తొమ్మిది నెలల్లోనే బిడ్డ..


