ముప్పేటదాడి అనే మాట వినే ఉంటారు. మొన్ననే ముగిసిన టపాసుల నుంచి వెలువడిన రసాయన కాలుష్యాలు ఒకవైపు, ఇక నిత్యం మన వాహనాలు, పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడుతూ గాలిలోకి కలిసిన కాలుష్యాలతో అమాంతం పెరిగి΄ోయిన ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) ఇంకోవైపు... ఇక మరోవైపున... ఈ సీజన్ కాస్తా చలికాలం కావడంతో గాలిలోని పొగ ప్లస్ మంచు కలిసి ఏర్పడే స్మాగ్‌లో ఇరుక్కుపోయి కాలుష్యాలన్నీ ఒకచోట పేరుకుపోయి ఈ మూడూ కలసి మన కళ్లమీదా, ఊపిరితిత్తుల మీదా, ఆరోగ్యం మీద ముప్పేట దాడి చేస్తున్నాయి. మనం పీల్చే గాలితో పాటు ఊపిరితిత్తుల్లోకి చేరే సూక్ష్మ కాలుష్య కణాలు శ్వాసకోశ వ్యవస్థతోపాటు గుండె, రక్తనాళాలపైనా ప్రభావం చూపుతూ... ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులుపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసుకుందాం.
సాధారణంగా గాలి కదులుతూ ఉంటే కాలుష్య కారకాలు ఒకచోట పేరుకుపోకుండా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తాయి. కానీ చలికాలంలో కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రక్రియ మందగిస్తుంది. సాధారణ పరిస్థితుల్లో భూమికి దగ్గరగా ఉండే గాలి వేడెక్కి పైకి వెళుతుంది. దాంతో గాలి కదలికలు ఏర్పడి కాలుష్య కారకాలు కూడా కొంతవరకు పైకి వ్యాపిస్తాయి. అయితే చలికాలంలో కొన్ని సందర్భాల్లో దీనికి భిన్నమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీనినే ‘టెంపరేచర్ ఇన్వర్షన్ అంటారు.
ఈ పరిస్థితిలో భూమికి దగ్గరగా చల్లని గాలి, దాని పైన వెచ్చని గాలి పొర ఏర్పడతాయి. పైభాగంలోని వెచ్చని గాలి ఒక మూతలా పనిచేస్తూ కింద ఉన్న చల్లని గాలి పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. దీంతో భూమికి దగ్గరగా ఉన్న కాలుష్య కారకాలు కూడా అక్కడే చిక్కుకు΄ోతాయి. గాలి వేగం తక్కువగా ఉన్నప్పుడు పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.
వాహనాల పొగ, పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, నిర్మాణ పనుల దుమ్ము, చెత్తను కాల్చడం వంటి వాటి వల్ల ఇప్పటికే గాలిలో ఉన్న కాలుష్యం ఇలా ఒకేచోట పేరుకుపోతుంది. ఈ నేపథ్యంలో గాలి ఎటూ వెళ్లకుండా భూమికి దగ్గరే ఉన్న సమయంలో పొగ ప్లస్ మంచు (స్మోక్ ప్లస్ ఫాగ్) కలిసి ఏర్పడే స్మాగ్‌లో రసాయనాలూ, కాలుష్యాలూ చిక్కుకుపోయి నేలకు దగ్గరగా ఉంటూ ఆ కాలుష్యం నుంచి ప్రయాణం చేసేవారి ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఇక వర్షాకాలానికి ముందు వీచే బలమైన గాలులు, దుమ్ము తు΄ానులు కూడా కొన్ని ప్రాంతాల్లో గాలిలో పీఎమ్10 వంటి ధూళి కణాల మోతాదును పెంచుతాయి. అంటే కాలుష్యానికి మానవ కార్యకలాపాలతోపాటు కొన్ని సహజ వాతావరణ పరిస్థితులూ తోడవుతున్నాయి.
మరో కాలుష్య కారకం...
గ్రౌండ్ లెవల్ ఓజోన్‌వాహనాలు, విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య కారకాలు మరో ప్రమాదకరమైన వాయువును కూడా సృష్టిస్తాయి. అదే గ్రౌండ్ లెవల్ ఓజోన్ సాధారణంగా ఓజోన్ అనగానే మనకు భూమికి ఎగువన ఉండే ఓజోన్ పొర గుర్తుకొస్తుంది. ఆ పొర సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అల్ట్రా వయొలెట్ కిరణాల నుంచి భూమిపై జీవరాశిని రక్షిస్తుంది. కానీ ఇలా భూమికి దగ్గరగా, మనం పీల్చే గాలిలో ఏర్పడే ఓజోన్ మాత్రం మనుషులకు హానిచేసే మరో రకమైన కాలుష్య కారకం.
వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్స్, అస్థిర కర్బన సమ్మేళనాలు (వోలటైల్ ఆర్గానిక్ కాంపౌడ్స్–వీవోసీస్) సూర్యరశ్మి సమక్షంలో రసాయన చర్యలకు లోనైనప్పుడు ఈ ఓజోన్ ఏర్పడుతుంది.
ఇది స్మాగ్‌లోని ప్రధానమైన భాగాల్లో ఒకటి. ఈ గ్రౌండ్ లెవల్ ఓజోన్‌ను పీల్చడం వల్ల దగ్గు, గొంతులో మంట, ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకైటిస్, ఎంఫిసీమా వంటి సమస్యలున్నవారిలో లక్షణాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధులు, బయట ఎక్కువసేపు శారీరక శ్రమ చేసే వారిపైనా దీని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు..
టపాసుల పొగలో ఏముంటుంది?
బాణసంచా కాల్చినప్పుడు వెలువడే పొగలో పీఎమ్ (పార్టికిల్ మ్యాటర్) 2.5 నుంచి పీఎమ్ 10 వరకు ధూళికణాలతో పాటు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్, వంటి ఆరోగ్యానికి చేటు చేసే వాయువలతో పాటు కొన్ని లోహాల కణాలు కూడా ఉండవచ్చు. బాణసంచాలో ఉపయోగించే రసాయనాలను బట్టి వాటి మోతాదులు మారుతుంటాయి.
వీటిలో పీఎమ్10 కణాల పరిమాణం 10 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది. పీఎమ్ 2.5 కణాల పరిమాణం మాత్రం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ. మన వెంట్రుక మందంతో పోలిస్తే ఇవి చాలా సూక్ష్మమైనవి. అందుకే అవి మనం పీల్చినప్పుడు ముక్కు, గొంతు దగ్గరే ఆగిపోకుండా ఊపిరితిత్తుల్లోని లోతైన భాగాల వరకు చేరగలవు. పీఎమ్ 2.5 కణాల్లో కొన్ని ఊపిరితిత్తులను సైతం దాటి రక్తప్రవాహంలోకి కూడా ప్రవేశించగలవు.
బాణాసంచా ప్రభావం ఇలా...
టపాసుల పొగకు కొద్దిసేపు గురైనా కొందరిలో కళ్లు, ముక్కు, గొంతులో మంట, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇప్పటికే ఆస్తమా లేదా ఇతర ఊపిరితిత్తుల సమస్యలున్నవారిలో అవి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చిన తర్వాత గాలిలో సూక్ష్మ ధూళి కణాలు, కొన్ని లోహాల మోతాదులు గణనీయంగా పెరుగుతాయని పలు పరిశోధనలు కూడా గుర్తించాయి.
కాలుష్యం నుంచి మనల్ని మనం
ఎలా కాపాడుకోవాలి?
వాయు కాలుష్యాన్ని పూర్తిగా నివారించడం ఒక్క వ్యక్తి చేతుల్లో ఉండదు. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, పరిశ్రమలు, ప్రజల సంయుక్త కృషి అవసరం. అయితే... వ్యక్తిగతంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాలుష్యానికి గురయ్యే అవకాశాల్ని తగ్గించుకోవచ్చు.
1. ఏక్యూఐని గమనించడం: బయటకు వెళ్లే ముందు మీ ప్రాంతంలోని గాలి నాణ్యతను పరిశీలించండి. ఏక్యూ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలున్నవారు బయట ఎక్కువసేపు గడపకూడదు.
2. వ్యాయామ సమయాన్ని మార్చుకోవడం: కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో బయట జాగింగ్, సైక్లింగ్, వేగంగా నడవడం వంటి వ్యాయామాలు తగ్గించాలి. అవసరమైతే ఇంట్లోనే వ్యాయామం చేసుకోవచ్చు. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు లోతుగా, వేగంగా గాలి పీల్చడం వల్ల ఎక్కువ కాలుష్య కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశం ఉంటుంది.
3. అవసరమైతే ఎన్ 95 మాస్క్ వాడటం: కాలుష్యం అధికంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లక తప్పని పరిస్థితుల్లో ముక్కు, నోటికి సరిగ్గా అమరే ఎన్ 95 లేదా ఎన్ 99 మాస్క్ వాడటం వల్ల పీఎమ్ 2.5, పీఎమ్ 10 వంటి సూక్ష్మ కణాల నుంచి కొంత రక్షణ లభిస్తుంది. సాధారణ గుడ్డ మాస్కులు, స్కార్ఫ్‌లు ఈ సూక్ష్మ కణాలను సమర్థంగా అడ్డుకోలేవు. ఎన్ 95 మాస్క్ కూడా ఓజోన్ , కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయు కాలుష్య కారకాల నుంచి రక్షణ ఇవ్వదు.
4. ఇంటి లోపలి గాలినీ శుభ్రంగా ఉంచడం: బయట కాలుష్యం ఉందని ఇంట్లోకి వచ్చాక పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు కాదు. వంట పొగ, సిగరెట్ పొగ, అగరబత్తులు, దోమల నివారణ కోసం కాల్చే పదార్థాల పొగ కూడా ఇంటి లోపలి గాలిని కలుషితం చేయవచ్చు. వీలైనంత వరకు పొగకు దూరంగా ఉండాలి. అవసరమైనప్పుడు గాలి ప్రసరణకు అనుకూలమైన విధంగా కిటికీలు తెరవాలి. బయట కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం కిటికీలు మూసి ఉంచడం మంచింది.
5. వైద్యులు సూచించిన మందులు అందుబాటులో ఉంచుకోవడం: ఆస్తమా, సీవోపీడీ వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలున్నవారు వైద్యులు సూచించిన మందులు, ఇన్హేలర్లను క్రమం తప్పకుండా వాడాలి. కాలుష్యం పెరిగిన రోజుల్లో లక్షణాలు తీవ్రమవుతున్నాయా అని గమనించాలి. మందుల మోతాదును సొంతంగా మార్చుకోకూడదు.
6. టీకాలు వేయించుకోవడం: ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులున్నవారు వైద్యుల సలహా మేరకు ఫ్లూ (ఇన్‌ఫ్లుయెంజా), న్యుమోకాకల్ టీకాలు వేయించుకోవాలి. ఇవి వాయు కాలుష్యం నుంచి రక్షించకపోయినా, కొన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ముప్పును తగ్గించడంలో సహాయపడతాయి.
7. లక్షణాలు పెరిగితే నిర్లక్ష్యం తగదు: దగ్గు, పిల్లికూతలు, ఆయాసం, ఛాతీలో బిగుతు వంటి లక్షణాలు సాధారణం కంటే ఎక్కువగా కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. తీవ్రమైన శ్వాస ఇబ్బంది, ఛాతీనొప్పి లేదా పెదవులు నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్యసహాయం తీసుకోవాలి.
ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం?
మనం పీల్చే గాలిలోని కాలుష్య కణాలు శ్వాసనాళాల్లోకి చేరినప్పుడు అక్కడ వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్), ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు దారితీయవచ్చు. దీనివల్ల శ్వాసనాళాల లోపలి పొరలు దెబ్బతినడం, కఫం పెరగడం, శ్వాసనాళాలు కుంచించుకు΄ోవడం వంటి పరిణామాలు సంభవించవచ్చు.
ఇప్పటికే ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ), ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ) వంటి సమస్యలున్నవారిలో దగ్గు, పిల్లికూతలు, ఆయాసం, ఛాతీలో బిగుతు వంటి లక్షణాలు పెరగవచ్చు. సీవోపీడీ బాధితుల్లో కాలుష్యానికి గురికావడం వల్ల వ్యాధి ఒక్కసారిగా తీవ్రమై ఊపిరి అందడం చాలా కష్టమయ్యే (అక్యూట్ ఎగ్జాసెర్బేషన్) పరిస్థితి ఏర్పడవచ్చు. దీనివల్ల అత్యవసర వైద్యసేవలు, తక్షణ ఆసుపత్రి చికిత్స అవసరమమ్యే ముప్పు ఉంటుంది.
తీవ్రమైన వైరల్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకుంటున్నవారిలోనూ కాలుష్యం వల్ల దగ్గు, శ్వాస ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. పొగతాగే అలవాటున్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు కూడా...
వాయు కాలుష్యానికి దీర్ఘకాలం గురికావడం ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పును పెంచే అంశాల్లో ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్‌సీ) ఆరుబయటి వాయు కాలుష్యాన్ని, అందులోని ధూళి కణాలను క్యాన్సర్ కారకాలుగా పేర్కొంది.
అయితే ఒకటి రెండు రోజులు కాలుష్యానికి గురికావడం వల్ల వెంటనే క్యాన్సర్ వస్తుందని కాదు. దీర్ఘకాలం పాటు కాలుష్యానికి గురికావడం వల్ల ఈ ముప్పు పెరుగుతుంది. పొగతాగడం వంటి ఇతర ప్రమాద కారకాలతో కలిసినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రం, త్వరితం అవుతుంది.
డాక్టర్ రమణ ప్రసాద్, సీనియర్ స్లీప్ స్పెషలిస్ట్, పల్మునాలజిస్ట్
నిర్వహణ యాసీన్
ఇదీ చదవండి: Smarter Money Decisions: డబ్బు నిలవాలంటే..ఈ జంట చెప్పే మనీ హ్యాక్స్ ఇవే..!


