
ఇస్లాం వెలుగు
గర్వం, అహంకారం అన్నవి మహాచెడ్డ దుర్గుణాలు. మానవులకు ఏవిధంగానూ శోభించని లక్షణాలు. నిజానికి ఇవి షైతాన్ గుణాలు. కేవలం అహం కారణంగానే దైవానికి అవిధేయుడై దుర్మార్గుల్లో కలిసి పొయ్యాడు, ధూర్తుడిగా మిగిలి పోయాడు. దైవం మానవుణ్ణి సృష్టించిన తరువాత, అందరూ అతనికి సజ్దా (సాష్టాంగ ప్రణామం) చెయ్యాలని ఆదేశించాడు. కాని షైతాన్ చెయ్యలేదు. ఈ విషయం పవిత్ర ఖురాన్‌లో ఇలా ఉంది.: ’ ... ఆ తర్వాత మేము ఆదంకు గౌరవ సూచకంగా అభివాదం చెయ్యండని దైవదూతలను ఆదేశించాము. అప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ అభివాదం చేశారు. ఇబ్లీసు తనేదో గొప్పవాణ్ణన్న అహంకారంతో విర్రవీగుతూ, తిరస్కరించి అవిధేయుడై పొయ్యాడు.’(2 – 34). అల్ ఆరాఫ్ సూరా 11, 12 వాక్యాల్లో, సాద్ సూరా 73, 74, 75 లో కూడా ఈ ప్రస్తావన ఉంది.
అహం అంటే.., తానే గొప్పవాడినని భావించడం. ఇతరులను తక్కువగా, హీనంగా చూడడం. అన్నీ, అంతా తనకే తెలుసని, ఇతరులకేమీ తెలియదని తల΄ోయడం. షైతాన్ ఇక్కడ రెండు తప్పులు చేశాడు. ఒకటి: దైవాదేశాన్ని తిరస్కరించాడు. రెండు: ఆదిమానవుణ్ణి తనకన్నా తక్కువ వాడుగా, నీచుడిగా చూశాడు. అంటే, తన సృజన అగ్నితో జరిగింది కాబట్టి, మట్టితో సృష్టించబడిన వాడికంటే తానే గొప్పవాడినన్న అహం అతడి సత్యతిరస్కారానికి కారణమైంది. ఈ విధంగా వాడు తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు.
సత్యాన్ని సత్యంగా అంగీకరించాలంటే, ఇతరులను గౌరవ దృష్టితో చూడగలగాలంటే, ’అందరి’ కన్నా గొప్పవాడయిన సృష్టికర్త ఆదేశాలను పాలించగలగాలి. కాని అతనిలోని అహం మరెవ్వరినీ తనకన్నా గొప్పవాడుగా అంగీకరించడానికి ఒప్పుకోదు. సమాజంలో తనకో గొప్పస్థానం ప్రాప్తం కావాలని కోరుకుంటాడు. మరెవరూ తన స్థాయికి, కనీసం తన దరిదాపుల్లోకి రావడాన్నీ సహించలేడు. అంతా తనకే తెలుసునని, ఎదుటివారికి ఏమీ తెలియదని, తనమాటే చెల్లుబాటు కావాలని అభిలషిస్తాడు. ఈ వైఖరి సరయినది కానప్పటికీ, ఎదురు దెబ్బలు తగులుతున్న ప్పటికీ అతనిలోని ’ అహం ’ తప్పుడు వైఖరి గురించి ఆలోచించే అవకాశమే ఇవ్వదు. మంచి అనేది ఉంటే అది తనలోనే ఉందని, ఇతరులు చేరుకోక ముందే తాను దాన్ని అంది పుచ్చుకుంటానని అతను భావిస్తాడు. ఎదుటి వారిలోని ఏమంచినీ, ఏ నైతిక సుగుణాన్నీ అతను అంగీకరించడు. నైతిక వర్తను డైనా, సౌజన్యశీలుడైనా అంతా తానేనని తల΄ోస్తాడు.
చదవండి: Ashtavakra అష్టావక్ర సందేశం
ఇలాంటివారు తమ అహంకార వైఖరి కారణంగా తమను తామే నష్టపరుచుకుంటారు తప్ప మరొకటి కాదు. ఇదంతా తమకే అంతా తెలుసు, ఎదుటి వారికి ఏమీ తెలియదనుకున్న ఫలితం. వారి మనసులో తామేదో గొప్పవాళ్ళమన్న అహంకార భావం తిష్ట వేసుకొని ఉంటుంది. ఇది ఎంతమాత్రం మంచి విధానంకాదు. గర్వం, అహంకారం లాంటి దుర్లక్షణాల నుండి దైవం అందరినీ
కాపాడాలని కోరుకుందాం.
ఇదీ చదవండి: ఎవడు వివేకి? ఎవడు అవివేకి?