
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలే కేంద్రంలోని మోదీ ప్రభుత్వ అవినీతి పాలన పతనానికి నాంది పలుకుతాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌ను భారంగా భావిస్తున్న బీజేపీ ఆయనను మానసికంగా రిటైర్ చేసిందని చెప్పారు. బుధవారం పట్నాలో సీడబ్ల్యూసీ భేటీలో ఖర్గే మాట్లాడారు. బిహార్‌ను ఒక ఉదాహరణగా చూపించి లక్షలాది మంది ఓట్లను తొలగించడానికి దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ఓటరు జాబితాను తారుమారు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని, ఈ సమయంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మనమంతా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. మన దేశం అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న సమస్యలకు మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విఫలమవడం కావడమే కారణమని ఆరోపించారు. మోదీ గొప్పగా చెప్పుకుంటున్న స్నేహితులే భారత్‌ను సమస్యల వలయంలోకి నెట్టారని మండిపడ్డారు. ఒకవైపు స్వదేశీ అని చెబుతున్న మోదీ మరోవైపు చైనాకు బహిరంగంగా ఎర్ర తివాచీ పరుస్తున్నారని ఖర్గే ధ్వజమెత్తారు.
ఈబీసీల రక్షణకు చట్టం: రాహుల్
బిహార్‌లో తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రక్షణ చట్టం తరహాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ)ను వేధింపుల నుంచి రక్షించడానికి చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈబీసీలకు న్యాయం చేయడానికి 10 సంకల్పాలను ప్రకటించారు. స్థానిక సంస్థల్లో ఈబీసీల రిజర్వేషన్లను 20 శాతం నుంచి 30 శాతానికి పెంచుతామన్నారు.
రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, ఈబీసీలకు కలిపి 50 శాతం కోటా కలి్పస్తామన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈబీసీలు ప్రవేశాలు కలి్పస్తామని తెలిపారు. అంతేకాకుండా ఉచితంగా భూమి పంపిణీ చేస్తామన్నారు. విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్నత స్థాయి రిజర్వేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేస్తామని రాహుల్ ప్రకటించారు. ఓట్ల చోరీపై త్వరలో హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నానని స్పష్టంచేశారు.