
మితిమీరిన ట్రంపరితనం!
పాక్‌తో మధ్యవర్తిత్వానికి ససేమిరా అంటోందని భారత్‌పై ఆగ్రహం
‘నోబెల్’కు గండి కొడుతోందని అక్కసు
తాజా నివేదికలో అమెరికా ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ ధ్వజం
రెండోసారి అమెరికా గద్దెనెక్కింది మొదలు, అన్ని దేశాలతోనూ గిల్లికజ్జాలతో తంపులమారిగా, ప్రపంచానికే పెను బెడదగా తయారయ్యారు ట్రంప్. మరీ ముఖ్యంగా భారత్ మీదనైతే మితిమీరిన ప్రతీకార ధోరణి ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్‌తో సంధి కుదిర్చే యత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించిందన్న కోపంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. అందుకోసం ఏకంగా తాను అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని అన్న వాస్తవాన్ని కూడా పక్కన పెట్టారు. అహంకార (ఇగో) ధోరణితో వ్యవహరిస్తున్నారు. అమెరికాకు అతి ముఖ్యమైన మిత్ర రాజ్యాల్లో ఏ దేశంపైనా లేనివిధంగా భారత్‌పై తాజాగా ఏకంగా 50 శాతం సుంకాలు విధించడం వ్యక్తిగత కసి తీర్చుకునే ప్రయత్నాల్లో భాగమే.
– అమెరికా ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశానికే చెందిన ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ పలుగురాళ్లతో నలుగు పెట్టింది. భారత్ విషయంలో కొద్ది నెలలుగా ఆయన ప్రదర్శిస్తూ వస్తున్న కురచ బుద్ధిని తీవ్రస్థాయిలో తూర్పారబట్టింది. ‘‘ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్‌తో తలెత్తిన యుద్ధ పరిస్థితులను చల్లబరిచేందుకు మధ్యవర్తిత్వం చేస్తానంటే ససేమిరా అంటూ భారత్ తిరస్కరించడాన్ని ట్రంప్ నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. బతిమాలినా, బెదిరించినా, చివరికి పదేపదే బ్లాక్‌మెయిలింగ్‌కు దిగినా మోదీ సర్కారు దిగి రాలేదని, తనకు అణుమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదని ఆయనలో కడుపుమంట నానాటికీ పెరిగిపో తోంది.
ఇరుదేశాల మధ్య చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరించి, తనను తాను శాంతిదూతగా చిత్రించుకుని చిరకాల స్వప్నమైన నోబెల్ శాంతి బహుమానం సాధించాలన్న కలలకు అడ్డంగా గండి కొడుతోందన్న ఆగ్రహం పూర్తిస్థాయిలో కట్టలు తెంచుకుంటోంది. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై భారత్ ఎంత ప్రముఖ దేశంగా వెలిగిపోతోందో తెలిసి కూడా ట్రంప్ ప్రదర్శిస్తున్న ప్రతీకార వైఖరి ఇరుదేశాల నడుమ పూడ్చలేనంతటి అగాధానికి దారి తీస్తోంది. అధ్యక్ష స్థానంలో ఉన్న నాయకుని వ్యక్తిగత ఇగో భారత్, అమెరికా ద్వైపాక్షిక బంధానికే పెను ముప్పుగా పరిణమిస్తోంది’’అంటూ తాజా నివేదికలో నిర్మొహమాటంగా కడిగిపారేసింది.
భారత్ ‘తగ్గేదేలే’!
ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో, తక్షణం కాల్పుల విరమణకు ఒప్పుకోకుంటే భారీగా సుంకాలు బాదుతానంటూ బెదిరించి భారత్, పాక్ నడుమ అణుయుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ కొద్ది నెలలుగా పదేపదే గొప్పలకు పోతుండటం, ఆ వ్యాఖ్యలను మోదీ సర్కారు ఎప్పటికప్పుడు నిర్ద్వంద్వంగా ఖండిస్తూ వస్తుండటం తెలిసిందే. పాక్ పూర్తిగా కాళ్ల బేరానికి వచ్చి, స్వయానా మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి పదేపదే ప్రాధేయపడ్డ కారణంగానే ఆ దేశంతో కా ల్పుల విరమణకు అంగీకరించినట్టు కేంద్రం విస్పష్టంగా ప్రకటించింది కూడా. అలాగే కశ్మీర్ విషయంలో కూడా మధ్యవర్తిత్వానికి ట్రంప్ ఎంతగానో ఉబలాటపడ్డారు. తన సమక్షంలో చర్చలు జరపండంటూ భారత్, పాక్‌కు పదేపదే బాహాటంగా పిలుపులు కూడా ఇచ్చారు. ఈ విషయంలో మూడో శక్తి ప్రమేయాన్ని ఎన్నటికీ, ఏ విధంగానూ అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. అందుకు ఒళ్లు మండి ట్రంప్ సుంకాలు బాదుతున్నా ‘తగ్గేదే లే’దంటోంది.
మన ‘సాగు’పైనా గురి!
వ్యవసాయ రంగంలో అమెరికా జోక్యానికి మోదీ సర్కారు ససేమిరా అంటుండటం ట్రంప్‌కు కొరుకుడు పడని మరో విషయమని జెఫ్రీస్ నివేదిక తేల్చింది. భారత వ్యవసాయ, పాడి మార్కెట్లలో పూర్తిస్థాయిలో కాలు పెట్టాలని అగ్ర రాజ్యం చాలాకాలంగా ఉవ్విళ్లూరుతోంది. ఆ ఆకాంక్షలకు కేంద్రం శాశ్వతంగా తలుపులు మూసేసింది. దీనిపై కూడా ట్రంప్ అగ్గి మీద గుగ్గిలంగా ఉన్నట్టు జెఫ్రీస్ వెల్లడించింది. అమెరికాతో భారత్ స్వేచ్ఛా వాణి జ్య చర్చలు మార్చి నుంచీ నానుతుండటం వెనక ఇది కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు కూడా భావిస్తు న్నారు. ‘‘రైతులు, కూలీలు కలిపి భారత్‌లో 25 కోట్ల మందికి వ్యవసా యమే జీవనాధారం! భారత శ్రామిక శక్తిలో ఇది ఏకంగా దాదాపు 40 శాతం!!’’అని జెఫ్రీస్ నివేదిక చెప్పుకొచ్చింది.
– సాక్షి, నేషనల్ డెస్క్