breaking news
Jeffries
-
ఇగో పెంచిన పగ
రెండోసారి అమెరికా గద్దెనెక్కింది మొదలు, అన్ని దేశాలతోనూ గిల్లికజ్జాలతో తంపులమారిగా, ప్రపంచానికే పెను బెడదగా తయారయ్యారు ట్రంప్. మరీ ముఖ్యంగా భారత్ మీదనైతే మితిమీరిన ప్రతీకార ధోరణి ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్‌తో సంధి కుదిర్చే యత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించిందన్న కోపంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. అందుకోసం ఏకంగా తాను అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని అన్న వాస్తవాన్ని కూడా పక్కన పెట్టారు. అహంకార (ఇగో) ధోరణితో వ్యవహరిస్తున్నారు. అమెరికాకు అతి ముఖ్యమైన మిత్ర రాజ్యాల్లో ఏ దేశంపైనా లేనివిధంగా భారత్‌పై తాజాగా ఏకంగా 50 శాతం సుంకాలు విధించడం వ్యక్తిగత కసి తీర్చుకునే ప్రయత్నాల్లో భాగమే. – అమెరికా ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశానికే చెందిన ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ పలుగురాళ్లతో నలుగు పెట్టింది. భారత్ విషయంలో కొద్ది నెలలుగా ఆయన ప్రదర్శిస్తూ వస్తున్న కురచ బుద్ధిని తీవ్రస్థాయిలో తూర్పారబట్టింది. ‘‘ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్‌తో తలెత్తిన యుద్ధ పరిస్థితులను చల్లబరిచేందుకు మధ్యవర్తిత్వం చేస్తానంటే ససేమిరా అంటూ భారత్ తిరస్కరించడాన్ని ట్రంప్ నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. బతిమాలినా, బెదిరించినా, చివరికి పదేపదే బ్లాక్‌మెయిలింగ్‌కు దిగినా మోదీ సర్కారు దిగి రాలేదని, తనకు అణుమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదని ఆయనలో కడుపుమంట నానాటికీ పెరిగిపో తోంది. ఇరుదేశాల మధ్య చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరించి, తనను తాను శాంతిదూతగా చిత్రించుకుని చిరకాల స్వప్నమైన నోబెల్ శాంతి బహుమానం సాధించాలన్న కలలకు అడ్డంగా గండి కొడుతోందన్న ఆగ్రహం పూర్తిస్థాయిలో కట్టలు తెంచుకుంటోంది. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై భారత్ ఎంత ప్రముఖ దేశంగా వెలిగిపోతోందో తెలిసి కూడా ట్రంప్ ప్రదర్శిస్తున్న ప్రతీకార వైఖరి ఇరుదేశాల నడుమ పూడ్చలేనంతటి అగాధానికి దారి తీస్తోంది. అధ్యక్ష స్థానంలో ఉన్న నాయకుని వ్యక్తిగత ఇగో భారత్, అమెరికా ద్వైపాక్షిక బంధానికే పెను ముప్పుగా పరిణమిస్తోంది’’అంటూ తాజా నివేదికలో నిర్మొహమాటంగా కడిగిపారేసింది.భారత్ ‘తగ్గేదేలే’!ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో, తక్షణం కాల్పుల విరమణకు ఒప్పుకోకుంటే భారీగా సుంకాలు బాదుతానంటూ బెదిరించి భారత్, పాక్ నడుమ అణుయుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ కొద్ది నెలలుగా పదేపదే గొప్పలకు పోతుండటం, ఆ వ్యాఖ్యలను మోదీ సర్కారు ఎప్పటికప్పుడు నిర్ద్వంద్వంగా ఖండిస్తూ వస్తుండటం తెలిసిందే. పాక్ పూర్తిగా కాళ్ల బేరానికి వచ్చి, స్వయానా మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి పదేపదే ప్రాధేయపడ్డ కారణంగానే ఆ దేశంతో కా ల్పుల విరమణకు అంగీకరించినట్టు కేంద్రం విస్పష్టంగా ప్రకటించింది కూడా. అలాగే కశ్మీర్ విషయంలో కూడా మధ్యవర్తిత్వానికి ట్రంప్ ఎంతగానో ఉబలాటపడ్డారు. తన సమక్షంలో చర్చలు జరపండంటూ భారత్, పాక్‌కు పదేపదే బాహాటంగా పిలుపులు కూడా ఇచ్చారు. ఈ విషయంలో మూడో శక్తి ప్రమేయాన్ని ఎన్నటికీ, ఏ విధంగానూ అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. అందుకు ఒళ్లు మండి ట్రంప్ సుంకాలు బాదుతున్నా ‘తగ్గేదే లే’దంటోంది.మన ‘సాగు’పైనా గురి!వ్యవసాయ రంగంలో అమెరికా జోక్యానికి మోదీ సర్కారు ససేమిరా అంటుండటం ట్రంప్‌కు కొరుకుడు పడని మరో విషయమని జెఫ్రీస్ నివేదిక తేల్చింది. భారత వ్యవసాయ, పాడి మార్కెట్లలో పూర్తిస్థాయిలో కాలు పెట్టాలని అగ్ర రాజ్యం చాలాకాలంగా ఉవ్విళ్లూరుతోంది. ఆ ఆకాంక్షలకు కేంద్రం శాశ్వతంగా తలుపులు మూసేసింది. దీనిపై కూడా ట్రంప్ అగ్గి మీద గుగ్గిలంగా ఉన్నట్టు జెఫ్రీస్ వెల్లడించింది. అమెరికాతో భారత్ స్వేచ్ఛా వాణి జ్య చర్చలు మార్చి నుంచీ నానుతుండటం వెనక ఇది కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు కూడా భావిస్తు న్నారు. ‘‘రైతులు, కూలీలు కలిపి భారత్‌లో 25 కోట్ల మందికి వ్యవసా యమే జీవనాధారం! భారత శ్రామిక శక్తిలో ఇది ఏకంగా దాదాపు 40 శాతం!!’’అని జెఫ్రీస్ నివేదిక చెప్పుకొచ్చింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్, చైనా మార్కెట్లపై జెఫ్రీస్ హెడ్ కీలక వ్యాఖ్యలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఇటీవల జీవితకాల గరిష్ఠాలను చేరిన నేపథ్యంలో ప్రస్తుత స్థాయి నుంచి ఒక శాతం మేర నష్టపోయే అవకాశం ఉందని జెఫ్రీస్ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ వుడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా మార్కెట్లు మాత్రం ప్రస్తుత స్థానం నుంచి దాదాపు రెండు శాతం పెరగనున్నాయని అంచనా వేశారు.క్రిస్టోఫర్ తెలిపిన వివరాల ప్రకారం..భారత ఈక్విటీ మార్కెట్లు ఇప్పటికే భారీగా ర్యాలీ అయ్యాయి. దాంతో చాలామంది మదుపర్లు లాభాలు స్వీకరించే అవకాశం ఉంది. అదే చైనాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి మార్కెట్లు ప్రస్తుత స్థానం నుంచి సుమారు రెండు శాతం పెరిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, మలేషియా మార్కెట్లు 50 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చెలరేగుతున్న యుద్ధ వాతావరణం మరింత పెరిగితే భారత్‌తోపాటు దాదాపు అన్ని గ్లోబల్ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతింటాయి.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!దీర్ఘకాల వ్యూహంతో ఈక్విటీలో పెట్టుబడి పెట్టేవారు ప్రతి ప్రతికూల ప్రభావాన్ని ఒక అవకాశంగా తీసుకుని మరిన్ని ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది. మరో పదేళ్లలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పు రానుంది. అన్ని విభాగాలు వృద్ధి చెందనున్నాయి. కాబట్టి మదుపర్లు ట్రేడింగ్ కంటే పెట్టుబడిపై దృష్టి సారించి మంచి రాబడులు పొందాలని చెబుతున్నారు. -
వడ్డీ రేట్లు తగ్గించినా మార్జిన్లు పదిలం
• బ్యాంకులకు మొండి బాకీల కష్టాలూ తగ్గొచ్చు • ఎంసీఎల్ఆర్ కోతపై జెఫ్రీస్ నివేదిక ముంబై: భారీ స్థాయిలో డిపాజిట్లు వెల్లువెత్తిన నేపథ్యంలో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించినా కూడా వాటి మార్జిన్లపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ జెఫ్రీస్ పేర్కొంది. పైగా సమస్యలతో సతమతమవుతున్న కార్పొరేట్లు.. వడ్డీ భారం తగ్గుదల కారణంగా మళ్లీ రుణాలను తిరిగి చెల్లించడం మొదలుపెట్టడం వల్ల బ్యాంకుల మొండి బకాయిల కష్టాలు కూడా కొంత తీరతాయని వివరించింది. ’ఎస్బీఐ సారథ్యంలో బ్యాంకులు 30–90 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్ను తగ్గించినా బ్యాంకుల మార్జిన్లు పెద్దగా తగ్గకపోవచ్చు. స్వల్పకాలికంగా ఒకటి లేదా రెండు త్రైమాసికాల్లో ఈ కోతల ద్వారా నికర వడ్డీ మార్జిన్లపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా స్వల్పంగానే ఉండొచ్చు’ అని జెఫ్రీస్ ఒక నివేదికలో తెలిపింది. రేట్లు గానీ తగ్గితే కార్పొరేట్ల లాభదాయకత కొంత మెరుగుపడటం వల్ల రుణాల తిరిగి చెల్లింపునకు వాటికి కాస్త వెసులుబాటు లభించి, బ్యాంకుల మొండిబకాయిల భారం కాస్తయినా తగ్గగలదని వివరించింది. మొత్తం బ్యాంకు రుణాల్లో 56 శాతం, మొత్తం నికర మొండిబకాయిల్లో 88 శాతం వాటా పెద్దఎత్తున రుణాలు తీసుకున్న సంస్థలదే ఉంది. ఎంసీఎల్ఆర్ అమల్లోకి వచ్చినప్పట్నుంచీ చాలా మటుకు బ్యాంకులు 60–90 బీపీఎస్‌ల మేర శ్రేణిని పాటిస్తున్నందున.. తాజాగా రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు రూపంలో.. చౌక వడ్డీ రేట్ల ప్రయోజనాలను అవి ఖాతాదారులకు బదలాయించే అవకాశం ఉందని జెఫ్రీస్ పేర్కొంది. రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎస్బీఐ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణాల రేటును (ఎంసీఎల్ఆర్) గరిష్టంగా 90 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దాదాపు రూ. 1.65 లక్షల కోట్ల మేర కాసా (కరెంటు అకౌంటు, సేవింగ్స్ అకౌంటు) డిపాజిట్ల సమీకరించిన ఎస్బీఐ .. ఇప్పటికే బేస్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ మొదలైనవి కూడా అదే బాటలో ఎంసీఎల్ఆర్ తగ్గించాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రతికూలం..: నిధుల అవసరాలకు ఎక్కువగా హోల్‌సేల్/బాండ్ల మార్కెట్‌పై ఆధారపడిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు(ఎన్బీఎఫ్సీ) రేట్ల కోత పరిణామం ప్రతికూలమని నివేదిక పేర్కొంది. డీమోనిటైజేషన్ అనంతరం ట్రిపుల్ ఎ రేటింగ్ ఉన్న ఒక్క సంవత్సర వ్యవధి బాండ్లపై రాబడులు 15 బీపీఎస్‌లు మాత్రమే తగ్గగా.. ఏడాది వ్యవధి బ్యాంక్ రుణాల వడ్డీ రేట్లు 60–90 బీపీఎస్ మేర తగ్గడంతో వ్యాపార పరిమాణం ఎన్‌బీఎఫ్‌సీల కన్నా బ్యాంకులవైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉందని వివరించింది.