వడ్డీ రేట్లు తగ్గించినా మార్జిన్లు పదిలం | Credit Suisse Moves to Block Jefferies Bid to Hire Bankers | Sakshi
Sakshi News home page

వడ్డీ రేట్లు తగ్గించినా మార్జిన్లు పదిలం

Jan 5 2017 12:41 AM | Updated on Sep 5 2017 12:24 AM

వడ్డీ రేట్లు తగ్గించినా మార్జిన్లు పదిలం

వడ్డీ రేట్లు తగ్గించినా మార్జిన్లు పదిలం

భారీ స్థాయిలో డిపాజిట్లు వెల్లువెత్తిన నేపథ్యంలో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించినా కూడా వాటి మార్జిన్లపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని...

బ్యాంకులకు మొండి బాకీల కష్టాలూ తగ్గొచ్చు
ఎంసీఎల్‌ఆర్‌ కోతపై జెఫ్రీస్‌ నివేదిక


ముంబై: భారీ స్థాయిలో డిపాజిట్లు వెల్లువెత్తిన నేపథ్యంలో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించినా కూడా వాటి మార్జిన్లపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ జెఫ్రీస్‌ పేర్కొంది. పైగా సమస్యలతో సతమతమవుతున్న కార్పొరేట్లు.. వడ్డీ భారం తగ్గుదల కారణంగా మళ్లీ రుణాలను తిరిగి చెల్లించడం మొదలుపెట్టడం వల్ల బ్యాంకుల మొండి బకాయిల కష్టాలు కూడా కొంత తీరతాయని వివరించింది. ’ఎస్‌బీఐ సారథ్యంలో బ్యాంకులు 30–90 బేసిస్‌ పాయింట్ల మేర ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించినా బ్యాంకుల మార్జిన్లు పెద్దగా తగ్గకపోవచ్చు.

స్వల్పకాలికంగా ఒకటి లేదా రెండు త్రైమాసికాల్లో ఈ కోతల ద్వారా నికర వడ్డీ మార్జిన్లపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా స్వల్పంగానే ఉండొచ్చు’ అని జెఫ్రీస్‌ ఒక నివేదికలో తెలిపింది. రేట్లు గానీ తగ్గితే కార్పొరేట్ల లాభదాయకత కొంత మెరుగుపడటం వల్ల రుణాల తిరిగి చెల్లింపునకు వాటికి కాస్త వెసులుబాటు లభించి, బ్యాంకుల మొండిబకాయిల భారం కాస్తయినా తగ్గగలదని వివరించింది. మొత్తం బ్యాంకు రుణాల్లో 56 శాతం, మొత్తం నికర మొండిబకాయిల్లో 88 శాతం వాటా పెద్దఎత్తున రుణాలు తీసుకున్న సంస్థలదే ఉంది. ఎంసీఎల్‌ఆర్‌ అమల్లోకి వచ్చినప్పట్నుంచీ చాలా మటుకు బ్యాంకులు 60–90 బీపీఎస్‌ల మేర శ్రేణిని పాటిస్తున్నందున.. తాజాగా రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు రూపంలో.. చౌక వడ్డీ రేట్ల ప్రయోజనాలను అవి ఖాతాదారులకు బదలాయించే అవకాశం ఉందని జెఫ్రీస్‌ పేర్కొంది.

రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎస్‌బీఐ తమ మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణాల రేటును (ఎంసీఎల్‌ఆర్‌) గరిష్టంగా 90 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. దాదాపు రూ. 1.65 లక్షల కోట్ల మేర కాసా (కరెంటు అకౌంటు, సేవింగ్స్‌ అకౌంటు) డిపాజిట్ల సమీకరించిన ఎస్‌బీఐ .. ఇప్పటికే బేస్‌ రేటును 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. పీఎన్‌బీ, యూనియన్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ మొదలైనవి కూడా అదే బాటలో ఎంసీఎల్‌ఆర్‌ తగ్గించాయి.

ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రతికూలం..: నిధుల అవసరాలకు ఎక్కువగా హోల్‌సేల్‌/బాండ్ల మార్కెట్‌పై ఆధారపడిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు(ఎన్‌బీఎఫ్‌సీ) రేట్ల కోత పరిణామం ప్రతికూలమని నివేదిక పేర్కొంది. డీమోనిటైజేషన్‌ అనంతరం ట్రిపుల్‌ ఎ రేటింగ్‌ ఉన్న ఒక్క సంవత్సర వ్యవధి బాండ్‌లపై రాబడులు 15 బీపీఎస్‌లు మాత్రమే తగ్గగా.. ఏడాది వ్యవధి బ్యాంక్‌ రుణాల వడ్డీ రేట్లు 60–90 బీపీఎస్‌ మేర తగ్గడంతో వ్యాపార పరిమాణం ఎన్‌బీఎఫ్‌సీల కన్నా బ్యాంకులవైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉందని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement