
సాధారణంగా వాణిజ్య బ్యాంకులు వాటి రుణాలపై సమకూరే వడ్డీ ఆధారంగా మనుగడ సాగిస్తుంటాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల ఫలితంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఒకవేళ అవే రుణాలు నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ)గా అంటే.. వసూలుకాని మొండి బకాయిలుగా మారితే బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్‌ల పేరిట ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎన్‌పీఏలను దీనికి బదిలీ చేస్తారు.
ఆర్‌బీఐ ఇటీవల రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు క్రమంగా వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. దాంతో చాలామంది అప్పు తీసుకోవాలని చూస్తున్నారు. తిరిగి చెల్లించే ఆర్థిక స్థోమత ఉంటేనే అప్పు తీసుకోవాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. లేదంటే అప్పులు ఎన్‌పీఏలు మారితే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో బ్యాడ్ బ్యాంకుల ప్రస్తావన మళ్లీ తెరపైకి వస్తుంది.
ఏమిటి లాభం..
బ్యాడ్ బ్యాంకుల ఏర్పాటు వల్ల ఎన్‌పీఏ ఖాతాల నుంచి రుణాలను రికవరీ చేయడం, రుణాలు తీసుకున్న సంస్థలతో చర్చలు జరపడం, లేదా ఈ మొండి బకాయిలను ఎలా తిరిగి రాబట్టాలో వంటి అంశాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి సారిస్తుంది. ఎన్‌పీఏ ఖాతాలు బ్యాడ్ బ్యాంక్‌కు వెళ్లడంతో వాణిజ్య బ్యాంకుల బ్యాలెన్స్ షీట్‌లో వాటి ప్రస్తావన ఉండదు. ఫలితంగా బ్యాంకు పనితీరు మెరుగుపడుతుంది. బ్యాంకు మూలధనం, డిపాజిట్లు పెరిగి బ్యాంకు అభివృద్ధికి బాటలు పడతాయి.
ఏఆర్‌సీ ఉండగా బ్యాడ్ బ్యాంక్ ఎందుకు?
బ్యాంకులు తమ వద్ద ఉన్న ఎన్‌పీఏలను క్లియర్ చేసుకునేందుకు ‘అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్‌సీ)’లను ఆశ్రయిస్తుంటాయి. ఏఆర్‌సీలు బ్యాంకుల వద్ద చౌకగా ఎన్‌పీఏలను కొని వాటి రికవరీ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అలా బ్యాంకులు ఏఆర్‌సీలకు ఎంతో కొంతకు ఎన్‌పీఏలను అమ్మడం వల్ల నష్టాలను మూటగట్టుకుంటాయి. బ్యాడ్ బ్యాంకు కూడా దాదాపు ఏఆర్‌సీ లాంటిదే. కానీ, బ్యాడ్ బ్యాంక్‌లకు వాణిజ్య బ్యాంకులు ఎన్‌పీఏలను విక్రయించవు. కేవలం బదిలీ మాత్రమే చేస్తాయి. తద్వారా సాధారణ బ్యాంకులు వాటి ప్రధాన కార్యకలాపాలపై దృష్టి సారించే అవకాశం ఏర్పడుతుంది. ఇక బ్యాడ్ బ్యాంకు ఎన్‌పీఏలపై పనిచేసి తిరిగి వాటిని ఎలా రాబట్టాలి... అందుకు ఉన్న వెసులుబాట్లపై దృష్టి సారిస్తుంది. రుణగ్రహీతల చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేసి వీలైనంత మొత్తాన్ని రాబట్టేందుకు కృషి చేస్తాయి.
ఇదీ చదవండి: ఈ అవకాశం మళ్లీ రాదేమో.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
దీని ఏర్పాటుపై ప్రతిపాదనలు
ఎన్‌పీఏల సమస్యను పరిష్కరించేందుకు 2017 ఆర్థిక సర్వే ‘పబ్లిక్ సెక్టార్ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ(పారా)’ను ఏర్పాటు చేయాలని అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రతిపాదించింది. దీనికి ప్రతిరూపమే బ్యాడ్ బ్యాంక్. అప్పటి నుంచి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో పేరుకుపోయిన నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏలు) ప్రభావం బ్యాంకులపై పడకుండా ఉండాలంటే ప్రభుత్వం చాలా బ్యాడ్ బ్యాంకుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది.