ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు ధగధగా మెరిసిపోతున్నాయి. సెప్టెంబర్ చివరికి ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు 880.18 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. గత 12 నెలల్లోనే 25.45 మెట్రిక్ టన్నుల మేర పసిడి నిల్వలను ఆర్‌బీఐ పెంచుకుంది. ఇందులో 575.82 మెట్రిక్ టన్నుల బంగారం దేశీయంగా నిల్వ చేసుకోగా, మిగిలినది విదేశాల్లోని వాల్టుల్లో భద్రపరిచింది.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వద్ద 290.37 టన్నుల బంగారం నిల్వ ఉంది. 13.99 టన్నుల మేర బంగారం డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది. ఆర్‌బీఐ వద్ద విదేశీ మారకం నిల్వల్లో బంగారం వాటా 13.92 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చినాటికి ఇది 11.70 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి ఆరు నెలల కాలంలో 600 కిలోల బంగారాన్ని ఆర్‌బీఐ కొనుగోలు చేసింది.
అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళికపరమైన తీవ్ర అనిశ్చితులు నెలకొన్న తరుణంలో, డాలర్ రిస్క్‌ను తగ్గించుకునేందుకు ఆర్‌బీఐ ఇటీవలి సంవత్సరాల్లో తన విదేశీ మారకం నిల్వల్లో బంగారానికి వెయిటేజీ పెంచుకోవడం గమనార్హం. సెప్టెంబర్ చివరికి మొత్తం విదేశీ మారకం నిల్వలు 700 బిలియన్ డాలర్లకు చేరాయి. సరిగ్గా ఏడాది క్రితం ఇవి 705.78 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు


