నేటి డిజిటల్ యుగంలో పెట్టుబడి లేకుండా, ఇంట్లో కూర్చుని లక్షల్లో సంపాదించే అవకాశాలు గణనీయంగా పెరిగాయి. అయితే వీటికి మీ నైపుణ్యాలు, సమయాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకునే చాలా వ్యాపారాలు సాగుతున్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎలాంటి శ్రమ లేకుండా నిజానికి లక్షల రూపాయలు సంపాదించడం అనేది సాధ్యంకాదు. నిరంతర కృషి, సరైన వ్యూహం, మార్కెటింగ్ సామర్థ్యం, కొత్త ట్రెండ్‌లను ఉపయోగించుకుంటే డబ్బు సంపాదన తేలికవుతుంది. నగదు రూపేణా పెద్దగా పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించడానికి అవకాశం ఉన్న కొన్ని వ్యాపార ఆలోచనలు చూద్దాం.
ఫ్రీలాన్సింగ్ సేవలు
మీకు ఏదైనా ప్రత్యేక నైపుణ్యం ఉంటే దాన్ని సర్వీసుగా మార్చి డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకు కంటెంట్ రైటింగ్ (తెలుగు/ఇంగ్లీష్), గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలప్‌మెంట్, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, డేటా ఎంట్రీ, ట్రాన్స్‌లేషన్ (అనువాదం) వంటి నైపుణ్యాలు ఉన్నాయంటే ఆన్‌లైన్‌లోని Fiverr, Upwork, Freelancer వంటి ప్లాట్‌ఫామ్‌ల్లో మీ సర్వీసులు అందించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. స్థానిక చిన్న వ్యాపారాలు లేదా స్టార్టప్‌ల కోసం డిజిటల్ మార్కెటింగ్ లేదా కంటెంట్ సేవలు అందిస్తూ డబ్బు సమకూర్చుకోవచ్చు.
ఆన్‌లైన్ ట్యూటరింగ్/ కోచింగ్
ఏదైనా అకడమిక్ సబ్జెక్ట్‌లో పరిజ్ఞానం (గణితం, సైన్స్), సంగీతం, యోగా, వంట, ప్రోగ్రామింగ్, భాషా నైపుణ్యాలు ఉంటే డిజిటల్ వేదికగా ఆన్‌లైన్ ట్యూటరింగ్ కోసం చాలా ప్లాట్‌ఫామ్‌లున్నాయి. లేదా సొంతంగా వీడియో కాల్స్ ద్వారా ట్యూషన్ చెప్పవచ్చు.
Udemy, Skillshare వంటి వేదికల్లో ఆన్‌లైన్ కోర్సులను రికార్డ్ చేసి అమ్ముకోవచ్చు. కోర్సు అమ్మకాలు ఎక్కువైతే లక్షల్లో సంపాదన సాధ్యమవుతుంది.
డ్రాప్‌షిప్పింగ్
డ్రాప్‌షిప్పింగ్ అంటే ఉత్పత్తిని ముందే కొనుగోలు చేయకుండా ఆర్డర్ వచ్చిన తర్వాత నేరుగా సరఫరాదారు నుంచి కస్టమర్‌కు పంపే విధానం. ఇందుకోసం ఆన్‌లైన్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై అవగాహన పెంచుకోవాలి. మీరు ఒక ఆన్‌లైన్ స్టోర్‌ను సృష్టించి ఇతర కంపెనీల ఉత్పత్తులను అందులో ఉంచాల్సి ఉంటుంది. కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు ఆ ఆర్డర్‌ను సరఫరాదారుకు పంపితే వారు నేరుగా కస్టమర్‌కు డెలివరీ చేస్తారు. కొనుగోలు ధర, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసాన్ని లాభంగా మీకు వస్తుంది.
అనుబంధ మార్కెటింగ్ (Affiliate Marketing)
సోషల్ మీడియా (YouTube, Instagram..) లేదా వెబ్‌సైట్ ద్వారా భారీ ఫాలోయింగ్/ట్రాఫిక్ ఉంటే ఈ అనుబంధ మార్కెటింగ్‌లో మంచిగానే సంపాదించవచ్చు. ఒక ఉత్పత్తికి సంబంధించిన ప్రత్యేక లింక్‌ను (Affiliate Link) మీ వెబ్‌సైట్‌లో లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఆ లింక్ ద్వారా ఎవరైనా వస్తువులు కొనుగోలు చేస్తే మీకు నిర్దిష్ట శాతం కమీషన్ వస్తుంది.
విజయానికి ముఖ్య అంశాలు
పెట్టుబడి లేకుండా లక్షల్లో సంపాదించడానికి కేవలం ఆలోచన సరిపోదు. ఆన్‌లైన్ వ్యాపారాలలో విజయం సాధించడానికి రోజూ క్రమం తప్పకుండా ఫాలోఅప్ అవసరం. మీ సర్వీసులు లేదా కంటెంట్ ఎక్కువ మందికి చేరడానికి సోషల్ మీడియా మార్కెటింగ్ తప్పనిసరి. మీరు అందించే సర్వీసు నాణ్యతగా ఉంటేనే కస్టమర్‌లు లేదా వీక్షకులు మిమ్మల్ని నమ్ముతారు. ఇంట్లో కూర్చొని పని చేసేటప్పుడు ఏకాగ్రతతో సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ముఖ్యం.
ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సూత్రాలు


