భారత ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) కీలకమని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రుణ వితరణను మరింత బలోపేతం చేయనున్నట్టు చెప్పారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (యూఎల్‌ఐ), అకౌంట్ అగ్రిగేటర్ కార్యాచరణ, శాండ్‌బాక్స్ సదుపాయం, నగదు ప్రవాహాల ఆధారిత (ఆదాయం) రుణ సదుపాయం దిశగా తీసుకున్న చర్యలను గుర్తు చేశారు.
ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణ వితరణపై ఏర్పాటైన స్టాండింగ్ అడ్వైజరీ కమిటీ (ఎస్‌ఏసీ) 30వ సమావేశాన్ని ఉద్దేశించి స్వామినాథన్ మాట్లాడారు. ఫ్లోటింగ్ రేటు (ఎప్పటికప్పుడు మారే) రుణాలను ముందుగా తీర్చివేస్తే చెల్లించాల్సిన చార్జీలను ఎత్తివేసినట్టు చెప్పారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి వెల్లడించాల్సిన సమాచారం విషయంలోనూ నిబంధనలను సడలించినట్టు గుర్తు చేశారు. సామర్థ్యాలను విస్తరించుకోవడం, సంఘటిత ఆర్థిక సంస్థల నుంచి రుణ సాయం పొందే దిశగా సంస్థల్లో నెలకొన్న సమాచార అంతరాన్ని తగ్గించేందుకు ఎంఎస్‌ఎంఈ సంఘాలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఇదీ చదవండి: తీర ప్రాంత వాణిజ్యం, స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంతంటే..


