ఆర్‌బీఐ డీజీ పూనమ్ గుప్తా
ముంబై: స్థిరమైన సంస్కరణలు, ఆర్థిక బలాలతో భారత్ భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్‌గుప్తా అభిప్రాయపడ్డారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడారు. రూపాయి మారకం విలువ అన్నది మార్కెట్ ఆధారితమని పేర్కొన్నారు. ‘‘బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్‌లో వైవిధ్యం మనకున్న బలం.
కరెంట్ ఖాతాలో వస్తు వాణిజ్య లోటును సేవల ఎగుమతులు భర్తీ చేస్తున్నాయి. మొత్తం మీద కరెంట్ ఖాతా బలంగా ఉంది’’అని పూనమ్ గుప్తా పేర్కొన్నారు. కరోనా విపత్తు వంటి సందర్భాలను మినహాయిస్తే మిగిలిన కాలాల్లో భారత్ ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. విధానపరమైన సంస్కరణలతో జీడీపీలో తలసరి ఆదాయ వృద్ధి వేగాన్ని అందుకున్నట్టు తెలిపారు. జీడీపీ వృద్ధి రేటు ప్రపంచంలోనే గరిష్ట స్థాయిలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సమీప కాలానికి సైతం వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నట్టు తెలిపారు.


