
ఏడాదికాలంలో 46% తగ్గుదల
కెనడాపై ఆసక్తి రెండేళ్లలో 75 శాతం పడిపోయింది
ఐడీపీ ఎడ్యుకేషన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: అమెరికా చదువులపై ఏడాది కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి గణనీయంగా తగ్గిపోయింది. ఏడాది కాలంగా అమెరికాలో గురించి వాకబు చేసే వారి సంఖ్య ఏకంగా 46 శాతం తగ్గిపోయిందని, అదే కెనడా విషయానికొస్తే రెండేళ్ల కాలంలో 75 శాతంపైగా ఆసక్తి క్షీణించిందని ప్రముఖ ఐడీపీ ఎడ్యుకేషన్ సంస్థ తెలిపింది. భౌగోళిక రాజకీయాల ప్రభావం కారణంగానే అమెరికా, కెనడా వెళ్లాలని భావించే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని సంస్థ దక్షిణాసియా, లాటిన్ అమెరికా, కెనడా ప్రాంతీయ డైరెక్టర్ పియూష్ కుమార్ తెలిపారు.
‘మారుతున్న భౌగోళిక రాజకీయాల గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా అమెరికా విషయం ప్రస్తావించాలి. ఇక్కడ గడిచిన 12 నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వాస్తవానికి ట్రంప్ అధ్యక్షుడు కాకముందు గతేడాది జూన్ నుంచే అక్కడ అననుకూల వాతావరణం నెలకొంది. అప్పటి నుంచే మంజూరయ్యే వీసాల సంఖ్య తగ్గుతూ వస్తోంది’అని ఆయన విశ్లేషించారు. ‘అమెరికాలో ఎన్నికలు జరిగే సంవత్సరంలో సాధారణంగా వీసాల జారీ సంఖ్య తగ్గుతుండటం మనం గమనించొచ్చు. ఇందుకు రకరకాల కారణాలుంటాయి. కానీ, ట్రంప్ అధ్యక్షుడయ్యాక, ఆయన ఎలాంటి చర్యలను ప్రకటిస్తారనే ఉత్కంఠ కూడా విద్యార్థుల ఆసక్తిపై ప్రభావం చూపింది’అని పియూష్ తెలిపారు.
కెనడాలో ఏం జరిగింది?
2024 మేతో పోలిస్తే 2025 మే నెలకు వచ్చే సరికి అమెరికాలో విద్యావకాశాల గురించి వాకబు చేసే వారి సంఖ్య 46.4 శాతం మేర పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. అదేవిధంగా, కెనడాలో చదువుల గురించి తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య రెండేళ్ల కాలంలో ఏకంగా 70 నుంచి 75 శాతానికి తగ్గినట్లు వెల్లడైందన్నారు. ‘గడిచిన రెండేళ్ల కాలంలో కెనడాలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత ప్రభుత్వం మధ్య విబేధం తలెత్తడం నుంచి ఈ తగ్గుదల ఒరవడి మొదలైంది.
అనంతర కాలంలో కెనడాపై అమెరికా 80 శాతం టారిఫ్‌లను రుద్దడంతో ఎగుమతులు దారుణంగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. ఆ సమయంలో కెనడాకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని అంతా భావించారు. ఎందుకంటే, చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయన్నది వారి అంచనాగా ఉంది. చదువయ్యాక స్వదేశానికి తిరిగిరాక తప్పదని అనుకోవడం వల్లే కెనడాలో చదువులకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదు’అని ఆయన వివరించారు. అయితే, కెనడాలో ప్రస్తుతం అమలవుతున్న విధానాలు 2027 దాకా కొనసాగే అవకాశముంది. ఆ తర్వాత ఆ దేశం తన విధానాలను విద్యార్థులకు అనుకూలంగా మార్చుకుంటే పరిస్థితి మెరుగవుతుందని ఆయన తెలిపారు.
ఆ్రస్టేలియాలో మరిన్ని అవకాశాలు
మరో వైపు, అంతర్జాతీయ విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించే ఆస్ట్రేలియా, యూకేలకు డిమాండ్ యథా ప్రకారం కొనసాగుతోందన్నారు. ఈ రెండుదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో కూడా మార్పు లేదని పియూష్ చెప్పారు. పైపెచ్చు, గత ఏడాది కంటే 9 శాతం ఎక్కువగా విద్యార్థులను చేర్చుకుంటామని ఆ్రస్టేలియా ప్రకటించిందని గుర్తు చేశారు. విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూనే ఒక పద్ధతి ప్రకారం ఆ్రస్టేలియా ముందుకు వెళుతోందన్నారు. ఆ్రస్టేలియా ప్రభుత్వం 1969 ఏర్పాటు చేసిన ఈ సంస్థ అంతర్జాతీయ విద్యార్థులకు సేవలందించడంలో అగ్రస్థానంలో నిలిచింది.
ఆ్రస్టేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, ఐర్లాండ్, అమెరికాల్లో చదవాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీలు, కోర్సుల ఎంపికతోపాటు దరఖాస్తు చేసుకోవడం, వీసా ప్రక్రియ వంటి వాటిలో నిపుణులతో ఉచితంగా సలహాలిప్పిస్తూ సాయపడుతూంటుంది. ఇంగ్లిష్ భాషా ప్రావీణ్య పరీక్ష ఐఈఎల్‌టీఎస్‌ను సైతం ఐడీపీ ఎడ్యుకేషన్ చేపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 మంది యూనివర్సిటీల్లో లక్ష మంది ఐడీపీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ సంస్థకు భారత్‌లోని 63 నగరాల్లో 73 కార్యాలయాలున్నాయి.