
మహాభారతంలో నీతులను నేర్పించే కథలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే అది నిత్యనూతనంగా కనపడుతుంది. అందులో ఒక కథను చూద్దాం. ఏకపాదుడు మహా తపశ్శాలి. గొప్ప విద్వాంసుడు. రాత్రింబవళ్ళు శిష్యుల చేత వేదాధ్యయనం, విద్యాభ్యాసం చేయిస్తుండేవాడు. అతడి భార్య సుజాత గర్భవతిగా ఉన్నపుడు గర్భంలోని శిశువు తండ్రితో, ‘నువ్వు రాత్రింబగళ్ళు విరామం లేకుండా శిష్యుల చేత వేదాధ్యయనం చేయిస్తున్నావు. నిద్ర లేకపోవడం వల్ల, విసుగు చేత వాళ్ళు అధ్యయనం చేసే వేదంలో దోషాలుంటున్నాయి. అలాంటి విద్య నేర్చుకోవడం వల్ల ప్రయోజనమేమిటి?’ అని అన్నాడు.
అప్పుడు ఏకపాదుడు, ‘నువ్వు వేదాధ్యయనంలో దోషాలెన్నడమంటే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించి నట్లుంది. అధిక ప్రసంగం చేసి వేదాన్ని వక్రంగా విమర్శించావు కాబట్టి ‘అష్టావక్రుడవై పుట్టు’ అని శపించాడు. అతడు అలాగే పుట్టాడు. ఆ తర్వాత ఏకపాదుడు జనకమహారాజు ఆస్థానంలో వంది అనే వేదపండితునితో వాదించి, ఓడి, బందీ అయ్యాడు. అష్టావక్రుడు పోయి వందితో వాదించి, ఓడించి తన తండ్రిని విడిపించి ఇంటికి తెచ్చాడు. (పుటలు 296–297–అరణ్యపర్వము–శ్రీమదాంధ్ర మహాభారతము, రామకృష్ణ మఠం).
ఇదీ చదవండి: అశ్వినీ దేవతలు ఎవరు?
నేడు ఎందరో తల్లితండ్రులు, కోచింగ్ సెంటర్ వాండ్లు వాళ్ళ పిల్లలకు, విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలని విరామంలేకుండా వారిని ఉదయం నుంచి రాత్రి వరకు చదివిస్తున్నారు. వారికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నారు. ఆ పిల్లలు మానసిక రోగాలకు శారీరక రోగాలకు గురువుతున్నారు. ర్యాంకుల మాట దేవుడెరుగు. వారు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. అట్టి విద్య వల్ల ప్రయోజనం లేదంటుంది ఈ కథ. ఇక మహా తపశ్శాలి అయిన ఏకపాదుడు కోపానికి గురై కన్న కొడుక్కే శాపమిచ్చాడు. కోపం దుష్పలితాలను ఇస్తుందని హెచ్చరిస్తుంది ఈ కథ. శపించిన తండ్రినే విడిపించుకొని తెచ్చాడు కొడుకు. తల్లితండ్రులపై అలాంటి ప్రేమ సంతానానికి ఉండాలని బోధిస్తుంది ఈ కథ.
– రాచమడుగు శ్రీనివాసులు