మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ | Kurukshetra Season 2 Review Telugu | Sakshi
Sakshi News home page

Kurukshetra 2 Review: 'మహావతార్' నచ్చిందా? ఓటీటీలో ఇది అస్సలు మిస్ అవ్వొద్దు

Oct 26 2025 5:28 PM | Updated on Oct 26 2025 6:06 PM

Kurukshetra Season 2 Review Telugu

ఇప్పటి జనరేషన్‌లో ఎంతమందికి 'మహాభారతం' గురించి తెలుసు? కచ్చితంగా చాలామందికి తెలిసి ఉండదు. ఎందుకంటే రీసెంట్ టైంలో దీని ఆధారంగా వచ్చిన సినిమాలు పెద్దగా లేవని చెప్పొచ్చు. ప్రభాస్ 'కల్కి'లో కర్ణుడు, అశ్వద్ధామ పాత్రల్నిచూపించినా సరే మహాభారతంని పెద్దగా టచ్ చేయలేదు. అలాంటిది మహాభారతంలో జరిగిన యుద్దం ఆధారంగా 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ సిరీస్ తీశారు. అక్టోబరు 10న తొమ్మిది ఎపిసోడ్స్‌తో తొలి సీజన్ రిలీజ్ కాగా ఇప్పుడు మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్‌ని రెండో సీజన్‌గా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఇది ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా అనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్)

కథేంటి?
'కురుక్షేత్ర' సంగ్రామంలో కౌరవ పక్షానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్న ద్రోణుడిని పాండవులు సంహరించడంతో తొలి సీజన్ ముగించారు. అక్కడి నుంచే రెండో సీజన్ మొదలైంది. మరి కౌరవుల కొత్త సైన్యాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కౌరవులు పక్షాన ఉన్న ధుర్యోధనుడు, కర్ణుడు, అశ్వద్ధామ, దుశ్శాసన.. పాండవుల పక్షాన ఉన్న అర్జునుడు, ధర్మరాజు, భీముడు తదితరుల మధ్య ఎలాంటి భీకర పోరాటం జరిగింది? అసలు ఈ కురుక్షేత్రం ఎలా మొదలైంది? ఎలా అంతమైంది? శ్రీకృష్ణుడు బోధించిన ధర్మ మార్గం, కర్మ ఫలితం ఏంటి? యుద్ధం ముగిసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధాన్ని.. ఈ సిరీస్ మేకర్స్ 18 ఎపిసోడ్స్‌గా తీశారు. తొలుత తొమ్మిది ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతిదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తొలి సీజన్‌లో దాదాపు 15 రోజుల పాటు సాగిన యుద్ధాన్ని చూపించేశారు. రెండో సీజన్‌లో ఏం చూపిస్తారా అనే సందేహం వచ్చింది. కానీ మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్‌లో ఓవైపు యాక్షన్ చూపిస్తూనే మరోవైపు డ్రామాని కూడా అద్భుతంగా ఆవిష్కరించారు.

కుంతి, కర్ణుడు, దుశ్శాసన, భీమ, అశ్వత్థామ, దుర్యోధన.. ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో ఎపిసోడ్ డిజైన్ చేశారు. అసలు వీళ్లు ఎవరు? ఈ యుద్ధంలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది? 'కురుక్షేత్ర'లో వీళ్ల పాత్ర ఏంటి? అనేది చక్కగా చూపించారు. పేరుకే యానిమేటెట్ సిరీస్ గానీ చూస్తున్నంతసేపు మహాభారతం కళ్లముందు కనిపిస్తుంది. నేరుగా యుద్ధాన్ని చూపించేసి సిరీస్ ముగించేస్తే పెద్దగా డ్రామా పండదు. 16వ ఎపిసోడ్‌లోనే యుద్ధం పూర్తయిపోతుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో యుద్ధం తర్వాత పరిస్థితుల్ని ఆకట్టుకునేలా చూపించారు. 'స్త్రీ పర్వ' ఎపిసోడ్, అందులో వచ్చే డ్రామా, డైలాగ్స్ బాగుంటాయి. చివరి ఎపిసోడ్‌లో శ్రీ కృష్ణుడి పాత్రపై వచ్చే విజువల్స్.. సగటు సినీ ప్రేక్షకుడికి మంచి కిక్ ఇస్తాయి.

ఇదివరకే మహాభారతం చూసినవాళ్లకు, తెలిసినవాళ్లకు ఈ సిరీస్ ఓకే అనిపించొచ్చు. కానీ మహాభారతం, కురుక్షేత్రం గురించి ఏ మాత్రం తెలియనవాళ్లకు మాత్రం బోలెడంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకంటే కృష్ణుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, కర్ణుడు, అశ్వత్థామ, దృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి, ద్రౌపతి, దుర్యోధనుడు, దుశ్శానస.. ఇలా లెక్కలేనన్ని పాత్రలు ఉన్నాసరే అన్నింటి మధ్య కనెక్షన్స్, ఆయా విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి.

రీసెంట్ టైంలో 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ సినిమా.. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. ఒకవేళ ఈ మూవీ గనక నచ్చితే 'కురుక్షేత్ర' సిరీస్‌ని అస్సలు మిస్ చేయొద్దు. పేరుకే 18 ఎపిసోడ్స్ గానీ ఒక్కొక్కటి 25-30 నిమిషాల నిడివితోనే ఉంటాయి. ఇలా మొదలుపెడితే అలా పూర్తయిపోతాయి. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. వీలైతే పిల్లలకు కూడా చూపిస్తే 'మహాభారతం' గురించి వాళ్లకు కూడా బోలెడంత జ్ఞానం వస్తుంది.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement