ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్ | The Lost Bus Movie Telugu Review | Sakshi
Sakshi News home page

The Lost Bus Review: ఇది అసలైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్.. ఓటీటీ రివ్యూ

Oct 15 2025 11:58 AM | Updated on Oct 15 2025 12:12 PM

The Lost Bus Movie Telugu Review

కల్పిత కథలతో సినిమాలు తీయడం సులభమే. కానీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా మూవీస్ తీసి హిట్ కొట్టడం చాలా కష్టం. కొన్నిసార్లు మాత్రం ఇలా తీసి బ్లాక్ బస్టర్ కొడుతుంటారు లేదంటే చూసే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంటారు. ఈ మధ్య అలా వచ్చిన 'ద లాస్ట్ బస్' అనే చిత్రం మూవీ లవర్స్‌కి మంచి అనుభూతి ఇస్తూ తెగ నచ్చేస్తోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్)

కథేంటి?
అది 2018. అమెరికాలోని కాలిఫోర్నియా. కెవిన్ (మాథ్యూ మెక్ కొనాగే) స్కూల్ బస్ డ్రైవర్‌. ఇతడికి నడవలేని స్థితిలో ఉండే తల్లి, టీనేజ్ కొడుకు ఉంటారు. ఓ రోజు డ్యూటీలో భాగంగా పిల్లల్ని స్కూల్‌లో దింపేసి కెవిన్.. ఇంటికి తిరిగొచ్చే దారిలో ఉంటాడు. అప్పుడే ఆ ప్రాంతమంతా కార్చిచ్చు అంటుకుంటుంది. దీంతో స్కూల్‌లో ఉన్న 22 మంది పిల్లల్ని మరోచోటకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కెవిన్‪‌పై పడుతుంది. ఓవైపు ఊళ్లకు ఊళ్లు తగలబడిపోతుంటాయి. మరోవైపు కెవిన్.. ఈ పిల్లలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాలి? మరి కెవిన్ ఏం చేశాడు? చివరకు పిల్లలతో పాటు బతికి బయటపడ్డాడా లేదా అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఈ సినిమాని నిజంగా జరిగిన సంఘటనల స్ఫూర్తితో తీశారు. 2018లో కాలిఫోర్నియాలో కార్చిచ్చులో 85 మంది చనిపోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఊళ్లకు ఊళ్లు బూడిదయ్యాయి. ఇదంతా జరుగుతున్న సమయంలోనే కెవిన్ అనే సాధారణ స్కూల్ బస్ డ్రైవర్.. ఊళ్లని తగలబెట్టేసే మంటల్ని దాటుకుని 22 మంది పిల్లల్ని సాహసోపేతంగా ఎలా కాపాడాడనేదే 'ద లాస్ట్ బస్' మూవీ.

పేరుకే ఇది సినిమా. కానీ చూస్తున్నప్పుడు ఏ మాత్రం అలా అనిపించదు. చాలా రియలస్టిక్‌గా ఉంటుంది. మనం కూడా ఆ బస్సులోనే ఉన్నామా అని ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఈ రేంజు విజువల్స్, గ్రాఫిక్స్ ఎలా తీశార్రా అని కచ్చితంగా సందేహం వస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క సీన్ కూడా గ్రాఫిక్స్‌లా అనిపించదు. ఫస్టాప్ చూస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది గానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి సర్వైవల్ థ్రిల్లర్ జానర్‌లోకి వస్తుంది. తర్వాత ఏమవుతుందా అనే టెన్షన్ మనల్ని కుదురుగా కూర్చోనివ్వదు.

ఏదైనా ఆపద వచ్చినప్పుడు 'ప్రెజెన్స్ ఆఫ్ మైండ్' అనేది చాలా కీలకం. ఇందులో బస్ డ్రైవర్ కెవిన్ ఆలోచన విధానం చూస్తే అదే గుర్తొస్తుంది. తొందరపడటం కంటే కొన్నిసార్లు ఏం చేయకుండా అలా ఉండటం కూడా ఒకందుకు మంచిదే అనేలా ఓ సీన్ ఉంటుంది. కానీ కార్చిచ్చు వీళ్ల దగ్గరకు కూడా వచ్చేసరికి మంటల్లోని బస్ పోనిచ్చే సీన్ అయితే ప్రీ క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చివరకొచ్చేసరికి హ్యాపీ ఎండింగ్‌తోనే ముగించడం సంతోషం.

సినిమాలో కనిపించిన నటీనటులు ఎవరూ మనకు తెలియదు. కానీ వాళ్లతో పాటు మనం కూడా ట్రావెల్ అవుతాం. అయితే సినిమాలో ఎమోషన్స్, డ్రామా లాంటివి ఇంకా పెట్టొచ్చు కానీ దర్శకుడు ఆ పనిచేయలేదు. అది మాత్రం కాస్త వెలితిగా అనిపిస్తుంది. సెప్టెంబరు 19న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. అక్టోబరు 03 నుంచి ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లీష్‌లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబంతోనూ చూడొచ్చు. ఒకవేళ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ చేయొద్దు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement