
ఏడాదిలో కచ్చితంగా మూడు నాలుగు సినిమాలైన తీసే విజయ్ ఆంటోనీ.. ఈ ఏడాది ఇప్పటికే 'మార్గన్' అనే మూవీతో వచ్చాడు. థియేటర్లలో ఆడనప్పటికీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. గత నెలలో 'భద్రకాళి' అనే డబ్బింగ్ బొమ్మతో వచ్చాడు. థియేటర్లలో దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది.
(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)
స్వతహాగా సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోనీ.. 'బిచ్చగాడు'తో హిట్ కొట్టి తమిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత చాలా సినిమాలు తీస్తున్నాడు గానీ వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు అరుణ్ ప్రభు దర్శకత్వంలో 'భద్రకాళి' అనే పొలిటికల్ థ్రిల్లర్ చేశాడు. ఇందులో హీరోగా నటించడంతో పాటు సంగీతం, నిర్మాణం కూడా విజయ్ ఆంటోనీదే. సెప్టెంబరు 5న ఈ చిత్రం థియేటర్లలోకి రాగా.. వచ్చే శుక్రవారం(అక్టోబరు 24) నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.
'భద్రకాళి' విషయానికొస్తే.. కిట్టు (విజయ్ ఆంటోనీ) సెక్రటేరియట్‌లో ఓ పవర్ బ్రోకర్. ప్రభుత్వంలోని ఎలాంటి పని అయినా సరే చిటికలే చేసి పెడుతుంటాడు. అలా ఓసారి కేంద్ర మంత్రి లతకు సంబంధించిన రూ.800 కోట్ల భూముల వ్యవహారంలో వేలు పెడతాడు. అంతా సవ్యంగానే జరిగినా చివరలో ఓ ఎమ్మెల్యే హత్య జరగడం, దాని వల్ల లతకు రాజకీయంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఏం జరిగిందా అని ఆరా తీయగా.. కిట్టు గురించి, అతడు వెనకేసిన రూ.6,200 కోట్ల గురించి తెలుస్తుంది. అసలు కిట్టు ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)
