
వివేకి లోక విషయాల్లోని దోషాన్ని గ్రహిస్తాడు. అలౌకికాన్ని ఆరాధిస్తాడు. అవివేకి అజ్ఞానంతో లౌకిక విషయాసక్తుడై అలౌకిక సత్యాన్ని ఆలోచించలేడు. పైగా లౌకిక విషయ సుఖమే సత్యంగా భావించి దాన్ని అనుభవిస్తూండటం వివేకమనుకుంటాడు. అటువంటి వారు అతితెలివితో భ్రాంతచిత్తులయి తమాషాగా ప్రవర్తిస్తారు. అలాంటి కథ ఇది:
మిక్కిలి తెలివి గల ఒక రాజు ఉన్నాడు. మనిషి మంచివాడే. కాక పోతే కొంచెం వక్రంగా ఆలోచిస్తాడు. అందుకే అందరికంటే వివేక హీనుడెవడో చూచి వాడికి సన్మానం చేయాలనుకుంటాడు. అటువంటివాడిని తీసుకురమ్మని సేవకులను రాజ్యం నలుమూలలకూ పంపాడు. అతి కష్టం మీద రాజసేవకులు ఏ పనీ చేయని, ఎవరి తోనూ మాట్లాడని, చింపిరి గుడ్డలు కట్టుకొని ఆకులు అలములుతింటూ తిరుగాడేవాడిని తీసుకొస్తారు. రాజు కూడా అవివేకి ఇతడే అని సంతోషించి సన్మానంలో ఒక వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని అతనికి బహూకరించాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ రాజుకు తీవ్రమైన రోగం వచ్చింది. ఎవరూ వైద్యం చేయలేమని చేతులెత్తేసిన సమయంలో అవి వేకిగా సన్మానితుడైన మనిషి వచ్చి రాజు రోగాన్ని నయం చేస్తానన్నాడు.
చదవండి: Ashtavakra అష్టావక్ర సందేశం
అయితే వైద్యం ప్రారంభించే ముందు... ‘ఓ రాజా! మీరింతవరకూ సుఖాలెన్నో అనుభవిస్తూ వచ్చారు. మరి మీరు చనిపోతే మీ శరీరం ఈ సుఖభోగాల ననుభవించలేదు కదా! అందువల్ల మర ణించే ముందైనా, ఇప్పటినుంచే ఆ భోగాలన్నింటినీ వదిలిపెట్టి ఉండగలరా చెప్పండి?’ అన్నాడు. ‘ఇంతవరకు అలవాటు పడిన ఈ భోగాలను వదలి ఉండలేను’ అని సమాధానం చెప్పాడు రాజు.
‘రాజా! నేను ఆకులలములు తింటూ ఏవో గుడ్డ పీలికలు కట్టుకొని, కటిక నేలపై పడుకొంటూ ఇప్పటికీ సుఖంగానే ఉన్నాను. మరి నాకు కష్టం, సుఖం వేరుగా కనబడలేదు. నాకెంతో తృప్తిగా ఉంది. కానీ మీరు, ప్రాణాంతకమైన రోగం వచ్చినా రక్షించలేని ఈ సుఖాలను, కొంతకాలమైనా వదిలి పెట్టలేకపోతున్నారు. అన్నీ ఉన్నా మీకు తృప్తిలేదు. విషయ సుఖలాలసత ఇంకా కోరుతున్న మీరు, సిసలైన అవివేకులు. కనుక మీరు నాకిచ్చిన వజ్రపుటుంగరం తిరిగి మీకే ఇస్తున్నాను తీసుకోండి’ అని ఉంగరం ఇస్తూ తన యోగదృష్టి పాతంతోనే రాజుకు పరిపూర్ణమైన ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించాడాయన.
చదవండి: అశ్వినీ దేవతలు ఎవరు?
ఆయన ఎవరో కాదు. సర్వసిద్ధులూ కలిగిన ’అవధూత’. ‘విరతి రాత్మరతి శ్చేతి వివేకస్య పరమం లక్షణమ్’. విషయసుఖాలపై వైరాగ్యముండటం, సర్వదా ఆత్మానుసంధానంతో ఉండటమూ వివేకానికి లక్షణమని అర్థం. అవధూత స్థితి ఇలాంటిది. కనుక గురూపదేశంతో ప్రతి ఒక్కరూ సుఖదుఃఖ సమభావన సాధించాలి.
-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి