
పిల్లలూ! ‘గొంగడి’ గురించి మీకు తెలుసా? మీ ఇంట్లో గొంగడి ఉందా? ఒకప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లల్లో గొంగడి ఉండేది. వ్యవసాయ, పాడి ఆధారిత కుటుంబాల్లో తప్పకుండా కనిపించే వస్తువు ఇది. ప్రస్తుతం పట్టణాల్లో దీని వాడకం తగ్గినా పల్లెల్లో ఇంకా వాడుతున్నారు.
ముఖ్యంగా పశువుల కాపర్లు జీవాలను మేతకు తీసుకువెళ్లే సమయంలో గొంగడిని తమ వెంట తీసుకువెళ్తుంటారు. భారతదేశానికి వస్త్ర పరిశ్రమ రంగంలో గొంగడికి కీలకమైన స్థానం ఉంది. గొంగడి అనేది ఉన్నితో తయారు చేసిన దుప్పటి. మరాఠీలో దీన్ని ‘ఘొంగడి’ అంటారు. దీన్ని చేత్తో తయారు చేస్తారు. దీనికి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు, సాంస్కృతిక విలువలు ఉన్నాయి. గతంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో వివాహ ప్రతిపాదనలు ఏర్పాటు చేసేటప్పుడు గొంగడిని వినియోగించేవారు.ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూర్చోడానికి, విశ్రమించడానికి దీన్ని వాడేవారు. ఎండ, వాన, చలి నుంచి రక్షణగా నిలిచేందుకు ఇదెంతో సౌకర్యవంతంగా ఉంటుంది. వర్షంలో ఈ గొంగడి కప్పుకుంటే గొంగడి తడిసిపోయినా లోపలున్నవారికి ఆ తడి తగలదు. అది గొంగడి విశిష్టత.

చదవండి: కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనె
మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో అతిథులను స్వాగతించడానికి నేటికీ ఈ గొంగడిని ఉపయోగిస్తారు. అతిథుల్ని గొంగడిపై కూర్చోబెట్టడం గౌరవప్రదంగా భావిస్తారు. జూన్–ఆగస్టు నెలల మధ్య గొంగడి తయారీ ప్రారంభమవుతుంది. ఈ నెలల్లో గొర్రెల నుండి ఉన్నిని తీస్తారు. దాన్ని రంగుల ఆధారంగా వేరు చేస్తారు. సాధారణంగా ఉన్ని నలుపు, తెలుపు, గోధుమ రంగులలో ఉంటుంది. ఇందులో తెల్ల రంగు గొంగడి చాలా అరుదుగా కనిపిస్తుంది. 8 అడుగుల గొంగడిని తయారు చేయడానికి 350 గజాల ఉన్ని అవసరం. 10, 12 అడుగుల గొంగడికి 400, 450 గజాల ఉన్ని అవసరం అవుతుంది. చేతి మగ్గంపై ఒక గొంగడిని నేయడానికి ఎనిమిది నుండి పది గంటల సమయం పడుతుంది. నేయడం పూర్తయ్యాక దుప్పటికి చింతపండు గింజల రసం పూసి, రెండు నుండి మూడు రోజులు ఎండలో ఉంచుతారు. ఆ తర్వాత గొంగడి వినియోగానికి సిద్ధమైనట్లే.
చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!