కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం... ఈ అయిదు లింగాలను పంచ భూత మహాలింగాలు అని అంటారు. ఈ అయిదు క్షేత్రాలను ఒకేసారి దర్శించుకోవటం మంచిదని చాలా మంది అలా దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో నాలుగు తమిళనాడులో, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలోనే ఈ ఆలయాలు ఉండటం గమనించదగిన విషయం. వరుసక్రమంలోనే కాకుండా దూరం రీత్యా కూడా అరుణాచలం మధ్యలో నిలుస్తుంది.
పంచభూత మహాలింగాల్లో మూడవది అరుణాచలం క్షేత్రం. దీనినే తమిళనాడులో తిరువణ్ణామలై క్షేత్రంగా కూడా పిలుస్తారు. స్వామి వారు అరుణాచలేశ్వరుడు కాగా అమ్మవారు అపిత కుచలాంబా దేవి. సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని స్వామివారే చె΄్పారట.
అద్భుత శిల్పకళతో అలరారే ఈ ఆలయాన్ని సాక్షాత్తూ దేవశిల్పి విశ్వకర్మ నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. చోళరాజులు పల్లవులు, విజయనగర సార్వభౌములు ఇక్కడ ఆలయాలను ఎంతగానో అభివృద్ధి పరిచారు. ఇరవై అయిదు ఎకరాల్లో నిర్మిత మైన ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది. నాలుగు దిక్కుల్లో ఎత్తయిన గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం పదకొండు అంతస్తుల్లో అలరారుతుంది. ఆరు ప్రాకారాలతో, ఎన్నో ఉపాలయాలతో, విశాలమైన ప్రాంగణంతో ఉండే ఈ ఆలయానికి నిత్యం దేశమంతటి నుంచి భక్తులు వస్తూ ఉంటారు.
ఇక్కడి వెయ్యి స్తంభాల మండపానికి సమీపంలో శివ గంగ తీర్థం ఉంది. అక్కడే రమణ మహర్షి తన ఐహిక బంధాల నుంచి విముక్తి పొందారు. అరుణాచలం క్షేత్రం అంటే రమణ మహర్షిని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఆయన్ని సుబ్రహ్మణ్యస్వామి మరో అవతారంగా భక్తులు చెబుతారు. ఇక్కడ దేవాలయానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో అరుణగిరి (పర్వతం) కు కూడా అంతే ప్రాధాన్యం ఉన్నది.
’అ–రుణాచలం’ అనే పదానికి ఐహిక బంధాలను తొలగించే పర్వతం అని అర్థం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపమైన ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే జీవితం పరిపూర్ణమవుతుందని నమ్మకం. ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్ని లింగమని, అందుకే ఆలయంలో వేడిగా వుంటుందని అంటారు.
ఆలయ విశేషాలు
తిరువణ్ణామలైలోని అణ్ణామలయ్యార్ (శివుడు) ఆలయం 24 ఎకరాల స్ధలంలో విస్తరించి వుంది. నాలుగు వైపులా నాలుగు ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు, శిల్ప, నిర్మాణ శాస్త్రాలపరంగా అపురూపమైనది. ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు వున్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వసారాలు, ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి.
ఈ గోపురాలలో తూర్పువైపున వున్నదానిని రాజ గోపురమంటారు. ఇదే ప్రధాన ద్వారం. నేలమట్టంమీద 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల పొడవు కలిగి, దీర్ఘచతురస్రాకారంలో వున్న ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి. ఇక్కడ తంజావూరు బహదీశ్వరాలయానికన్నా ఎత్తయిన గోపురం నిర్మించాలని, దానికన్నా ఒక అడుగు ఎత్తుగా, అంటే 217 అడుగుల ఎత్తయిన గోపురాన్ని నిర్మించారు.
బయటి ప్రాకారానికి వున్న మిగతా మూడు గోపురాలను అమ్మణి అమ్మాళ్ గోపురం, తిరుమంజరం గోపురం, పేయి గోపురం అంటారు. ఇవి 171, 157, 144 అడుగుల ఎత్తులో వున్నాయి. 70 అడుగుల ఎత్తులో వున్న మిగిలిన గోపురాలు లోపల ప్రాకారాలకు వున్నాయి.
ఎలా వెళ్ళాలంటే..?
కాట్పాడి, చెన్నై మొదలగు తమిళనాడులోని అనేక ప్రదేశాలనుంచేగాక చిత్తూరు, తిరుపతి నుంచికూడా బస్సులున్నాయి. చెన్నై నుంచి 185 కి.మి. దూరంలో ఉంది. చెన్నై నుంచి బస్సు, ట్రైన్ సౌకర్యం ఉంది. చెన్నై లోని కోయంబేడు (సి.యమ్.బి.టి.) బస్సు స్టాండ్ నుంచి అరుణాచలం చేరటానికి 4–5 గంటల సమయం పడుతుంది.
గిరి ప్రదక్షిణ
ఇక్కడ గిరి ప్రదక్షిణ విశేషం. అరుణాచలం అర్ధనారీశ్వర రూపమని, దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 కి.మీ.ల దూరం ఉండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు, ఇరు ప్రక్కలా ఎత్తయిన వృక్షాలతో సుందరంగా ఉంటుంది. దోవలో అష్టదిక్పాలకుల పేర్లతో ఎనిమిది శివాలయాలు, దుర్గాదేవి, ఆంజనేయస్వామి, ఆది అణ్ణామలై వగైరా అనేక ఆలయాలేగాక, సుప్రసిద్ధ రమణ మహర్షి, శేషాద్రి మహర్షి వంటివార్ల ఆశ్రమాలుకూడా దర్శనీయాలు.
భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారంటే పాదరక్షలు వేసుకోరు. రోడ్డుకి ఎడమవైపే నడుస్తారు. ఇప్పటికీ అనేకమంది సిద్ధపురుషులూ, యోగి పుంగవులూ అదృశ్యరూపం లో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని, రోడ్డుకి కుడివైపు వెళ్తే వారికడ్డవుతామని వారి నమ్మకం. ఎన్నో అద్భుతమైన విశేషాలుగల ఈ ఆలయాన్ని దర్శించినవారందరూ తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు. ఇంత అద్భుతమైన ఈ ఆలయం విల్లుపురం – కాట్పాడి రైలు మార్గంలో, చెన్నైకి సుమారు 180 కి.మీ.ల దూరంలో వుంది.


