కాశీ లేదా బనారస్‌గా పిలిచే వారణాసిని మోక్ష నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కాశీ, వారణాసి రెండు వేర్వేరు కాదు. వారణాసినే కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రవహించే గంగానది ఒడ్డునే జీవన్మరణాలు కలిసే పవిత్ర స్థలం ఉంది. అదే అత్యంత ప్రసిద్ధిగాంచిన మణికర్ణిక ఘాట్. ఇక్కడే శవాలను దహనం చేసేది. ఇది హరిశ్చంద్రుల కాలం నుంచే నిరంతరం మండుతూనే ఉన్నట్లు చెబుతుంటారు. అంతేగాదు దీన్ని ప్రపంచంలోని అత్యంత మర్మమైన దహన సంస్కార ప్రదేశాల్లో ఒకటిగా పేర్కొంటారు. అయితే ఇక్కడ అంత్యక్రియల అనంతరం జరిగే ఒక తంతు సోషల్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. అక్కడ చితి చల్లారక ప్రజలు బూడిదపై 94 సంఖ్యను రాస్తారట. అలా ఎందుకు రాస్తారు..దానిలో దాగున్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
ఇక్కడ వారణాసిలో ఎన్నో ఇతర ఘాట్‌లు ఉన్నా.. ఈ మర్ణికఘాట్‌కే అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీన్ని పరమ పవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారు. ముందుగా ఈ ప్రదేశానికే ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం..
మర్ణికఘాట్‌కి ఆ పేరు ఎలా వచ్చిందంటే..
హిందూ పురాణాల ప్రకారం సతీదేవి చెవి ఆభరణం(కర్ణ కుండలం) పడిపోయిన ప్రదేశం కాబట్టి ఈ ఘాట్‌కి మణికర్ణిక అనే పేరు వచ్చింది. అలాగే మరో పురాణ కథనం ప్రకారం శివుడు సుదీర్ఘ ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడూ..విష్ణువు తన సుదర్శన చక్రంతో ఇక్కడ పవిత్ర చెరువుని సృష్టించాడని, ఆ చెరువులో శివుడు స్నానం చేసి వచ్చినప్పుడూ అతని చెవిపోగు((మణికర్ణిక) జారిపడి అదృశ్యమైందని అందుకే ఈ ప్రదేశానికి మణికర్ణిక ఘాట్ అని పిలుస్తారని చెబుతుంటారు.
అంతేగాదు దీన్ని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అగ్నిజ్వాలలు నిరంతరం ఎగిసిపడుతూనే ఉంటాయట. పగలు, రాత్రి అనునిత్యం అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయట. ఇది విముక్తిని ప్రసాదించే ప్రవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారట.
బూడిదపై 94 రాయడానికి కారణం..
ఈ మణికర్ణిక ఘాట్‌లో అంత్యక్రియలు చేసిన వ్యక్తి..అంటే ఆ కార్యక్రమం జరిపే కుటుంబ సభ్యుడు అగ్ని చల్లారక బూడిదపై 94 అనే సంఖ్యను రాస్తారట. ఈ చర్య అక్కడ స్థానిక సంప్రదాయంలో భాగమట. ఈ సంఖ్య మరణించిన వ్యక్తి ఆత్మ విముక్తి కోరికను సూచిస్తుందట.
మోక్ష మంత్రంగా '94'
ఈ సంఖ్యను అక్కడ స్థానికులు ముక్తి మంత్రంగా పిలుస్తారట. ఆ సంఖ్యను వ్రాసిన తర్వాత అతడికోసం దుఃఖిస్తున్న కుటుంబ సభ్యుడు ఆత్మను స్వర్గం వైపు నడిపించమని శివుడిని ప్రార్థిస్తాడట. తర్వాత చితిపై నీటి కుండను పగలు కొడతాడు. ఇది అంత్యక్రియల ఆచారం ముగింపుని సూచిస్తుంది.
ఈ సంఖ్యలో దాగున్న ఆధ్యాత్మిక రహస్యం..
హిందూ శాస్త్రాల ప్రకారం మానవుడి జీవితాన్ని 100 కర్మలు నడిపిస్తాయట. వాటిలో 94మనిషి చేతుల్లో ఉన్న కర్మలు. మిగిలిన ఆరు మాత్రం దైవాధీనంలో ఉంటాయి. జీవితం, మరణం, లాభం, నష్టం, కీర్తి, అపకీర్తి అనే ఆరు కర్మలు బ్రహ్మచే ముందే నిర్ణయించబడినవి, పైగా మానవ నియంత్రణకు మించినవట.

మిగిలిన 94మనిషి చేతితో నిర్మించిన మార్గాలగా చెబుతారు. అంటే మనిషి ఆలోచనలు, చర్యలు, ధర్మం, పాపం లాంటి ఈ 94 సంఖ్యల్లో ఉంటాయి. మణికర్ణిక ఘాట్‌లో దహనమవుతున్నప్పుడు ఆ కర్మలు అగ్నిలో కరిగిపోతాయని, మిగిలేది దేవుని నిర్ణయమని నమ్మకం. అందుకే ఆ సంఖ్యను రాయడం అనేది దివ్య సమర్పణతో పాటు జీవన సమీకరణం కూడా అని స్థానిక పండితులు చెబుతున్నారు.
అందువల్లే చితి చల్లారక బూడిదపై 94 అనే సంఖ్యను రాసి.. ఈ మానవ లక్షణాలకు పునర్జన్మ చక్రం నుంచి విముక్తి కోరూతూ..శివుడిని ప్రార్థిస్తారట. ఈ ఆచారం కేవలం మణికర్ణిక ఘాట్‌లోని దహన సంస్కాల వద్ద మాత్రమే అనుసరిస్తారట. దీని గురించి ఏ హిందూ గ్రంథంలోనూ ప్రస్తావించలేదట. అక్కడ స్థానికుల నుంచి పరంపరగా సాగుతన్న సంప్రదాయమట. అంతేగాదు. ఈ సంఖ్య'94' రాయడం అనేది మోక్షానికి ప్రతీకాత్మక అభ్యర్థన అని భక్తుల ప్రగాఢ విశ్వాసం, నమ్మకం కూడా.
(చదవండి: Chithira Thirunal Balarama Varma: 'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!)


