485... దేశంలో ఒకే ఒక్క రోజులో రోడ్ యాక్సిడెంట్స్‌లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇది. ఇంకోలా చెప్పాలంటే రోజుకు ఒక కాలేజీలోని విద్యార్థులు లేకుండా పోతున్నారు. ఏటికేడాదీ పెరిగిపోతున్న ఈ ప్రాణనష్టాన్ని కొత్త ఏడాదిలోనైనా తగ్గించాలని కంకణం కట్టుకుంది సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్. అందుకే 2026లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా యువతకు ఓ పోటీ పెడుతోంది. ఈ సమస్యకు వినూత్న, వెంటనే వాడగల పరిష్కారాలను చూపించాలని డిగ్రీ విద్యార్థులకు పిలుపునిచ్చింది. ఉత్తినే కాదు లెండి... మీరు సూచించిన పరిష్కారం ఎంపికైతే రూ.2.5 లక్షల బహుమానం కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీ క్రియేటివ్ మైండ్‌కు పదునుపెట్టండి.. రోడ్డు ప్రమాదాలు ఎలా తగ్గించవచ్చో చూపించండి.

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘‘అతివేగం హానికరం’’, మొబైల్‌ఫోన్లు వాడుతూ వాహనాలు నడపొద్దు.. అని రకరకాలుగా ప్రమాదాల విషయంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినప్పటికీ ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్య తగ్గడం లేద సరికదా.. ఏటికేడాదీ పెరిగిపోతూనే ఉన్నాయి. కోవిడ్ మహమ్మారితో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన 2020ను మినహాయిస్తే గత ఐదేళ్లలో ఏటా కనీసం నాలుగున్నర లక్షల ప్రమాదాలు జరుగుతూండగా కొంచెం అటు ఇటుగా ఏటా 1.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హైవేలు, రహదారి రవాణా మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీటిల్లో 45 శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాలవే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ‘సేఫ్ జర్నీ’ కార్యక్రమం కింద దేశ యువతకు ఈ పోటీ ఏర్పాటు చేసింది.
విద్యార్థి బృందాలకే చోటు..
సియామ్ ఏర్పాటు చేసిన ఈ పోటీలో పాల్గొనేందుకు ఇద్దరి నుంచి నలుగురు డిగ్రీ విద్యార్థులున్న బృందాలకే చోటు. గుర్తింపు పొందిన కళాశాలల అధ్యాపకులు ఈ బృందాలకు ఓకే చెప్పిన తరువాత మాత్రమే పోటీలో పాల్గొనవచ్చు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఏం చేయవచ్చు? అన్నదానిపై 15 నుంచి 20 స్లైడ్స్ ఉన్న ప్రెజెంటేషన్‌ను సిద్ధం చేసి సమర్పించాలి. గదిలో కూర్చుని రెడీ చేయడం కాకుండా.. ఫీల్డ్‌వర్క్ కూడా చేయాలి. అవసరమైతే ప్రొటోటైప్‌లు సిద్ధం చేయాలి. ఎవరెవరితో మాట్లాడింది తెలపాలి. మీ ఐడియాను ప్రదర్శించేందుకు రెండు నిమిషాల వీడియో కూడా సిద్ధం చేయవచ్చు.
పరిష్కార మార్గాల్లో ప్రమాదాలు జరిగేందుకు అవకాశమున్న ప్రాంతాలపై డ్రైవర్లను అప్రమత్తం చేసే అప్లికేషన్లతపాటు సురక్షిత ప్రయాణానికి మెరుగైన పరికరాల ఆలోచనలూ ఉండవచ్చు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ లోపు విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకోవచ్చునని సియామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ కె.బెనర్జీ తెలిపారు. విజేతకు రూ.2.5 లక్షల నగదు బహుమతితోపాటు 2026 సేఫ్ సదస్సులో తగిన గుర్తింపు కూడా కల్పిస్తామని చెప్పారు. ఈ వినూత్న పోటీకి దేశీ కార్ల తయారీ సంస్థ సుజుకీ మోటార్స్ తన వంతు తోడ్పాటు అందిస్తోంది.


