నరసాపురం కూటమిలో విభేదాలు
● వేర్వేరుగా జనవాణి, ప్రజావాణి కార్యక్రమాలు
● అయోమయంలో ప్రజలు, కార్యకర్తలు
నరసాపురం: నరసాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎవరికి వారే అన్నట్లుగా ఆ రెండు పార్టీల నేతలకు పడడం లేదు. ఇప్పటికే రెండు పార్టీలు కలిసి నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో నాయకులు మధ్య విభేదాలు తెరమీదకు వచ్చాయి. ఏఎంసీ, ఇతర నామినేడెట్ పోస్టుల నియమకాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. శుక్రవారం పట్టణంలో టీడీపీ, జనసేన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించే కార్యక్రమం చేపట్టాచి. ఈ కార్యక్రమాన్ని రెండు పార్టీలు పోటాపోటీగా రెండు చోట్ల నిర్వహించడం చర్చనీయాంశమైంది. ప్రజలు ఎక్కడ తమ ఫిర్యాదులివ్వాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఒకరికిస్తే మరొకరు అలుగుతారోమోనని.. అర్ధంకాక చివరికి ఎవరికీ ఇవ్వకుండానే నిట్టూరుస్తూ వెనుదిరిగారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ స్థానిక జనసేన కార్యాలయంలో ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం పేరుతో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఇదే కార్యక్రమాన్ని పేరుమార్చి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పొత్తూరి రామరాజు స్థానిక టీడీపీ కార్యాయంలో ఏర్పాటు చేశారు. ఒకరేమో ఎమ్మెల్యే, మరొకరేమో టీడీపీ ఇన్‌చార్జ్. నియోజకవర్గంలో అనధికార ఎమ్మెల్యే. దీంతో ప్రజలకు ఎవరికి ఫిర్యాదులు ఇవ్వాలో అర్ధంకాలేదు. ఎవరికిస్తే తమ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయోనని ఆలోచనలో పడ్డారు. అధికారులు ఎమ్మెల్యే మాట విని తమ పనులు చేస్తారా? లేక టీడీపీ ఇన్‌చార్జ్ చెబితే స్పందిస్తారా? అనే సందిగ్ధంలో పడ్డారు.
విభేదాలు తారాస్థాయికి
ఈ రెండు పార్టీల్లోని నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ నేతల పెత్తనం ఏంటనే అభిప్రాయం జనసేన శ్రేణుల్లో ఉంది. ఇక రెండు నెలల క్రితం ఏఎంసీ కమిటీ ప్రమాణ స్వీకార సమయంలో ఆహ్వాన పత్రికలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పేరువేయలేదని ఆయన వర్గీయులు పెద్ద గొడవే చేశారు. పొత్తూరిని ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తొలగించాలని నిరసన తెలిపారు. ముందుగాా ఏఎంసీ చైర్మన్‌గా జనసేన నాయకుడి పేరును ప్రకటించారు. దీనిపై రెండు పార్టీల్లో పెద్ద గొడవే జరిగింది. మళ్లీ టీడీపీ నాయకుడికి ఈ పదవి కట్టబెట్టారు. దీంతో టీడీపీ ఆధిపత్యం ముందు జనసేన ఎమ్మెల్యే మాట నెగ్గలేదనే చర్చసాగుతోంది. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు ఎమ్మెల్యే చేపడుతున్న కార్యక్రమాలకు హాజరుకావడంలేదు. బండారు మాధవనాయుడు ఇంకా అలకవీడలేదు. ఇన్‌చార్జ్ బాధ్యతలు ఎలాగైనా పొత్తూరి నుంచి లాక్కుని తిరిగి తన రాజకీయ ప్రయాణం పరిగెట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ నేత కొత్తపల్లి నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎలా తప్పించకోవాలా? అతని ఎమ్మెల్యే నాయకర్ తంటాలు పడుతున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు టీడీపీ కీలకపేత, ఎన్నారై కొవ్వలి యతి రాజరామ్మోహన్‌నాయుడు అమెరికా నుంచి వచ్చి పట్టణంలోనే ఉన్నారు. ఆయన రెండు చోట్లకు హాజరుకాకపోవడంపై చర్చ సాగుతోంది. ప్రభుత్వ మైనార్టీ సలహాదారుగా ఎంఏ షరీఫ్ తన మార్కు రాజకీయంతో టీడీపీని గందరగోళంలోకి నెడుతున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో కూటమిలో రసవత్తర రాజకీయం నడుస్తోంది.
నరసాపురం కూటమిలో విభేదాలు


