టెట్ షరతు ఉపసంహరించాలి
ఏలూరు (టూటౌన్): ఇన్–సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ పరీక్ష పాస్ కావాలన్న నిబంధనపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఏలూరు జిల్లా శాఖ పేర్కొంది. ఈ మేరకు డీఈవోకు శుక్రవారం మెమోరాండం స్పందించారు. ఈ నిబంధనను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని డీఈవోని కోరారు. ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని, లేదా ఈ నిబంధనను పూర్తిగా ఉపసంహరించాలని, అందుకోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బేతాళ సుదర్శనం, సహా అధ్యక్షుడు అంగుళూరు సర్వేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కాకర్ల దొరబాబు, కోశాధికారి కుర్మా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు(మెట్రో): సంక్రాంతి వరకు రైతులకు ఏ మేరకు ఎరువులు అవసరమో తెలుసుకుని ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో రబీ సీజన్‌లో ఎరువుల సరఫరాపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువులు అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా సరఫరా చేయాలన్నారు. సాగు జరిగే అధిక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఈ–పంట నమోదుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు అవసరమైన ఎరువులను ముందుగానే సరఫరా చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి జిల్లాలో ఏ ప్రాంతంలో ఎరువులకు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వారం చివరిలో వచ్చే వారానికి అవసరమయ్యే ఎరువులు ముందుగానే సొసైటీలలో నిల్వ ఉండేలా వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలన్నారు. జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె.అభిషేక్ గౌడ, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, సహకారశాఖాధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: కన్నాయిగూడెం–పొంగుటూరు రోడ్డు దుస్థితిపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. శుక్రవారం రహదారిపై బిందెలతో నీళ్లు పోసి నిరసన తెలిపారు. పొంగుటూరు నుంచి కన్నాయిగూడెం మీదుగా ఎర్నగూడెం వెళ్లే రోడ్డు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతినడంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలు గ్రామానికి చేరుకోలేని పరిస్థితి నెలకొందని వారు ఆరోపించారు. మూడు సంవత్సరాలుగా కన్నాయిగూడెం శివారులో, పొంగుటూరుకు ఆనుకుని గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల కోసం మెటీరియల్ తరలించేందుకు ఈ మార్గంలో వంద టన్నులకు మించి బరువుతో లారీలు రాకపోకలు సాగించడంతో రహదారి మరింత దెబ్బతిందని గ్రామస్తులు తెలిపారు. ఈ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడం అన్యాయమన్నారు.
ఏలూరు(మెట్రో): వంట గ్యాస్ డెలివరీ సమయంలో చార్జీల పేరుతో వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె.అభిషేక్ గౌడ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ, రేషన్ సరుకుల పంపిణీపై పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది, రేషన్ షాప్ డీలర్లు, గ్యాస్ కంపెనీల డీలర్లతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వంట గ్యాస్ అందించే డెలివరీ బాయ్స్ ప్రతి వినియోగదారుడితో మర్యాదగా ప్రవర్తించేలా డీలర్లు పర్యవేక్షించాలని, రసీదు కంటే ఒక్కరూపాయి డిమాండ్ చేసినా, వసూలు చేసినా సంబంధిత డెలివరీ సిబ్బందితోపాటు, గ్యాస్ కంపెనీల డీలర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాల్లోని 5 కేజీల ఎల్‌పీజీ కనెక్షన్లను 14.2 కేజీల కనెక్షన్లుగా మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఏజెన్సీలను జేసీ ఆదేశించారు.


