తిరు వీధుల్లో శ్రీవారి దివ్య దర్శనం
ద్వారకాతిరుమల: తిరువీధుల్లో శ్రీవారి దివ్య దర్శనాన్ని పొందుతున్న భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఉభయ దేవేరులు, గోదాదేవితో పాటు శ్రీవారు క్షేత్ర పుర వీధుల్లో ఊరేగుతున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. ముందుగా ఆలయంలో విశేషంగా అలంకరించిన తొళక్క వాహనంపై సామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పూజలు జరిపారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అశ్వ, గజ సేవల నడుమ స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పుర వీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిట పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
చాట్రాయి: మండలంలోని నరసింహారావుపాలెం పీఏసీఎస్‌లో గురువారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షట్టరు తాళాలు పగలకొట్టి బీరువాలో ఉన్న రూ.1.80 లక్షలు ఎత్తుకుపోయారు. శుక్రవారం ఉదయం స్వీపర్ చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించింది. ఈ మేరకు ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్సై రామకృష్ణ పేర్కొన్నారు.
భీమడోలు: పూళ్ల గ్రామంలో బహిరంగంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తికి ఏలూరు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ జైలు శిక్షను విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. అతన్ని 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపారు. వివరాల ప్రకారం పూళ్ల గ్రామానికి చెందిన గెట్టం నాగసాయి అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండడంతో గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఆతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్, న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. నిందితుడ్ని ఏలూరులో కోర్టులో హాజరుపర్చగా కేసును విచారించిన జడ్జి ఆతనికి జైలు శిక్షను విధించారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విజయవాడకు చెందిన పలువురు దాతలు ఐదు టన్నుల కూరగాయలను శుక్రవారం విరాళంగా అందజేశారు. అవ్వారు వెంకటలక్ష్మి, అరవపల్లి సుబ్రహ్మణ్యం, బాలాజీ ఎలక్ట్రానిక్స్ అన్నపరెడ్డి లింగారెడ్డి, సాడి శ్రీనివాసరెడ్డి, స్వాతిలు ఈ కూరగాయలను అన్నదాన ట్రస్ట్ సూపరింటెండెంట్ కోటగిరి కిషోర్‌కు అందజేశారు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు శ్రీవారిని దర్శించే భక్తులకు అందించే అన్నప్రసాదంలో వీటిని వినియోగించాలని దాతలు కోరారు.
తిరు వీధుల్లో శ్రీవారి దివ్య దర్శనం


