అటవీ ప్రాంతంలో జామాయిల్ చెట్ల నరికివేత
కుక్కునూరు: అటవీ భూముల్లో చెట్లకు రక్షణ కరువైంది. అటవీశాఖ నిర్లక్ష్యం మూలంగా అటవీ భూముల్లోని జామాయిల్ చెట్లను కొందరు వ్యక్తులు అడ్డగోలుగా నరికివేసి వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని అమరవరం అటవీరేంజ్ పరిధిలోని కొండపల్లి గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో జామాయిల్ చెట్లను నరికేసి తరలించినట్లు సమాచారం. గతంతో ఇదే రేంజ్ పరిధిలో అటవీప్రాంతంలోని మారుజాతి కలపను, మాధవరం టేకు ప్లాంటేషన్‌లోని టేకు చెట్లను కొందరు వ్యక్తులు నరికి తరలించికెళ్లినట్టు ఆరోపణలొచ్చాయి. అంతేకాక ఇదే రేంజ్ పరిధిలో అటవీభూముల్లో జామాయిల్ నర్సరీలను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా అటవీప్రాంతంలో అక్రమాలు, ఆక్రమణలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.


