ఓబీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం మెడలు వంచాలి
పాలకొల్లు సెంట్రల్: కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఓబీసీ రిజర్వేషన్లు సాధించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం తూర్పుకాపు సామాజికవర్గం సభ్యులు ఓబీసీ రిజర్వేషన్ అంశంపై వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ గుడాల గోపితో పాటు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుడాల గోపి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తూర్పు కాపుల ఓబీసీ రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేయగా ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయిందని వివరించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 18 నెలలు గడిచినా ఇప్పటికీ ఓబీసీ రిజర్వేషన్ విషయాన్ని తేల్చలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా కలిసే ఉంది కాబట్టి తూర్పుకాపులు పార్టీలకతీతంగా కలిసిమెలసి పోరాటం చేస్తే ఓబీసీ రిజర్వేషన్లు సాధించవచ్చని అన్నారు. అనంతరం ముదునూరి మురళీకృష్ణంరాజు గతంలో ఓబీసీ రిజర్వేషన్లు 50 శాతం ముందుకు తీసుకువెళ్లిన ఘనత జగన్నన్నదేనని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పార్లమెంటు రాష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజీ, కోరాడ శ్రీనివాస్, తూర్పుకాపు సంఘ సభ్యులు లోపింటి చిరంజీవి, వాకాడ అప్పారావు, ఇజ్జాడ చినబాబు, జమ్ము కాశీ విశ్వనాథ్, జామాను బుజ్జి పాల్గొన్నారు.


