బెంబేలెత్తిస్తున్న నకిలీ ఈ–చలాన్లు
ఆగిరిపల్లి: మండలవాసులను నకిలీ ట్రాఫిక్ ఈ– చలాన్లు బెంబేలెత్తిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మండలంలో కొంతమందికి సైబర్ నేరస్తులు నకిలీ ఈ–చలాన్ లింకు వాట్సాప్‌నకు పంపి దోపిడీకి పాల్పడ్డారు. ఆగిరిపల్లికి చెందిన పల్లగాని కోటేశ్వరరావు అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా రెండు రోజుల క్రితం సైబర్ నేరగాళ్ల నుంచి ఈ –చలాన్ లింకు వచ్చింది. లింకు వచ్చిన కాసేపటికి సైబర్ కేటుగాళ్లు అతడి ఖాతాను హ్యాక్ చేసి తన ప్రమేయం లేకుండానే ఓటీపీలు వచ్చి అకౌంట్లో ఉన్న రూ.50 వేలను దోచుకున్నారు. అలాగే గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు లింకును క్లిక్ చేయగానే రూ.60 వేలు, మరో యువకుడివి రూ.5 వేలు కేటుగాళ్లు దోచేశారు. అంతేకాకుండా మండలంలో అనేకమంది ఫోన్‌లు కూడా హ్యాక్ అయ్యాయి. దీంతో ఫోన్‌కి ఏదైనా కొత్త మెసేజ్ వస్తేనే హడలిపోతున్నారు. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే విషయమై ఎస్సై శుభ శేఖర్ మాట్లాడుతూ నకిలీ వెబ్‌సైట్‌లపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎస్‌ఎంఎస్ ద్వారా వచ్చే లింకుల ద్వారా నగదు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సైబర్ మోసాలు గురైతే వెంటనే 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.


