పుష్కరాలకు 43 ఘాట్‌ల ఏర్పాటు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో రానున్న పుష్కరాలకు 43 పుష్కర ఘాట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ తెలిపారు. 2027 పుష్కరాలకు సంబంధించి ఆయా పనులకు అంచనాలు, సన్నాహక కార్యక్రమాలపై శుక్రవారం ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలవరంలో 35 ఘాట్‌లు, కుక్కునూరులో 3 ఘాట్‌లు, వేలేరుపాడులో 5 ఘాట్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టూరిజం శాఖ ద్వారాకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పారిజాతగిరి, జీలకర్రగూడెం బౌద్దాలాయాలు, గుబ్బలమంగమ్మ గుడి, పలు ఆలయాలను కలుపుతూ టూరిజం ప్యాకేజీలు ప్రకటిస్తుందని స్పష్‌టం చేశారు. ఆయా శాఖల చేపట్టే పనులపై అంచనాలు తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నట్లు ఆర్డీఓ వెల్లడించారు. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు సంబంధించి పోలీసు శాఖను సన్నద్ధం చేస్తున్నామన్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రమాదాలు జరగకుండా సీసీ కెమేరాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని నియమిస్తామని లైఫ్ జాకెట్లతో గోదావరిపై బోట్లను 24 గంటలు మూడు షిప్టులుగా నియమించి యాత్రికుల భద్రతే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కేవీ రమణ, విద్యుత్ డీఈ యు.సుబ్బారావు, ఆర్టీఓ ఎస్‌ఎస్ రంగనాయకులు పాల్గొన్నారు.


