రౌడీషీటర్ల కదలికలపై నిఘా
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో నేరాల నిరోధం... శాంతిభద్రతలకు విఘాతం లేకుండా చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో శాంతిభద్రతలపై ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లాలో పోలీస్‌స్టేషన్ల వారీగా రౌడీషీటర్ల సమాచారాన్ని, ప్రస్తుతం వారంతా ఏం చేస్తున్నారనే అంశాలపై పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు. రౌడీషీటర్ల కదలికలపై నిత్యం నిఘా ఉంచాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. రౌడీషీటర్లు సామాన్య ప్రజల జీవనానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.


