దొరమడుగు.. కనుమరుగు
తిమ్మాపురం పచ్చనేతల కబంధ హస్తాల్లో భూమి
ద్వారకాతిరుమల: పచ్చనేతల భూ కబ్జా తారాస్థాయికి చేరింది. దొరమడుగు భూమి 9 ఎకరాల మేర కబ్జా అయ్యిందని బహిరంగంగా చెబుతున్నా, నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. మండలంలోని తిమ్మాపురంలో ఆర్‌ఎస్ నెంబర్ 220లో 9 ఎకరాల దొరమడుగు పోరంబోకు భూమిని టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు కబ్జా చేశాడని అదే పార్టీకి చెందిన తూంపాటి పద్మవరప్రసాద్ ఆరోపించడంతో పాటు, అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎక్స్ సర్వీస్ మెన్ నుంచి గంటా శ్రీనివాసరావు 5 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా, మిగిలిన భూమిని తూంపాటి పద్మవరప్రసాద్ కబ్జా చేశాడని శ్రీనివాసరావు వర్గీయులు ఆరోపణలు చేస్తున్న విషయం విధితమే. పద్మవరప్రసాద్ తాత ఘంటా వెంకయ్య 1961లో ఈ భూమి తనదంటూ నెల్లూరులోని సెటిల్‌మెంట్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు. దీనిపై అప్పటి సెటిల్‌మెంట్ కోర్టు ఆర్‌ఎస్ నెంబర్ 220 లోని 1.90 ఎకరాల భూమి ఘంటా వెంకట్రామయ్యదని, మిగిలిన భూమి దొరమడుగు పోరంబోకని తీర్పు ఇచ్చింది. ఈ దొరమడుగు భూమిలోని సుమారు 5 ఎకరాలను ఎక్స్ సర్వీస్‌మెన్ నుంచి కొనుగోలు చేసినట్టు శ్రీనివాసరావు చెబుతున్నాడు. మిగిలిన 4 ఎకరాల పైగా భూమిలో చెరువు తవ్వుతున్నారు.. అది ఎవరి స్వాధీనంలో ఉంది.. వారికి ఉన్న హక్కులేమిటి అని నిగ్గు తేల్చాల్సిన అధికారులు కిమ్మనడం లేదు. రెవిన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.


