ద్వారకాతిరుమల ఈఓ నియామకంపై ఉత్కంఠ
ప్రతిపాదన ఉంది కానీ..
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం కొత్త ఈఓ నియామకంపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతోంది. ప్రస్తుత ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి ఈనెల 31న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఈఓ ఎవరొస్తారన్న దానిపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. గతంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓగా పనిచేసి, ప్రస్తుతం ఒంగోలు జీజీహెచ్‌లో పరిపాలనాధికారి (డిప్యుటీ కలెక్టర్)గా విధులు నిర్వర్తిస్తున్న కె.అద్దయ్య ఈఓగా నియమితులవుతారని కొందరు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా పని చేస్తున్న ఆర్‌జేసీ వేండ్ర త్రినాథరావు వస్తారని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీవారి దేవస్థానంలో డీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న వై.భద్రాజీని కొద్దిరోజుల పాటు ఇన్‌చార్జి ఈఓగా నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా ఈఓ నియామకంపై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే చివరి రోజుల్లో ప్రస్తుత ఈఓ పాలన గాడి తప్పుతుందన్న భక్తులు ఆరోపిస్తున్నారు. నూతన క్యూ కాంప్లెక్స్‌ను భక్తుల రద్దీ అధికంగా ఉండే ముక్కోటి రోజున ట్రయల్‌రన్ వేసేందుకు చేస్తున్న ప్రయత్నమే ఆరోపణలకు ప్రధాన కారణంగా ఉంది.
జరగరానిది ఏదైనా జరిగితే..
ఆలయ అనివేటి మండపం పక్కన రూ. 12.50 కోట్లతో నూతనంగా శాశ్వత క్యూ కాంప్లెక్స్‌ను నిర్మించారు. అది ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఈనెల 30న ముక్కోటి ఏకాదశి నాడు ఆ క్యూ కాంప్లెక్స్‌ను ట్రయల్ రన్ వేసేందుకు ఇంజనీరింగ్ విభాగ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు వచ్చే పర్వదినం నాడు ట్రయల్‌రన్ వేయడం ఏంటి? పలువురు విమర్శిస్తుంటే, కనీసం విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం కూడా చేయకుండా ట్రయల్ రన్ చేయడం మంచిది కాదని అంటున్నారు. 2002 మార్చి నెలలో శ్రీవారి ఆలయ నూతన తూర్పురాజగోపురం ప్రారంభం కాకుండానే అప్పటి లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగిని కొందరు నాయకులు ఆ గోపురంలో నుంచి ఆలయంలోకి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఆయన ప్రమాదానికి గురై మృతి చెందాడు. దాన్ని గ్రామస్తులు, భక్తులు ఇప్పటికీ మరచిపోలేదు. అది సెంటిమెంట్‌గా మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం పూజలు నిర్వహించకుండా ట్రయల్ రన్ పేరుతో క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తే.. ఆ తరువాత జరగరానిది ఏదైనా జరిగితే దానికి పూర్తి బాద్యత ఈఓనే వహించాల్సి వస్తుందని మండిపడుతున్నారు.
శ్రీవారి ఆలయ రాజగోపురాల సముదాయం
ఈ విషయంపై ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తిని విరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అయితే ఏఈఓ మెట్టపల్లి దుర్గారావును వివరణ కోరగా ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నుంచి గ్రామస్తులను, గోవింద దీక్షాదారులను, రూ.500ల ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులను పంపించాలనే ప్రతిపాదన ఉందని, అది ఇంకా ఫైనల్ కాలేదని స్పష్టం చేశారు.
మరో నాలుగు రోజుల్లో
రిటైర్ కానున్న ప్రస్తుత ఈఓ
క్యూ కాంప్లెక్స్ ట్రయల్ రన్‌పై ఈఓపై భక్తుల మండిపాటు


