బ్యారన్ సామగ్రి చోరీ
బుట్టాయగూడెం: తమ బ్యారన్‌లో ఉన్న సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు మహిళా రైతు బళ్లా భూలక్ష్మి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె ముప్పినవారిగూడెంలో విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సమీపంలో తనకు, నందిన సతీష్‌కు చెందిన ఆరు బేరన్‌లు ఉన్నాయని చెప్పారు. అయితే ఐదు నెలల క్రితం పొగాకు సీజన్ పూర్తయిన తర్వాత ఆరు బ్యారన్‌ల సామాగ్రిని గొట్టాలు, పొయ్యిలు, కర్రలు అన్నీ కలిపి ఒక బ్యారన్‌లో దాచిపెట్టినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం బ్యారన్‌లను పరిశీలించేందుకు వెళ్లగా అక్కడ తాళాలు పగలకొట్టి ఉండటాన్ని గమనించి, లోపలికి వెళ్లి చూడగా సామగ్రి లేదని చెప్పారు. అయితే ఈ సామాగ్రి ఖరీదు రూ. 4 లక్షల వరకూ ఉంటుందని చెప్పారు. ఈ చోరీ ఘటనపై పోలీసులను ఆశ్రయిస్తామని వెల్లడించారు.
నూజివీడు: మండలంలోని తుక్కులూరులో శుక్రవారం వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును దుండగులు చోరీ చేశారు. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పొన్నం నాగేశ్వరమ్మ(65) మెయిన్‌రోడ్డులో బడ్డీకొట్టు పెట్టుకుని జీవిస్తుంది. సాయంత్రం 4 గంటల సమయంలో బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి సిగరెట్లు కొనుగోలు చేసి ఫోన్‌పే ద్వారా రూ.50 చెల్లించారు. ఆ తర్వాత అదును చూసి మెడలో మూడు కాసుల గొలుసును తెంపుకుని పరారయ్యారు. ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో రూరల్ ఎస్సై లక్ష్మణ్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఏలూరు (టూటౌన్): 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన తండాలను, గూడాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా విభజించాలని ఎస్టీ బంజారా సుగాలి లంబాడి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.కృష్ణ నాయక్, డి.రాజా బాబు నాయక్ డిమాండ్ చేశారు.ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలంలోని నామవరం, రేచర్ల, పంతంగుల గూడెం తండాలను, టి.నర్సాపురం మండలంలోని కృష్ణాపురం తండాను, చాట్రాయి మండలంలోని పోతనపల్లి ( గంటిపాడు) తండాలను పరిపాలన సౌలభ్యం కోసం, గిరిజన ప్రజల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ 97 ప్రకారం మేజర్ పంచాయతీల నుండి విభజించి ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ప్రకటించాలని కోరారు.


