కృత్రిమ గాలులు పనిచేస్తాయా? | Sakshi
Sakshi News home page

కృత్రిమ గాలులు పనిచేస్తాయా?

Published Sun, Nov 26 2023 12:22 AM

Sakshi Editorial On Telangana Assembly Elections

ఇంకో నాలుగు రోజులు మాత్రమే! ఈనెల 30న తెలంగాణ రాష్ట్రం మూడో సర్కార్‌ ఎన్నికకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. మూడో అసెంబ్లీ ఎన్నిక ముక్కోణపు పోటీగా మారడం విశేషం. ఎన్నికలన్న తర్వాత సర్వేలు, ప్రజాభిప్రాయ నాడీ జ్యోతిష్యాలు, ‘గాలి’ వేగాన్ని అంచనా వేసి చెప్పడాలు... ఇటువంటి వన్నీ షరా మామూలే! ఒకదానికొకటి పొంతన లేకుండా రకరకాల సర్వే ఫలితాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఇలా పొంతన లేకపోడానికి కారణం... ఇందులో కొన్ని ‘ఉద్దేశపూర్వకమైనవి’ కావడమే!

అన్ని రకాల సర్వే ఫలితాలను క్రోడీకరిస్తే, ఒక మూడు అంశాలు నిగ్గుతేలుతున్నాయి. ఒకటి – ఈసారి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ గట్టి పోటీని ఎదు ర్కొంటున్నది. కొన్ని జిల్లాల్లో పాత బలాన్ని కాపాడుకున్నట్లు కనిపిస్తున్నా కొన్ని జిల్లాల్లో బలహీన పడినట్టు స్పష్టమవుతున్నది. రెండు – కాంగ్రెస్‌ పార్టీ గతంతో పోలిస్తే పుంజుకున్నది.

అయితే ఈ పరిణామం కొన్ని ప్రాంతాలకే పరిమితం. రాష్ట్రవ్యాప్తంగా కనిపించడం లేదు. మూడు – బీసీ ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత బీజేపీ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఇదే ప్రకటన ఒక రెండు మూడు నెలల ముందు చేసి ఉన్నట్లయితే ఆ పార్టీ పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

రాష్ట్రాన్ని భౌగోళికంగా విభజించి చెప్పవలసి వచ్చినప్పుడు ఉత్తర, దక్షిణ తెలంగాణలుగా చెప్పడం రివాజు. కానీ ఇప్పటి రాజకీయ పరిస్థితికి ఆ విభజన నప్పడం లేదు. రాష్ట్రానికి పడ మటి దిక్కున ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ (24), మెదక్‌ (10), నిజామాబాద్‌ (9) ప్రాంతాల్లోని అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ బలంగానే కనిపిస్తున్నది. మొత్తం సీట్లు 43. ఇందులో ఆనవాయితీగా మజ్లిస్‌ గెలిచే సీట్లు 7 తీస్తే మిగిలినవి 36. ఇందులో అత్యధిక సీట్లలో బీఆర్‌ఎస్‌ బలంగా ఉంటుందనీ, రెండో స్థానం కోసం బీజేపీ నుంచి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఎదుర్కోవచ్చనీ క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తున్నది.

ఖమ్మం జిల్లాను ఉత్తర తెలంగాణగానూ, నల్లగొండను దక్షిణ తెలంగాణను పరిగణిస్తుంటారు. సరిహద్దు జిల్లాలైన ఈ రెండింటినీ కలిపి తూర్పు తెలంగాణగా భావించవచ్చు. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 22 సీట్లున్నాయి. ఇక్కడ మెజారిటీ సీట్లలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉన్నదని చెబుతున్నారు. బీజేపీ పరిస్థితి అట్లా కాదు. వాయవ్య దిక్కు ఎంట్రీ పాయింట్లో (ముధోల్, ఆదిలాబాద్, బో«ద్, నిర్మల్, ఆర్మూర్, కోరుట్ల) బలంగా కనిపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా పాకెట్ల మాదిరిగా విస్తరించింది.

బీఆర్‌ఎస్‌ స్థావరంలో 36 సీట్లు ఉండటమే గాక రెండో స్థానం కోసం బీజేపీ నుంచి గట్టి పోటీని కూడా కాంగ్రెస్‌ ఎదుర్కోవలసి ఉన్నది. ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్‌ స్థావరంలోని 22 సీట్లలో బీఆర్‌ఎస్‌ కచ్చితంగా గెలవగలిగే సీట్లు ఆరు న్నాయి. మరో ఆరు సీట్లలో నువ్వా నేనా అనే పరిస్థితులున్నాయి. ఇది అధికార పార్టీకి సానుకూల అంశం. ఈ స్థావరాల నుంచి బయల్దేరి ఉమ్మడి జిల్లాలైన మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సీట్ల కోసం మూడు పార్టీలు వేటాడవలసి ఉన్నది.

ఆదిలాబాద్‌ జిల్లాపై మూడు పార్టీలకూ భారీగానే ఆశలున్నాయి. గాలివాటం ఎటువైపున్నా మూడు పార్టీలు కూడా కచ్చితంగా బోణీ కొట్టే అవకాశం ఉన్నది. బొగ్గు బెల్ట్‌లో కాంగ్రెస్‌ బలంగా ఉన్నదనీ, మిగిలిన ప్రాంతాల్లో బీఆర్‌ఎస్, బీజేపీలకు అవకాశాలున్నాయనీ స్థానిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిర్‌పూర్‌లో బీఎస్పీ అభ్యర్థి కూడా బలంగా కనిపిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మూడు సీట్లు గెలుస్తామన్న నమ్మకంతో బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు. పెద్దపల్లి బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉషకు కూడా రాష్ట్రవ్యాప్త గుర్తింపు లభించింది. రెండు ప్రధాన పార్టీల తరఫున రెడ్డి,వెలమ కులాలకు చెందిన ఇద్దరు బడా బాబులు హోరాహోరీ తలపడుతున్న చోట ఐఐటీ గ్రాడ్యుయేట్, పాతికేళ్ల పద్మశాలి యువతి గెలిస్తే బాగుండను కునే వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా చాలామందే ఉన్నారు.

ఇటువంటి కలలు ఫలించాలంటే మన ప్రజాస్వామ్యంలో చాలా పరిణతి రావాలి. ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే గదా ఏదో ఒకరోజు ఆ నవయుగం ఆవిష్కృత మయ్యేది. నిజానికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సంస్థాగతంగా బీఆర్‌ఎస్‌ చాలా బలంగా ఉన్నది. అయినా కాంగ్రెస్‌ పార్టీ బాగా పుంజుకున్నట్టు జరుగు తున్న ప్రచారం నేపథ్యంలో ఈ జిల్లాను హోరాహోరీ పోటీ కోటాలో వేయాల్సి వస్తున్నది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కూడా రెండు మూడు సీట్లలో సంచలనం సృష్టిస్తామని బీజేపీ నాయకత్వం చెప్పుకొస్తున్నది. అందుకు అను గుణంగానే చాప కింద నీరు మాదిరిగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. జిల్లాలో ప్రత్యేక ఆకర్షణ పాలకుర్తి నియోజ కవర్గం. ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్నారు.

ఓటమి ఎరగకుండా అనేక పోరాటాల్లో గెలిచిన వార్‌ వెటరన్‌ ఎర్రబెల్లి. కానీ ఈసారి ఒక పాతికేళ్ల యువతితో హోరాహోరీ పోటీని ఎదుర్కొంటు న్నట్టు వార్తలు వస్తున్నాయి. అమె రికాలో చదువుకొని వచ్చిన యశస్విని రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మంత్రికి గట్టి పోటీని ఇస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇప్పుడు రాజకీయ కురుక్షేత్రాన్ని తలపిస్తున్నది.

పద్నాలుగు నియోజకవర్గాలున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రస్తుతం టాప్‌ ట్రెండింగ్‌లో కొల్లాపూర్‌ నియోజకవర్గం ఉన్నది. రెడ్డి, వెలమ వర్గాలకు చెందిన ఇద్దరు దొరలు అక్కడ తలపడుతున్నందుకు కాదు. ఒక నిరుపేద దళిత యువతి... పేరు కర్నె శిరీషా అలియాస్‌ బర్రెలక్క. అక్కడ బరిగీసి నిలబడింది. ఏ పార్టీ అండ లేదు.

ఇండిపెండెంట్‌గానే! పుట్టెడు పేదరికం కారణంగా చిన్న టిఫిన్‌ సెంటర్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న తల్లికి అండగా ఉంటూ ఓపెన్‌ యూని వర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించ లేదు. నాలుగు బర్రెలు కొనుక్కొని పోషిస్తూ సోషల్‌ మీడియా ద్వారా బర్రెలక్క పేరుతో ప్రజా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది.

నిరుద్యోగ యువత తరఫున తాను నిరసనను వ్యక్తం చేయడానికి ఎన్నికలను ఒక సాధనంగా మలుచుకోవాలని నామినేషన్‌ వేసింది. ఈమె పోస్ట్‌ చేసిన వీడియోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రం నలు మూలల నుంచి యువతీ యువకులు తండోపతండాలుగా కొల్లాపూర్‌కు వెళ్లి బర్రెలక్కకు మద్దతును ప్రకటిస్తున్నారు. దీనర్థం అక్కడ బర్రెలక్క గెలుస్తుందని కాదు. అంత ఆశలేదు. ఒకవేళ కొల్లాపూర్‌ ప్రజల్లో హఠాత్తుగా ఏదో ఒక నవ చైతన్యం ప్రవేశించి బర్రెలక్క గెలిస్తే అదొక యుద్ధ ప్రకటనే! నోట్ల కట్టల ప్రజాస్వామ్యానికి రోజులు దగ్గర పడినట్టే!

ఉమ్మడి పాలమూరులో బీజేపీ మూడు సీట్లపై ఆశలు పెట్టుకున్నది. కర్ణాటక సరిహద్దుల్లోని ఒక నియోజకవర్గాన్ని, గతంలో రెండుసార్లు గట్టి పోటీ ఇచ్చిన మరో నియోజక వర్గాన్ని ఖాయంగా గెలుస్తామని ఆ పార్టీవారు చెబుతున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ ఈ జిల్లాలో మెజారిటీ సీట్లు గెలుస్తామని ఢంకా బజా
యించి చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక పవనం బాగా బలంగా ఉంటే తప్ప బీఆర్‌ఎస్‌ ఆధిక్యాన్ని తగ్గించడం ఈ జిల్లాలో సాధ్యం కాకపోవచ్చు.

బీఆర్‌ఎస్‌ను ఓడించి అధికారంలోకి ఖాయంగా వస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ అందుకు దోహదపడే కారణ మేమిటో స్పష్టంగా చెప్పలేకపోయింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కారణమా? లేక కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను చూసి జనం మురిసిపోతున్నారనుకోవడమా? ప్రభుత్వ వ్యతిరేకతే కారణమైతే కాంగ్రెస్‌కే జనం ఎందుకు ఓట్లేయాలి? బీజేపీ రూపంలో మరో ప్రత్యామ్నాయం కూడా ఉన్నది కదా! పైగా బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామని బీజేపీ చేసిన వాగ్దానం మెజారిటీ రాష్ట్ర ప్రజలను ఆకర్షి స్తున్నప్పుడు కాంగ్రెస్‌నే ప్రత్యామ్నాయంగా ఎందుకుఎంచుకోవాలి?

కాంగ్రెస్‌ మేనిఫెస్టో పట్ల సానుకూలత పెల్లుబకడానికి అందులో ఏమున్నది? కేసీఆర్‌ అమలు చేస్తున్న కార్యక్రమాలనే కొంచెం అటూ ఇటూ మార్చి అచ్చేశారు. ఆయన ఇస్తున్న డబ్బుల కంటే ఎక్కువ ముట్ట చెబుతామని చెప్పారు. కాలాను గుణంగా ఎవరైనా ఈ పెంపుదల చేయాల్సిందే. అంతకుమించిన మౌలికమైన మార్పుల ప్రతిపాదన ఈ మేనిఫెస్టోలో ఏమీ లేదు. అంతకంటే బీజేపీ చెప్పిన బీసీ ముఖ్యమంత్రే వ్యవస్థలో ఒక గుణాత్మకమైన మార్పును సూచించే హామీ అవుతుంది.

కనుక కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాలకు అనుగుణంగా ప్రజాస్పందన ఉన్నదనేది అవాస్తవం. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని అనుకుంటే ప్రతిపక్షానికి జరిగే లబ్ధిలో బీజేపీ కూడా కచ్చితంగా భాగస్వామి అవుతుంది. ఆ పార్టీ చెబుతున్నట్టు రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఒక ప్రభంజనంలా లేకుండా సాధారణ స్థాయిలోనే ఉంటే బీఆర్‌ఎస్‌ పార్టీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించే అవకాశాలే ఉంటాయి.

పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఎంతోకొంత వ్యతిరేకత వ్యక్తమవడం సర్వసాధారణం. కానీ తెలంగాణలో ఇప్పుడు ప్రచార మవుతున్నంత తీవ్రస్థాయిలో ఉన్నదా అనేది సందేహాస్పదం. అంత తీవ్ర వ్యతిరేకతకు తగిన ప్రాతిపదిక లేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్‌లో వ్యాపార ప్రయోజనాలున్న కొందరు కోటీశ్వరులు గత కొంతకాలంగా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని తప్పించే ఉపాయాలను అన్వేషిస్తున్నారు.

సలహాలు – సంప్రతింపుల కోసం యెల్లో మీడియా పెద్దలను కూడా తరచూ కలుస్తున్నట్టు ఇప్పుడిప్పుడే వార్తలు బయట కొస్తున్నాయి. ఈ వ్యవహారానికి అందుబాటులో ఉండి మార్గదర్శనం చేయడం కోసమే చంద్రబాబు లేని జబ్బులు తెచ్చుకొని మెడికల్‌ బెయిల్‌ సంపాదించారన్నది నిర్ద్వంద్వంగా రూఢి అవుతున్నది. ఆయన రహస్య భేటీలు నిరాఘాటంగా జరిగిపోతున్నాయి.

ఈ మొత్తం స్కీములో భాగంగానే తెలంగాణ రాజకీయ వాతావరణంలోకి కృత్రిమ పవనాలను ప్రవేశ పెట్టినట్టు తెలుస్తున్నది. కొన్ని సర్వే సంస్థలను వశపరచు కొని అనుకూలమైన రిపోర్టులను ప్రచారంలో పెట్టారు. సరికొత్త ఎత్తుగడగా రూమర్‌ స్ప్రెడర్‌లను (వదంతుల వ్యాపకులను) రంగంలోకి దించారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ దగ్గర ఈ రూమర్‌ స్ప్రెడర్స్‌ తమ వృత్తి నైపుణ్యాలను ప్రదర్శించారు.

కాంగ్రెస్‌ పార్టీ వేవ్‌ రాబోతున్నదని, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదని సోషల్‌ మీడియా ప్రచారానికి ఆజ్యం పోశారు. దసరా సెలవులను కూడా ఈ ప్రయోజనానికి వాడు కున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగితే పిల్లలకు ఉద్యోగాలు రావనే ప్రచారం విస్తృతంగా చేశారు. క్షేత్రస్థాయిలో జరుగు తున్న ఈ వ్యతిరేక ప్రచారాలను అధికార వర్గాలు గానీ, అధికార పార్టీ కార్యకర్తలు గానీ పసిగట్టలేకపోయారు.

ఒక స్వార్థ వ్యాపార – రాజకీయ ముఠా రూమర్‌ స్ప్రెడర్స్‌నూ, సోషల్‌ మీడియా సైన్యాన్నీ రంగంలోకి దించి బీజేపీ సింగిల్‌ డిజిట్‌ దాటదనీ, ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదనీ గత రెండు మాసాలుగా పెద్దఎత్తున ప్రచారంలో పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా గాలి వీస్తున్నదనే ప్రచారాన్ని మొదలు పెట్టారు.

ఈ కృత్రిమ ‘గాలుల’ ప్రభావం ప్రజల మీద ఏ మేరకు పడిందనే విషయం మరో వారం రోజుల్లో వెలువడే ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది. ఎన్నికల ఫలితాలను హైజాక్‌ చేయడానికి ఈ ముఠా ఇంత తీవ్రంగా ఎందుకు ప్రయత్నిస్తున్నదో, ఇన్ని వ్యయ ప్రయాసలకు ఎందుకోర్చుకుంటున్నదో ప్రజలు తెలుసుకోవలసిన అవసరం ఉన్నది.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Advertisement
 
Advertisement