గడువున్నా.. వినకుండా.. | - | Sakshi
Sakshi News home page

గడువున్నా.. వినకుండా..

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

కాకినాడ క్రైం: ప్రభుత్వ పెద్దల మెప్పు పొందాలన్న తాపత్రయంతో పోలీస్‌ ఉన్నతాధికారుల అత్యుత్సాహం కారణంగా ఆ శాఖలోని దిగువ స్థాయి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. బదిలీలకు రెండేళ్ల గడువునిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినా ముందుగానే మొదలు ఆ ప్రక్రియ మొదలు పెట్టేశారు. దీని వల్ల ఉన్నచోటు నుంచి మరో ప్రాంతానికి బదిలీ కావాల్సి రావడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

18 నెలల సమయం ఉన్నా..

2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉద్యోగుల విభజనకు పచ్చ జెండా ఊపుతూ గతేడాది డిసెంబర్‌ 15న రాష్ట్రపతి గెజెట్‌ విడుదల చేశారు. బదిలీలకు సుమారు రెండేళ్లకు పైగా గడువిచ్చారు. ఈ వ్యవధిని పట్టించుకో అధికారులు ఉత్తర్వులను బుట్టదాఖలు చేశారు. మరో 18 నెలల సమయం ఉన్నా మా నిర్ణయమే ఫైనల్‌, మేం చేసేదే విభజన అన్నట్లుంది వారి వ్యవహారం. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అనేక మంది ఉద్యోగులు, వారి కుటుంబాలను ఆందోళనలోకి నెడుతున్నారు.

త్వరలో మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇది ఎన్నికల స్టంట్‌గా ఉద్యోగులు భావిస్తున్నారు. గెజెట్‌ విడుదల నేపథ్యంలో ఉద్యోగులతో సహా విభజన పూర్తయితే కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాలకు వచ్చే అభివృద్ధి నిధులు ఎన్నికలకు వినియోగించే కుయుక్తులకు తెరతీశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

3500 కుటుంబాలపై ప్రభావం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 3,500 మంది పోలీసు శాఖలో పనిచేస్తున్నారు. స్వయానా రాష్ట్రపతే రెండేళ్లకు పైగా ఉద్యోగుల విభజన, బదిలీలకు సమయమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే, ఉన్నతాధికారులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం తమ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా పోలీస్‌ శాఖలో ఇప్పటికే ఈ కసరత్తు మొదలైందని అధికారులు నిర్ధారించారు. విభజిత జిల్లాల పోలీసుశాఖకు కాకినాడ జిల్లా ఎస్పీ.. నోడల్‌ ఆఫీసర్‌ కావడం వల్ల ఈ ప్రక్రియ కాకినాడ కేంద్రంగానే జరుగుతోంది.

సీనియర్లు, జూనియర్ల మధ్య అంతరం

ప్రభుత్వ నిర్వాకం సీనియర్‌, జూనియర్ల మధ్య అంతరాలకు కారణమవుతోంది. ప్రభుత్వం ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కోరుతున్నా అందులో స్థానికతకు బదులుగా సీనియారిటీకే పెద్ద పీట వేస్తున్నారు. దీంతో జూనియర్లకు అన్యాయం జరుగుతోందని, ఈ ప్రభావం జీతాల పెరుగుదల, పదోన్నతులపై పడే అవకాశం ఉందని సమాచారం. స్థానాల ఎంపికలో సీనియర్లు, జూనియర్లు రెండు వర్గాలుగా విడిపోవడం అంతరాలకు కారణమవుతోందని సమాచారం.

ఎంత కష్టమో..

ఇంకా 18 నెలల సమయం మిగిలి ఉండగానే తొందరపడి చేస్తున్న ఉద్యోగుల విభజన, బదిలీల ప్రక్రియల వల్ల పోలీస్‌ సిబ్బంది వారి కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యా సంవత్సరం ఇప్పటికే మొదలవడం వల్ల తమ పిల్లలను స్కూళ్లు, కళాశాలల నుంచి మార్చడం అంత సులువు కాదని సిబ్బంది అంటున్నారు. వీరిలో భాగస్వామి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రస్తుత ప్రాంతాల్లోనే పనిచేస్తుంటే, వారు ఉద్యోగం మానుకునైనా ఉన్న చోటు నుంచి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే స్పౌజ్‌ కోటా వర్తింపుపై ఎటువంటి స్పష్టతా లేదు. త్వరలో పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగుల బాధ వర్ణనాతీతం. స్థిరపడిన చోటు నుంచి మరో చోటుకి వెళ్లడం బదిలీ చేసినంత సులువు కాదు. వీరితో పాటు 30 ఏళ్లకు పైగా సర్వీసుతో జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. బదిలీ అంటూ జరిగితే ఏకంగా వీరంతా జిల్లా మారిపోవాల్సి ఉంటుంది. వీరి స్థానచలనాల పరిధి జిల్లాలోనే కాబట్టి మిగిలి ఉన్న యావత్‌ ఉద్యోగ జీవిత కాలంలో మళ్లీ ప్రస్తుతం ఉన్న చోటుకు రాలేరు. ప్రభుత్వ తీరుపై వీరంతా రగిలిపోతున్నారు. ఇప్పటి వరకు అభ్యంతరాల స్వీకరణ అయినా లేకుండా ఏకపక్షంగా ప్రక్రియ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

పోలీస్‌ శాఖలో ఉన్నతాధికారుల నిర్వాకం

18 నెలలు మిగిలి ఉండగానే

కింది స్థాయి ఉద్యోగుల బదిలీలు

ప్రభుత్వానికి భజన.. ఉద్యోగుల విభజన

ఆవేదన వ్యక్తం చేస్తున్న సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement