వరద వేళ.. సంరక్షణ ఇలా.. | - | Sakshi
Sakshi News home page

వరద వేళ.. సంరక్షణ ఇలా..

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

పశువులను జాగ్రత్తగా చూడాలి

పాడి రైతులకు డిప్యూటీ డైరెక్టర్‌

అనిత సూచనలు

కపిలేశ్వరపురం: ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరదతో గోదావరి ఉప్పొంగుతోంది. తీర ప్రాంతాలు, లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వరద కారణంగా అక్కడ ఉండే పశువులను జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఈ నేపథ్యంలో అమలాపురం డిప్యూటీ డైరెక్టర్‌ ఎల్‌.అనిత.. పాడి రైతులకు పలు సూచనలు చేశారు.

● లంక గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. తరలించడానికి వీలు కానప్పుడు పశువులకు కట్టిన తాళ్లను వదులు చేయడం మంచిది. నీరు చుట్టిముట్టినప్పుడు పశువు తాడును వదిలించుకుని ఈదుకుంటూ ప్రాణాన్ని కాపాడుకోగలుగుతుంది.

● పశువులు దొమ్మ, జబ్బవాపు, ఆంత్రాక్స్‌ వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముంపునకు గురైన పచ్చిక బయళ్లలోని గడ్డిని, బూజుపట్టిన ఎండు గడ్డిని తినకుండా చూడాలి. పశువులు కలుషిత నీటిని తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిలో ఎక్కువ సేపు ఉండడం వల్ల పశువుల గట్టలు, కాళ్లకు పలు వ్యాధులు వ్యాపిస్తాయి.

● పశువుల వ్యాధుల బారిన పడితే పాల దిగుబడి తగ్గడంతో పాటు పొదుగు వాపు వ్యాధి కూడా వస్తుంది. 105 డిగ్రీల జ్వరం, ఊపిరి ఆడక ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో స్పందించకపోతే గొంతు పూడుకుపోయి గాలి ఆడక చనిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా టీకా వేసిన ఆరు నెలల వరకూ మందు పనిచేస్తుంది. వరద పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆరు నెలల లోపే మరో డోసు వేసినా ఇబ్బంది ఉండదు.

● వరద నీరు వీడిన వెంటనే పశువు కాళ్లు, గిట్టలను క్షుణ్ణంగా పరిశీలించాలి. నడిచే స్థితిని బట్టి ఆరోగ్య స్థాయిని అంచనా వేయొచ్చు. వరద పరిస్థితి చక్కబడిన వెంటనే పెద్ద మొత్తంలో ఆహారాన్ని అందించకుండా క్రమంగా పరిమాణాన్ని పెంచుతూ ఉండాలి. ధాన్యం, పిండి వంటి పదార్థాలను నేరుగా పెట్టరాదు. బురద లేని చోట పశువులను కట్టుకోవాలి. పాలను క్రమం తప్పకుండా తీస్తుండాలి. పొదుగు వాపు ఉంటే వైద్యం చేయించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement